Sunday, April 28, 2024

ఇక నుంచి ప్రతి ఏటా టెట్‌.. ప్రభుత్వానికి ప్రతిపాదనలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల భర్తీకి నిర్వహించే ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌)ను ఇక నుంచి ప్రతి ఏటా నిర్వహించాలన్న ఆలోచనతో తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా టెట్‌ను జరిపేందుకు క్యాలెండర్‌ ప్రకటించాలని కూడా ప్రభుత్వం ప్రతిపాదించినట్టు అత్యంత విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. విద్యా సంవత్సరం ఆరంభంలోనే ఆ ఏడాది టెట్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను ప్రకటించేలా మార్గదర్శకాలను సిద్ధం చేసే పనిలో పాఠశాల విద్యాశాఖ వర్గాలున్నట్టు తెలుస్తోంది.

టెట్‌ నిర్వహణకు సంబంధించిన విధివిధానాలను రూపొందించిన అధికార బృందం (పాఠశాల విద్యాశాఖ) తుది ఆమోదం కోసం సంబంధిత దస్త్రాన్ని విద్యా శాఖ కార్యదర్శి ద్వారా ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపించినట్టు చెబుతున్నారు. ఈ దస్త్రంపై అధికార ముద్ర పడిన వెంటనే టెట్‌ జరిపేందుకు వీలుగా షెడ్యూల్‌ను ఖరారు చేసి ప్రకటించే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. జూన్‌ 2వ తేదీ నుంచి రాష్ట్రంలో కొత్త విద్యా సంవత్సరం మొదలవుతుండడం ఆ రోజునే పాఠశాలలు పున: ప్రారంభమవుతుండడంతో ఒకటి రెండు రోజులు అటు ఇటుగా టెట్‌ షెడ్యూల్‌ను ప్రకటించాలన్న పట్టుదలతో పాఠశాల విద్యా శాఖ వర్గాలు పేర్కొన్నాయి.

క్రితం ఏడాది జూన్‌ 12న టెట్‌

కాగా గత ఏడాది (2022-23) జూన్‌ 12న టెట్‌ నిర్వహించిన సంగతి తెలిసిందే. అర్హత పరీక్ష నిర్వహించి ఏడాది కావొస్తుండగా మరోమారు ఈ పరీక్ష నిర్వహించాలని అధికారులు ప్రతిపాదించారు. జాతీయ ఉపాధ్యాయ బోధనా మండలి (ఎన్‌సీటీఈ) నిబంధనల ప్రకారం డిప్లమో ఇన్‌ ఎడ్యుకేషన్‌ (డీఎడ్‌), బ్యాచిలర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ (బీఎడ్‌) కోర్సుల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు టీచర్స్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌ (టీఆర్‌టీ) రాయడానికి అర్హులవుతారు. టెట్‌లో వచ్చిన మార్కులకు ఉపాధ్యాయ నియామక పరీక్షలో (టీఆర్టీ) ర్యాంకింగ్‌లో 20 శాతం వెయిటేజీ కల్పిస్తారు. ప్రతీయేటా 30 వేల మంది డీఈడీ, బీఈడీ ఉత్తీర్ణులవుతున్నట్టు ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఉపాధ్యాయ వృత్తిలో చేరేందుకు గతంలో కన్నా అధికంగా యువతీయువకులు పోటీ పడుతుండడం కారణంగా టెట్‌ రాసే వారి సంఖ్య అంతకంతకూ పెరిగి పోతోందన్న ప్రచారం ఉంది.

- Advertisement -

తెలంగాణాలో ప్రయివేట్‌, కార్పోరేట్‌ రంగంలో పాఠశాలల ఏర్పాటు అధికం కావడం.. హైదరాబాద్‌, వరంగల్‌ ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్‌, వికారాబాద్‌, రంగారెడ్డి వంటి జిల్లాల్లో ఇంటర్నేషనల్‌ పాఠశాలల ఏర్పాటు ఊపందుకోవడంతో టీచర్లకు ముఖ్యంగా బీఈడీ చదివినవారి ప్రాముఖ్యత పెరిగిందని సమాచారం. ఒక వైపు ప్రయివేట్‌, కార్పొరేట్‌ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తూనే మరో వైపు సర్కార్‌ కొలువును దక్కించుకునేందుకు టీచర్లు ప్రయత్నాలు సాగిస్తుండడంతో టెట్‌కు ఉన్న ప్రాధాన్యత పెరిగిందని, ఈ అర్హత పరీక్షలో అత్యధిక మార్కులు దక్కించుకోవడానికి అభ్యర్థుల నడుమ ఎక్కడా లేని పోటీ నెలకొందని చెబుతున్నారు.

మార్కులు పెంచుకునేందుకు విద్యార్థులు పరీక్షకు మళ్లి మళ్లి హాజరవుతుంటారని సమాచారం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత 2016 మే 22, 2017 జులై 23, 2022 జూన్‌ 12న మొత్తం మూడుసార్లు టెట్‌ పరీక్ష నిర్వహించారని, మరో నెలలో ఏడాది ముగుస్తున్నందువల్ల మళ్లి టెట్‌ జరపాల్సిన పరిస్థితి ఏర్పడిందని అధికారులంటున్నారు. ఈ మేరకు అనుమతి కోరుతూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్‌ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.

ఇప్పటికే టెట్‌లో అర్హత సాధించింది 4 లక్షల మంది

తెలంగాణ రాష్ట్రంలో టెట్‌లో ఇప్పటివరకు నిర్వహించిన టెట్‌లో మొత్తం 4 లక్షల మంది ఉత్తీర్ణత సాధించగా ఇంకా 2.50 లక్షల మంది డీఎడ్‌, బీఈడీ పూర్తయినవారు ఉత్తీర్ణులయ్యేందుకు పరీక్షలు రాస్తూనే ఉన్నారు. మరోవైపు మార్కులు మెరుగుపరుచుకునేందుకు పాసైనవారూ మళ్లి రాస్తూనే ఉన్నారు. గత ఏడాది పరీక్షకు 3.50 లక్షల మంది హాజరయ్యారు. మళ్లి జరిపినా కనీసం 3 లక్షల విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. కాగా గతేడాది టెట్‌ నిర్వహించిన వెంటనే టీఆర్‌టీ నోటిఫికేషన్‌ జారీ చేస్తామని పాఠశాల విద్యాశాఖ, ఇప్పటికి ఏడాది గడుస్తున్నా టీఆర్‌టీ నోటిఫికేషన్‌ అతీగతి లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నోటిఫికిషన్‌ ఎప్పుడు వెలువడుతుందోనన్న అతృతతో విద్యార్థులున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement