Wednesday, May 15, 2024

Delhi | రాష్ట్ర ప్రభుత్వం తన వాటా జమ చేయలేదు.. కడప-బెంగళూరు కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టుపై కేంద్రం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: కడప-బెంగళూరు కొత్త రైల్వే లైన్ నిర్మాణ పనులు ఆగిపోడానికి రాష్ట్ర ప్రభుత్వం తన వాటా జమ చేయకపోవడమే కారణమని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. బుధవారం వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ విషయం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా సొమ్ము ఇచ్చే వరకు ప్రాజెక్టు పనులు ముందుకు సాగవని కూడా ఆయన స్పష్టం చేశారు.

కడప-బెంగళూరు రైల్వే లైన్ (268 కి.మీ) ప్రాజెక్ట్ కాస్ట్ షేరింగ్ పద్ధతిలో మంజూరైందని, ఆ ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టు వ్యయంలో 50% భరించాల్సి ఉంటుందని తెలిపారు. ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 2,705.98 కోట్లుగా లెక్కించినట్టు వెల్లడించారు. 2023 మార్చి నాటికి కడప-పెండ్లిమర్రి మధ్య రూ. 358.60 కోట్లతో 21.3 కి.మీ మేర రైల్వే లైన్ నిర్మాణం పూర్తయిందని తెలిపారు. 2006లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాసిన లేఖ ప్రకారం కడప నుంచి బెంగళూరుకు మదనపల్లి మీదుగా వెళ్లి కోలార్ వద్ద ప్రధాన లైన్‌కు కలిపేలా తొలుత అలైన్మెంట్ నిర్ణయించినట్టు వెల్లడించారు.

- Advertisement -

ఇప్పటి వరకు ఏపీ ప్రభుత్వం రూ. 189.95 కోట్లు మాత్రమే డిపాజిట్ చేసిందని పేర్కొన్నారు. 2020లో రాసిన మరో లేఖలో కేవలం భూసేకరణ ఖర్చు మాత్రమే భరిస్తామని ఏపీ ప్రభుత్వం తెలిపిందని అన్నారు. 2021లో రాసిన లేఖలో ముద్దనూరు – పులివెందుల – ముదిగుబ్బ మీదుగా వెళ్లి శ్రీసత్యసాయి ప్రశాంతి నిలయం (110 కి.మీ) వద్ద ప్రధాన లైన్‌కు కలిపేలా అలైన్మెంట్ మార్చాలని ఏపీ ప్రభుత్వం కోరిందని, ఆ మేరక అలైన్మెంట్ మార్చుతూ మంజూరు కూడా చేశామని కేంద్ర మంత్రి అన్నారు. అయితే ఏపీ ప్రభుత్వం తన వాటా ఖర్చు జమ చేయకపోవడం వల్ల ప్రాజెక్టు ముందుకు కదలడం లేదని స్పష్టం చేశారు.

ఏపీ ప్రభుత్వ వాటా జమ చేసిన తర్వాతనే ప్రాజెక్టు పనులు మొదలవుతాయని పేర్కొన్నారు. అనుబంధంగా అడిగిన మరో ప్రశ్నకు బదులిస్తూ.. రైల్వే ప్రాజెక్టుల నిర్మాణంపై వివిధ అంశాలు ప్రభావం చూపుతాయని, వాటిలో రాష్ట్ర ప్రభుత్వాల వాటాతో పాటు భూ సేకరణ, అటవీ అనుమతులు, ఇతర అనుమతులు, భౌగోళిక వాతావారణ పరిస్థితులు తదితర అంశాలు కూడా ఉంటాయని వివరించారు. ఈ పరిస్థితుల్లో ప్రాజెక్టు డెడ్‌లైన్ కచ్చితంగా చెప్పలేమని అన్నారు. మరోవైపు 2014 నుంచి బడ్జెట్ కేటాయింపులు గణనీయంగా పెరిగాయని అన్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి 694% మేర బడ్జెట్ కేటాయింపులు పెరిగాయిని వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement