Friday, May 3, 2024

రగులుతున్న రణక్షేత్రం, ఉక్రెయిన్‌లో భీకర దాడులు.. పోలాండ్‌ పర్యటనకు బైడెన్‌

రష్యా దళాలు ఉక్రెయిన్‌లో భీతావహ దాడులను కొనసాగిస్తూనే ఉంది. సోమవారం కూడా పలుచోట్ల క్షిపణులు, బాంబులతో విరుచుకుపడింది. రాజధానినగరం కీవ్‌లోనూ విధ్వంసం కొనసాగుతోంది. తాజాగా సెంట్రల్‌ కీవ్‌లోని ఓ షాపింగ్‌ మాల్‌పై రష్యా దళాలు దాడులు జరిపాయి. ఈ దాడిలో శిథిలాల కింద చిక్కుకొని పలువురు మరణించినట్లు సమాచారం. ఆదివారం రాత్రి పొడిల్స్కీ రివర్‌పై దాడులు జరిగాయని స్టేట్‌ ఎమర్జెన్సీ సర్వీస్‌ ఆఫ్‌ ఉక్రెయిన్‌ అధికారులు చెప్పారు. ఈ ఘటనలో మూడు నాలుగు వాహనాలు ధ్వంసంకాగా.. షాపింగ్‌ మాల్లోని నాలుగు ప్లnోర్లు మంటల్లో చిక్కుకొన్నాయి. పలు ఇళ్లు కూడా ధ్వంసం అయ్యాయి. డజన్ల కొద్దీ అగ్నిమాపక దళాలు అక్కడకు చేరుకున్నాయి. ఉక్రెయిన్‌ అధికారులు ఈ దాడికి సంబంధించిన వీడియోను షేర్‌ చేశారు. మొత్తం 8 మంది మృతి చెందినట్లు ఉక్రెయిన్‌ అటార్నిజనరల్‌ పేర్కొన్నారు. కీవ్‌కు ఉత్తరాన భారీ పోరాటం కొనసాగుతోందని ఉక్రెయిన్‌ రక్షణమంత్రిత్వశాఖ పేర్కొంది. రాజధాని నగరానికి 25 కిలోమీటర్ల దూరంలో రష్యన్‌ బలగాలున్నాయని తెలిపింది.

రెండు రోజుల కిందట అతిపెద్ద స్టీల్‌ప్లాంట్‌పై విరుచుకుపడిన రష్యా, తాజాగా సుమి నగరంలోని ఓ అమ్మోనియా డిపోపై దాడిచేసింది. దీంతో భారీగా అమ్మోనియా విషవాయువు లీకైంది. దాదాపు 50 టన్నుల విషవాయువు ట్యాంక్‌పై రష్యా సేనలు దాడి చేయడంతో అవిగాల్లో కలిశాయి. అమ్మోనియాను ఎరువులు ఇతర పదార్థాల తయారీకి వినియోగిస్తారు. సుముఖింప్రోమ్‌ కెమికల్‌ ప్లాంట్‌లో ఈ ఘటన చోటు చేసుకొంది. అత్యవసర సిబ్బంది అక్కడకు చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ విషవాయువు మేఘం దాదాపు 2.5 కిలోమీటర్ల మేరకు వ్యాపించిందని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కెమికల్‌ ఫ్యాక్టరీకి సమీపంలోని గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. వెంటనే అడర్‌ గ్రౌండ్‌లలోకి వెళ్లాలని సూచించారు. ఒకవేళ ప్రమాదకరమైన వాయులను గుర్తించినట్లయితే బాత్‌ రూమ్‌లలో దాచుకోవాలని, వాయువు ప్రభావం తగ్గించడానికి వాటర్‌ షెవర్లను వినియోగించాలని చెప్పారు. సుముఖింప్రోమ్‌ కెమికల్‌ కర్మాగారంలో పలు రకాల రసాయనిక ఎరువులను తయారు చేస్తారు. ఇది శరీరంలోని పలు అవయవాలపై దుష్ప్రభావం చూపుతుంది. నొప్పులు, కాలిన గాయాలు, కళ్లు దెబ్బతినడం వంటివి చోటుచేసుకొంటాయి. ఇది భూమిపై చాలా రోజులపాటు ఉండిపోతుంది. రష్యా గతంలో ఉక్రెయిన్‌ వద్ద రసాయన ఆయుధాలు ఉన్నాయని ఆరోపించింది. ఈనేపథ్యంలో ఇటువంటి రసాయన కర్మాగారాలను లక్ష్యంగా చేసుకొంటోందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, పోర్టు సిటీ అయిన మరియుపోల్‌ను రష్యన్‌ దళాలు ఆక్రమించుకున్నాయి. పట్టణాన్ని తమకు స్వాధీనం చేయాలని ఉక్రెయిన్‌కు సూచించింది. అయితే ఎట్టిపరిస్థితుల్లోనూ పట్టణాన్ని ఖాళీ చేసేది లేదని ఉక్రెయిన్‌ ఉప ప్రధాని వరెష్‌చుక్‌ స్పష్టం చేశారు. ఆయుధాలను దించే ప్రశ్నేలేదని, ఇప్పటికే ఈ విషయాన్ని రష్యన్‌ దళాలకు చేరవేశామని వెల్లడించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement