Tuesday, December 5, 2023

సువర్ణాధ్యాయం మొదలైంది.. ఓటు వేయని వారికీ సీఎంనే, మాన్‌ తొలి ప్రసంగం

సీఎంగా ప్రమాణస్వీకారం అనంతరం మాన్‌ ప్రసంగిస్తూ, ఆదర్శవంతమైన పాలన అందిస్తానని హామీ ఇచ్చారు. ప్రతిపక్ష నేతలను రెచ్చగొట్టే రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పారు. చిల్లర రాజకీయాలకు దూరంగా వుంటానని, అందులో తలదూర్చనని పేర్కొన్నారు. నాకు ఓటు వేయనివారికి కూడా నేను ముఖ్యమంత్రినే. ఇది వారి ప్రభుత్వం కూడా. వారి కోసం కూడా నేను పనిచేస్తాను. ఇది ప్రజాస్వామ్యం. ప్రతి ఒక్కరికీ హక్కులుంటాయి. నన్ను అహంకారిగా ప్రజలు భావించుకోకూడదు. ఆవిధంగా ప్రవర్తిస్తాను అని భగవంత్‌ మాన్‌ హామీ ఇచ్చారు. స్వాతంత్ర తదనంతర భారతం గురించే భగత్‌ సింగ్‌ ఎక్కువగా ఆందోళన చెందేవారని గుర్తు చేశారు. పంజాబ్‌ అభివృద్ధి కోసం పనిచేస్తానని, అన్నీ చిన్న సమస్యలేనని, ప్రతి దానికీ ఓ పరిష్కారం చూపిస్తామని భగవంత్‌ మాన్‌ ప్రకటించారు.

ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. నా ఎడమ వైపున ఢిల్లి కేబినెట్‌ ఉంది. కుడి వైపున ఎన్నికైన 91 మంది ఆప్‌ ఎమ్మెల్యేలున్నారు. వారికి చప్పట్లతో అభినందిద్దాం. ప్రమాణస్వీకారం ఇక్కడ ఏర్పాటు చేయడానికి ప్రత్యేక కారణం ఉంది. ఇంతకుముందు క్రికెట్‌ స్టేడియంలలో, రాజ్‌ భవన్‌లో ప్రమాణ స్వీకారోత్సవాలు జరిగేవి. నా హృదయంలో భగత్‌ సింగ్‌కు ప్రత్యేక స్థానం ఉంది. అందుకే సమరయోధుడి స్వగ్రామంలో వేదిక నిర్ణయించాం. భగత్‌ సింగ్‌ను ప్రేమించడం ప్రతి ఒక్కరి హక్కు. మీకు జన్మనిచ్చిన నేలను ప్రేమించండి. పంజాబీ ప్రజల కోసం ఇక్కడ ఉన్నాం. నిరుద్యోగం సమస్యను పరిష్కరిస్తాం. వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తాం. పంజాబ్‌లో మా పార్టీకి (ఆమ్‌ ఆద్మీ పార్టీ) ఓటు వేయని వారికి కూడా నేను ముఖ్యమంత్రిని. మొహల్లా క్లినిక్‌లు, ప్రభుత్వ పాఠశాలలను చూడటానికి వివిధ దేశాల నుండి ప్రజలు ఢిల్లికి ఎలావచ్చారో? ఇకమీదట పంజాబ్‌కు అలాగే వస్తారు. ‘చరిత్రలో సువర్ణ అధ్యాయం ప్రారంభమైంది. ఇది పాఠశాలల్లో బోధించబడుతుంది. మేము అమరవీరులు, స్వాతంత్య్ర సమరయోధులు, పెద్దల ఆశీర్వాదాలు కోరుకుంటున్నాము. పంజాబ్‌ ప్రజలకు ధన్యవాదాలు. ఈ పార్టీని స్థాపించి పంజాబ్‌కు తీసుకొచ్చిన అరవింద్‌ కేజ్రీవాల్‌కి కూడా ధన్యవాదాలు. మేము నిదానంగా ప్రారంభిస్తాము. సోషల్‌ మీడియాలో లేదా చెడు పదాలు ఉపయోగించవద్దని మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. పరిణతి చెందిన ప్రభుత్వం అధికారంలో ఉందని ప్రజలు భావించాలి అని భగవంత్‌ మాన్‌ తన ప్రసంగంలో పేర్కొన్నారు. 48 ఏళ్ల మిస్టర్‌ మాన్‌, 1970ల తర్వాత రాష్ట్రానికి అత్యంత పిన్న వయస్కుడైన ముఖ్యమంత్రిగా నిలిచారు.

- Advertisement -
   

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement