Saturday, May 4, 2024

Delhi | మధ్యలో వారిని చేర్చుకోలేం.. ఫైనలియర్ విద్యార్థులను పరీక్షకు అనుమతిస్తామన్న కేంద్రం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : విదేశాల్లో చదువుకున్న వైద్య విద్యార్థులను మధ్యలో మనదేశంలోని మెడికల్ కాలేజీల్లో చేర్చుకోడానికి అవకాశం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు బీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్‌కు బుధవారం కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డా. మన్సూఖ్ మాండవియా లేఖ రాశారు. ఉక్రెయిన్‌లో చదువుకుంటున్న భారతీయ వైద్య విద్యార్థుల సమస్యలపై 2022 డిసెంబర్ 13న లోక్‌సభ జీరో అవర్‌లో బీబీ పాటిల్ మాట్లాడారు. ఆయన లేవనెత్తిన అంశాలకు కేంద్రమంత్రి లేఖ ద్వారా పూర్తి సమాచారం ఇచ్చారు.

ఇండియన్ మెడికల్ కౌన్సిల్ చట్టం -1956, నేషనల్ మెడికల్ కమిషన్ యాక్ట్ – 2019లో మధ్యలో చేర్చుకునే అవకాశం కల్పించలేదని ఆయన చెప్పుకొచ్చారు. అయితే సుప్రీంకోర్టు గత ఏడాది జులైలో ఇచ్చిన తీర్పు ప్రకారం కోవిడ్-19, ఉక్రెయిన్-రష్యా యుద్ధం కారణంగా తమ వైద్య విద్యను కొనసాగించలేకపోయిన చివరి సంవత్సరం విద్యార్థులకు మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ పరీక్ష రాయడానికి అనుమతిస్తున్నామని లేఖలో పేర్కొన్నారు.

ఆ పరీక్షలో అర్హత సాధించిన వైద్య విద్యార్థులు తప్పనిసరిగా రెండేళ్ల పాటు మెడికల్ ఇంటర్న్‌షిప్ చేయాల్సి ఉంటుందని వివరించారు. ఈ ఇంటర్న్‌షిప్ పూర్తయిన తర్వాత మాత్రమే ఆ వైద్య విద్యార్థులు రిజిస్ట్రేషన్ పొందగలరని కేంద్రమంత్రి వెల్లడించారు. ఉక్రెయిన్ యుద్ధం కారణంగా వైద్య విద్యను మధ్యలోనే వదులుకున్న విద్యార్థులు 29 దేశాల్లో ఎక్కడైనా చదువుకునే వెసులుబాటు కల్పిస్తూ నేషనల్ మెడికల్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసిందని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement