Sunday, May 5, 2024

ముగియనున్న ‘గంగా విలాస్’ యాత్ర… ప్రపంచంలోనే పొడవైన నదీ పర్యాటకంగా రికార్డు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: వారణాసి నుంచి ప్రారంభమైన ‘గంగా విలాస్’ రివర్ క్రూయిజ్ ప్రయాణం ఈ నెల 28తో ముగియనుంది. జనవరి 13న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ యాత్ర ప్రారంభమైంది. అస్సాంలోని డిబ్రూగఢ్‌ చేరుకోవడంతో యాత్ర ముగియనుంది. ముగింపు కార్యక్రమానికి కేంద్ర నౌకాయాన శాఖ మంత్రి శర్బానంద్ సోనోవాల్ ముఖ్య అతిథిగా పాల్గొంటారు. భారత ఉపఖండంలో పర్యాటక రంగానికి సరికొత్త ఊపునిచ్చేలా ప్రారంభమైన ఈ రివర్ క్రూయిజ్ పర్యటనకు రానున్న రెండేళ్ల కోసం టికెట్లు బుక్ అయ్యాయని కేంద్రం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది.

భారత్‌లోనే తయారు చేసిన ‘ఎంవీ గంగా విలాస్’ రివర్ క్రూయిజ్‌ వారణాసిలో తన ప్రయాణాన్ని ప్రారంభించి 3,200 కి.మీ దూరం ప్రయాణించి డిబ్రూగఢ్‌ చేరుకోనుంది. 50 రోజుల పాటు సాగిన ఈ ప్రయాణంలో మార్గమధ్యలో పాట్నా, బుద్ధ గయ, విక్రమశిల, ఢాకా, సుందర్‌బన్, కాజీరంగా నేషనల్ పార్క్ మీదుగా సాగుతుంది. ప్రపంచశ్రేణి సదుపాయాలతో డిజైన్ చేసిన ఈ క్రూయిజ్ 3 డెక్‌లలో 18 సూట్లతో మొత్తం 36 మంది పర్యాటకులు ప్రయాణించడానికి వీలుగా ఈ క్రూయిజ్‌ను రూపొందించారు. భారత్‌తో పాటు బంగ్లాదేశ్‌లో ప్రయాణం సాగించిన ఈ క్రూయిజ్, రెండు దేశాల పర్యాటక రంగాన్ని సరికొత్త ఎత్తులకు తీసుకెళ్లిందని కేంద్ర మంత్రి సోనోవాల్ అన్నారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement