Monday, April 29, 2024

Delhi | వికలాంగుల పెన్షన్ 5వేలకు పెంచాలి.. జోరువానలో ఢిల్లీలో దివ్యాంగుల ధర్నా

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: దివ్యాంగులకు సామాజిక భద్రత కల్పించేందుకు దేశవ్యాప్తంగా ఉద్యమాలను ఉద్ధృతం చేస్తామని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను ఆపాలని ఎన్పీఆర్డీ మహాధర్నాలో పాల్గొన్న వారు డిమాండ్ చేశారు. ఎన్పీఆర్డీ కేంద్ర కమిటీ ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దివ్యాంగులు ధర్నా నిర్వహించారు. జోరువానను సైతం లెక్కచేయకుండా పెద్దసంఖ్యలో జనం నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. మాజీ కేంద్రమంత్రులు, కాంగ్రెస్, సీపీఐఎం, డీఎంకే నేతలు ధర్నాలో పాల్గొని బాధితులకు మద్దతు తెలిపారు. 2011 నుంచి ఇందిరా గాంధీ జాతీయ వికలాంగుల పెన్షన్ రూ. 300 మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఇస్తోందని వక్తలు విమర్శించారు.

40 శాతం వైకల్యం కలిగిన వికలాంగులకు నెలకు 5 వేల రూపాయల పెన్షన్‌ను దేశవ్యాప్తంగా పెంచాలని డిమాండ్ చేశారు. వికలాంగులకు జాతీయ ఆహార భద్రత చట్టాన్ని ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ప్రతి వికలాంగులకు అంత్యోదయ అన్నయోజన కార్డులు జారీ చేయాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దివ్యాంగులకు జాబ్ కార్డ్స్ జారీ చేసి ప్రతి ఒక్కరికీ 200 రోజులు పని కల్పించాలని, రూ. 600 వేతనం ఇవ్వాలని కోరారు. 21 రకాల వైకల్యాలు కలిగిన వారికి జాబ్ కార్డ్స్ జారీ చేయాలన్నారు. 70శాతం మంది వికలాంగులు గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్నారని, వారందరికీ పని కల్పించే బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉందన్నారు.

అలాగే దివ్యాంగులకు రైల్వేలో రాయితీ ఇవ్వాలని, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. వైకల్యం ఉన్న వారికి విద్,యా ఉద్యోగాల్లో సమాన అవకాశాలు కల్పించాలని కోరారు. దివ్యాంగుల హక్కుల పరిరక్షణ కోసం, సమస్యల పరిష్కారానికి వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తామని ధర్నాకు హాజరైన వివిధ పార్టీల నాయకులు స్పష్టం చేశారు.

చర్చలకు ఆహ్వానం
దివ్యాంగుల సమస్యపై జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న మహాధర్నా ప్రతినిధి బృందాన్ని కేంద్ర ప్రభుత్వ వికలాంగుల సాధికారత సంక్షేమ శాఖ కార్యదర్శి రాజేష్ అగర్వాల్ చర్చలకు ఆహ్వానించారు. ప్రతినిధి బృందం ఆయనకు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement