Thursday, May 2, 2024

ఇసుక లారీలను అడ్డుకున్న రైతులు.. కౌలు డబ్బులు చెల్లించాలని ఆందోళ‌న‌

మహదేవపూర్, (ప్రభ న్యూస్): గోదావరి పరివాహక ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఇసుక రీచుల వల్ల పట్టాదారులు అవస్థలు పడుతున్నారు. తమకు ఇవ్వవల్సిన కౌలు డబ్బులు చెల్లించకుండా రీచుల్లో స్టాక్ యార్డులు ఏర్పాటు చేసుకుంటున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. రీచులకు సంబంధించిన అవసరాలు తీర్చుకునేందుకు తమ భూములు లీజుకు తీసుకుని కౌలు డబ్బులు మాత్రం చెల్లించడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం మద్దులపల్లి సమీపంలోని కుంట్లం రెండో క్వారీకి మద్దులపల్లి రైతులు భూములు తమ పంట భూములను లీజుకు ఇచ్చారు.

2022, 2023 సంవత్సరానికి గాను కౌలు డబ్బులు ఇవ్వాలని టీఎస్ఎండీసీ అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా స్పందించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో తమకు రావల్సిన లీజ్ అమౌంట్ ఇవ్వాల్సిందేనని శనివారం పట్టాదారులు ఇసుక లారీలను అడ్డుకున్నారు. తమకు రావల్సిన డబ్బులు వెంటనే ఇప్పించాలని రైతులు డిమాండ్ చేశారు. ఆందోళన సమాచారం అందుకున్న కాళేశ్వరం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రైతులను సముదాయించి పంపించారు

Advertisement

తాజా వార్తలు

Advertisement