Saturday, October 12, 2024

వీడిన మ‌ర్డ‌ర్‌ మిస్టరీ .. ఆరుగురు నిందితుల అరెస్టు

పెద్దపల్లి జిల్లా ధర్మారం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖిలావనపర్తి గ్రామ శివారులో రెండు రోజుల క్రితం హత్యకు గురైన సిలివేరు లింగమూర్తికి సంబంధించిన కేసులో పోలీసులు ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు. పెద్దపల్లిలోని ఏసిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏసీపీ సారంగపాణి వివరాలు వెల్లడించారు. జూలపల్లి మండల కేంద్రానికి చెందిన లింగమూర్తి ఈనె 15న గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని సీఐ ప్రదీప్ కుమార్, ఎస్సై శ్రీనివాస్ లు దర్యాప్తు ప్రారంభించగా, మృతుని సోదరుడు లచ్చయ్య కుమారులతోపాటు కుటుంబ సభ్యులు కలిసి హత్యకు పాల్పడినట్లు గుర్తించారని ఏసిపి వివరించారు.

లచ్చయ్యతోపాటు అతని కుమారులు మహేష్, శివకుమార్, శివకుమార్ బావమరిది మోడుంపూరి శ్రీకాంత్, ఇరుమల్ల గణేష్, మోటూరి తిరుపతి పథకం ప్రకారం హత్య చేశారని తెలిపారు. తన బాబాయి అయిన సిలివేరి లింగమూర్తితో భూమి గురించి గత కొన్నేళ్లుగా వివాదం ఉండగా, అట్టి విషయమై ఈ నెల 15న శివ కుమార్ ఇంటి దగ్గర గల వేప చెట్టు కొట్టే విషయంలో గొడవ జరిగిందని తెలిపారు. శివ కుమార్, అతని సోదరుడు మహేశ్, తండ్రి లచ్చయ్య, శ్రీకాంత్, ట్రాక్టర్ డ్రైవరు ఇరుమాళ్ల గణేశ్, మాటూరి తిరుపతిలు కలిసి లింగమూర్తి హత్యకు పథకం పన్నారన్నారు.

ఈ క్రమంలో శివకుమార్ తన డ్రైవరు గణేశ్ ఫోన్ తో లింగమూర్తికి ఫోన్ చేసి దొంగతుర్తిలో పూజ ఉందని పిలిపించారు. లింగమూర్తి బయలుదేరిన విషయం తెలుసుకుని అందరూ కలిసి కొత్తూరు మీదుగా మేడారం వచ్చారని, లింగమూర్తి ఖిలా వనపర్తి వద్దకు చేరుకోగానే ముందు అనుకున్న ప్రకారం అటకాయించి దాడికి పాల్పడ్డారన్నారు. బైక్ పై నుంచి కింద పడిపోయిన లింగమూర్తిని రోడ్డు పక్కన గల పొలంలో పడేసి తమతో తెచ్చుకున్న రాడ్లతో, కర్రలతో తలపై మూకుమ్మడిగా కొట్టడంతో లింగమూర్తి అక్కడికక్కడే మృతిచెందాడని తెలిపారు. మహేశ్ తనతో తెచ్చిన కట్టెతోపాటు మృతుని ఫోన్ ను సైతం దూరంగా పడవేయగా, శివ, శ్రీకాంత్ లు తెచ్చిన ఇనుప రాడ్లను తమ వెంట తీసుకు వెళ్లారన్నారు. అనంతరం శివకుమార్, మహేష్, శ్రీకాంత్ లు జూలపల్లికి రాగా, గణేశ్, తిరుపతిలు వారి ఇంటికి వెళ్ళిపోయారన్నారు. లింగమూర్తి సోదరుడు లచ్చయ్య రక్తం అంటిన బట్టలు, రాడ్ తీసుకొని కవర్ లో దాచి ఇంటి దగ్గరని గడ్డి వాములో పెట్టి పారిపోయారని తెలిపారు.

పరారీలో ఉన్న నిందితులను ఆదివారం అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించినట్లు తెలిపారు. ఈ మేరకు వారి వద్ద నుండి 3 ద్విచక్ర వాహనాలు, 6 మొబైల్ ఫోన్ లు, ఆయుధాలు, దుస్తులు స్వాధీనం చేసుకున్నామన్నారు. చాకచక్యంగా హత్య కేసును ఛేదించిన పెద్దపల్లి సీఐ ప్రదీప్ కుమార్, ధర్మారం ఎస్ఐ శ్రీనివాస్ తో పాటు సిబ్బందిని ఏసిపి అభినందించి నగదు రివార్డు లను అందజేశారు.ఈ సమావేశం లో సిఐలు ప్రదీప్ కుమార్, ఇంద్రసేనారెడ్డి, ఎస్ఐ శ్రీనివాస్ తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement