Sunday, May 19, 2024

Delhi | ఎస్సీ వర్గీకరణపై రాష్ట్రాలకే నిర్ణయాధికారం.. ఆ దిశగా పావులు కదుపుతున్న కేంద్రం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ)లకు కల్పిస్తున్న రిజర్వేషన్లలో వర్గీకరణకు వీలు కల్పించేలా రాజ్యాంగంలోని ఆర్టికల్ 341ను సవరించే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే నేరుగా జాతీయస్థాయిలోనే వర్గీకరణ చేపట్టకుండా అవసరమైన రాష్ట్రాలు వర్గీకరణ చేపట్టే వెసులుబాటును కల్పించాలని భావిస్తున్నట్టు తెలిసింది. దేశవ్యాప్తంగా ఎస్సీ జాబితాలోని కులాల స్థితిగతుల్లో ఏకరూపత లేకపోవడం, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవులు వంటి చోట్ల అసలు ఎస్సీ జనాభాయే లేకపోవడం వంటి అనేక కారణాలరీత్యా దేశవ్యాప్త వర్గీకరణ కంటే రాష్ట్రాల స్థాయిలోనే వర్గీకరణ చేపట్టే వెసులుబాటు కల్పించాలని భావిస్తున్నట్టు తెలిసింది.

పైగా కొన్ని కులాలు ఒక రాష్ట్రంలో ఎస్సీల జాబితాలో ఉంటే, మరికొన్ని రాష్ట్రాల్లో ఎస్టీల జాబితాలో, ఇంకొన్ని రాష్ట్రాల్లో బీసీల జాబితాలో ఉన్నాయి. మరోవైపు ఎస్సీ వర్గీకరణ మాదిరిగానే షెడ్యూల్డ్ తెగల(ఎస్టీ)లో కూడా వర్గీకరణ డిమాండ్ మొదలైంది. అటవీ ప్రాంతాల్లో ఉండే గిరిజన, ఆదివాసీల కంటే మైదాన ప్రాంతాల్లో ఉండే కొన్ని కులాలు రిజర్వేషన్ల ఫలాలు తన్నుకుపోతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఏ రాష్ట్రంలో వర్గీకరణ అవసరం అనుకుంటే ఆ రాష్ట్రం చట్టం చేసుకునేలా రాజ్యాంగంలోని 341వ అధికరణాన్ని సవరించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.

- Advertisement -

తెలుగు నేలపై మొదలై…

ఎస్సీ రిజర్వేషన్లలో వర్గీకరణ కోసం దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో డిమాండ్లు ఉన్నప్పటికీ… ఆ డిమాండ్‌ను ఉద్యమంగా మార్చింది మాత్రం తెలుగు రాష్ట్రాల్లోనే. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎంఆర్పీఎస్) పేరుతో మంద కృష్ణ మాదిగ చేపట్టిన ఈ ఉద్యమం సుదీర్ఘకాలంగా కొనసాగుతోంది. పదవుల కోసం రాజీపడకుండా మంద కృష్ణ ఈ ఉద్యమాన్ని నడుపుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఎప్పటికప్పుడు ఒత్తిడి తెస్తూనే ఉన్నారు. తాజాగా శనివారం జరిగిన మాదిగ విశ్వరూప ప్రదర్శన సభకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని రప్పించగలిగారు.

ఆయన నోటి నుంచే ఎస్సీ వర్గీకరణ కోసం కమిటీ ఏర్పాటు ప్రకటన చేయించారు. తెలంగాణ జనాభాలో 17-18% వరకు ఎస్సీలు ఉన్నారు. వారిలో అత్యధికంగా 14% వరకు మాదిగలు ఉండగా.. మిగతా 3-4% లో మాలలు, ఇతర ఎస్సీ కులాలవారు ఉన్నారు. మాలల కంటే 4 రెట్లు అధిక జనాభా కలిగినప్పటికీ.. రిజర్వేషన్ల ఫలాలను ఆ మేరకు పొందలేని పరిస్థితిలో మాదిగలు ఉన్నారు. తెలంగాణ తరహాలో బిహార్‌లో పాశ్వాన్లు, ఉత్తర్‌ప్రదేశ్‌లో జాటవ్‌లు ఎస్సీ రిజర్వేషన్ల ఫలాలను మిగతా ఎస్సీ కులాలకు దక్కకుండా తన్నుకుపోతున్నారు.

ఫలితంగా రిజర్వేషన్ల ఫలాలు అందరికీ అందక, కొన్ని కులాలు మాత్రమే తరాలుగా ప్రయోజనం పొందుతున్నాయి. రిజర్వేషన్ల అసలు ఉద్దేశాన్నే నీరుగారుస్తున్నాయి. ఇన్ని దశాబ్దాలుగా రిజర్వేషన్లు అమలవుతున్నప్పటికీ అనేక కులాల స్థితిగతుల్లో ఎలాంటి మార్పు రాకపోవడానికి కారణం ఇదేనన్న విశ్లేషణలు ఉన్నాయి. ఈ పరిస్థితిని సరిదిద్దాలంటే ‘వర్గీకరణ’ ఒక్కటే పరిష్కారం అన్న ప్రతిపాదనలు తెరపైకి వచ్చాయి.

వర్గీకరణ యత్నాలకు విఘాతం

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2004లో తీసుకొచ్చిన ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం కొట్టేసింది. 2020లో మరోసారి ఈ అంశంపై ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు ఉంది అని చెబుతూనే ఏడుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది న్యాయమూర్తులతో కూడిన విస్తృత ధర్మాసనానికి ఈ అంశాన్ని అప్పగించాలని సూచించింది. ఈ వ్యవహారం ఇప్పటికీ సర్వోన్నత న్యాయస్థానంలో పెండింగులో ఉంది. 1994లో హర్యానా, 2006లో పంజాబ్, 2008లో తమిళనాడు రాష్ట్రాలు ఎస్సీ రిజర్వేషన్లలో వర్గీకరణ కోసం ప్రయత్నించాయి.

తాజాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో కర్ణాటకలోని నాటి బస్వరాజ్ బొమ్మై ప్రభుత్వం ఎస్సీ రిజర్వేషన్లలో వర్గీకరణ కోసం తీర్మానం చేసింది. సుప్రీంకోర్టులో ఈ అంశం పెండింగులో ఉన్నందున ఏ ప్రయత్నం కూడా ముందుకు సాగలేదు. 2000 సంవత్సరం మార్చిలో కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సమర్పించిన అఫిడవిట్ ప్రకారం ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా 7 రాష్ట్రాలు స్పందించగా.. 14 రాష్ట్రాలు వ్యతిరేకించాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అయితే ఎస్సీ జనాభా లేని రాష్ట్రాలు సైతం వ్యతిరేకించడం ఇక్కడ గమనార్హం. 2006-07లో కేంద్ర ప్రభుత్వం నాటి ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీల వర్గీకరణ అంశంపై ఉషా మెహ్రా కమిటీ ఏర్పాటు చేసింది.

ఆ కమిటీ వర్గీకరణకు అనుకూలంగా సిఫార్సు చేసినప్పటికీ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్స్ అంగీకరించలేదు. ఈ పరిస్థితుల్లో అందరి చూపు సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం ఇచ్చే తీర్పుపైనే ఉంది. కేవలం ఎస్సీల్లోనే కాదు ఎస్టీల్లోనూ రిజర్వేషన్ల ఫలాలు అందరికీ సమానంగా అందడం లేదని చెప్పేందుకు గణాంకాలతో కూడిన సమగ్ర సమాచారం ఉంది. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం వర్గీకరణకు అనుకూలంగా పావులు కదుపుతోంది. ఆర్టికల్ 370 రద్దు, మహిళా రిజర్వేషన్ల బిల్లు సహా ఎన్నో సంక్లిష్ట సమస్యలను రాజ్యాంగ సవరణల ద్వారా పరిష్కరిస్తున్న ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లలో వర్గీకరణకు వీలుకల్పించేలా రాజ్యాంగ సవరణ చేపట్టాలని చూస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement