Monday, May 6, 2024

గుర్తింపు లేకున్నా గుట్టుగా నడుపుతున్నరు.. పాఠశాలలపై పర్యవేక్షణ లేదు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక దాడి ఘటన జరిగిన బంజారాహిల్స్‌లోని డీఏవీ పాఠశాలకు 5వ తరగతి వరకే పాఠశాల విద్యాశాఖ (డైరెక్టర్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌) నుంచి అనుమతి ఉంది. కానీ నిబంధనలకు విరుద్ధంగా అక్కడ 6, 7 తరగతులను నిర్వహిస్తోంది. చిన్నారిపై లైంగిక దాడి జరగడంతోనే ఈ విషయం కూడా అధికారుల తనిఖీల్లో బయట పడింది. లేకుంటే ఇక అంతే సంగతులు. ఇలా ఈ ఒక్క పాఠశాలే కాదు రాష్ట్ర వ్యాప్తంగా భారీ సంఖ్యలో ఈ తరహా పాఠశాలలు నిబంధలకు విరుద్ధంగా నడుస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లోనైతే అనుమతిలేని పాఠశాలలు అధికంగా ఉంటాయని విద్యా వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

పాఠశాలకు అనుమతి తీసుకోవాలంటే ఒకటో తరగతి నుంచి ఐదవ తరగతి వరకు, ఒకటి నుంచి ఏడవ తరగతి వరకు, ఆరు నుంచి పదో తరగతి వరకు, ఎనిమిది నుంచి పదో తరగతి వరకు ఉంటుంది. లేదా ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ఇలా అనుమతులు పొందాల్సి ఉంటుంది. ఈ రకంగానే ప్రైవేట్‌ స్కూళ్లకు పాఠశాల విద్యాశాఖ అనుమతి ఇస్తోంది. కానీ చాలా వరకు స్కూళ్లు మాత్రం దీనికి భిన్నంగా కేవలం 1 నుంచి ఏడో తరగతి లేదా ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు అనుమతి తీసుకొని పదో తరగతి వరకు నడిపిస్తున్నారని విమర్శలు ఉన్నాయి. ఒకటి నుంచి ఏడో తరగతి వరకు అనుమతి తీసుకున్న కొన్ని పాఠశాలలు అనుమతి లేకున్నాగానీ ప్రవేశాలప్పుడు పదో తరగతి వరకు అడ్మిషన్లు తీసుకొని పరీక్షలప్పుడు సమీపంలోని మరో ప్రైవేట్‌ పాఠశాలతో కుమ్మక్కై దాని తరపున విద్యార్థులను పంపించి పరీక్షలు రాయిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇది పాఠశాల విద్యాశాఖ అధికారులకు తెలిసే జరుగుతున్నా.. అధికారులు మాత్రం చూసిచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు.

- Advertisement -

ప్రీ ప్రైమరీ స్కూల్లే ఎక్కువ!

గ్రేటర్‌ హైదరాబాద్‌లో అనుమతి లేని పాఠశాలలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. విద్యా సంవత్సరం ఆరంభంలోనే తనిఖీ చేసీ వీటిని అడ్డుకోవాల్సిన విద్యాశాఖ అధికారులు ఏంపట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 40,898 పాఠశాల్లో దాదాపు 60 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇందులో 30,135 ప్రభుత్వ పాఠశాలల్లో 27,68,595 మంది విద్యార్థులు ఉంటే, 10,763 ప్రైవేట్‌ బడుల్లో 32,37,749 మంది విద్యార్థులు చదువుతున్నారు. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాలో అనుమతి పొందిన ప్రైవేట్‌ పాఠశాలలు దాదాపు 4,666 వరకు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అనుమతి లేకుండా నడుస్తున్న పాఠశాలలు వందలు, వేల సంఖ్యల్లోనే ఉన్నట్లు అంచనా. ఇరుకు వీధుల్లో చిన్న చిన్న భవనాల్లో స్కూలు బోర్డులు పెట్టి వీటిని నడిపిస్తున్నారు.

ఒక్క గ్రేటర్‌ హైదరాబాద్‌ నగరంలోనే ఇవి భారీగా ఉంటాయని అంచనా. ప్రీ ప్రైమరీ తరగతులు నిర్వహించేందుకు అనుమతులు తీసుకోవాలని 2015లోనే ప్రభుత్వం సూచించింది. అయినా నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ తరగతుల నిర్వహణకు అనుమతులు తీసుకుని 5వ తరగతి వరకు కొందరు నిర్వహిస్తున్నారని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇక ప్లే స్కూల్‌ సంఖ్య మాత్రం హైదరాబాద్‌ నగరంలో భారీగా పెరిగింది. వేటికి అనుమతి ఉందో లేదో తెలియకుండానే విద్యార్థుల తల్లిదండ్రులు వాటిల్లో తమ పిల్లలను లక్షల్లో ఫీజులు చెల్లించి చేర్పిస్తున్నారు. ఇదిలా ఉంటే అనుమతి లేని పాఠశాలలు వంద వరకు మాత్రమే ఉంటాయని అధికారిక వర్గాలు స్పష్టం చేస్తుండటం గమనార్హం.

ఒకరకంగా చెప్పాలంటే అధికారుల వద్ద దీనికి సంబంధించిన పూర్తి స్థాయి సమాచారం లేనట్లుగా తెలుస్తోంది. అసలు గుర్తింపు పాఠశాలలు ఎన్ని ఉంటాయనే సమాచారాన్ని అధికారులు వెల్లడించడంలేదు. మరోవైపు గుర్తింపు లేకున్నాగానీ ఇష్టారాజ్యంగా స్కూల్‌ యాజమాన్యాలు ఫీజులు వసూలు చేస్తున్నాయి. మరోవైపు అధికారులు తనిఖీలకు వెళ్లినసమయంలో అన్ని రకాల ధ్రువపత్రాలను సమర్పించినట్లుగా చూపిస్తున్నారు. ట్రాఫిక్‌, అగ్నిమాపక శాఖ వంటి అనుమతుల్లేకుండానే నడిపిస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.

ఇప్పుడు హడావుడి చేస్తున్న అధికారులు…

సరైన మౌలిక వసతులు, ఆటస్థలం, ఫైర్‌ సేఫ్టీ వంటివి లేని బడులకు పాఠశాల విద్యాశాఖ అనుమతులు ఇవ్వకపోవడంతో కొన్ని ప్రైవేట్‌ స్కూల్స్‌ అనుమతి లేకుండానే వీటిని నిర్వహిస్తున్నాయి. ప్రవేశాల సమయంలో అనుమతి ఉన్నట్లుగా, పరీక్షలప్పుడు మాత్రం అనుమతి ఉన్న వేరే స్కూల్‌ నుంచి పరీక్షలు రాయిస్తున్నారు. అయితే పాఠశాలల అనుమతి, స్కూళ్ల వివరాలన్నీ తెలియని తల్లిదండ్రులు తమ పిల్లలను అనుమతి లేని స్కూళ్లో చేర్పించేస్తున్నారు. అయితే దీనిపై కొన్నేళ్లుగా వివిధ వర్గాల నుంచి అనేక ఫిర్యాదులు అధికారులకు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో విద్యాశాఖ వెబ్‌సైట్‌లో అందరూ చూసుకునేలా ప్రైవేట్‌ బడుల సమాచారం పొందుపర్చాలని అధికారులు ఈమేరకు నిర్ణయించారు. ఇటీవల బంజారాహిల్స్‌లోని డీఏవీ పాఠశాల ఘటన నేపథ్యంలో అధికారులు తేరుకొని ఈ చర్యలు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement