Wednesday, May 1, 2024

13 జాతీయ అవార్డులు అందుకున్న తెలంగాణ.. పంచాయితీ‌రాజ్ అవార్డుల్లో అందనంత ఎత్తులో రాష్ట్రం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: కేంద్ర ప్రభుత్వం ప్రకటించి అందజేసిన అవార్డులే రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. సోమవారం ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా జాతీయ పంచాయతీరాజ్ అవార్డులు అందుకున్న అనంతరం విజేతలతో పాటు బీఆర్ఎస్ ఎంపీ (రాజ్యసభ) వద్దిరాజు రవిచంద్రతో కలిసి ఆయన ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ పల్లె ముఖచిత్రం మార్చి జాతీయ అవార్డులు సాధించడంలో మిషన్ భగీరథ కీలక పాత్ర పోషించిందని ఎర్రబెల్లి తెలిపారు. పచ్చదనం, పరిశుభ్రతతో పాటు పలు విభాగాల్లో మొత్తం 13 అవార్డులు సాధించిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని ఆయన గుర్తుచేశారు. దేశవ్యాప్తంగా ఉన్న 6.2 లక్షల గ్రామాల్లో 2.5 లక్షల గ్రామ పంచాయతీలు అవార్డుల కోసం పోటీపడ్డాయని తెలిపారు.

వాటిలో 46 గ్రామాలను అవార్డులకు ఎంపిక చేయగా, రెండింట మూడొంతల మేర ఏకంగా 13 అవార్డులు ఒక్క తెలంగాణ రాష్ట్రమే కైవసం చేసుకుందని, ఈ ఘనత సాధించడంలో సహకరించిన గ్రామ సర్పంచులు, అధికారులు, జిల్లా యంత్రాంగం సహా ప్రతిఒక్కరికీ అభినందనలు తెలియజేస్తున్నానని ఆయన వెల్లడించారు. తమ పనితనాన్ని గుర్తించి అవార్డులు అందించినందుకు కేంద్ర ప్రభుత్వానికి కూడా అభినందనలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు (కేసీఆర్) ‘పల్లె ప్రగతి’ పేరుతో ఓ కార్యక్రమాన్ని చేపట్టి ఒక ప్రణాళిక ప్రకారం గ్రామాలను అభివృద్ధి బాట పట్టించారని అన్నారు. నాలుగేళ్ళ క్రితం కేసీఆర్ కొత్త పంచాయతీ రాజ్ చట్టం తీసుకొచ్చారని, దాని ఫలితమే తెలంగాణ ఇన్ని ఉత్తమ గ్రామ పంచాయతీలను తయారుచేయగల్గిందని అన్నారు.

గతంలో ఉత్తమ గ్రామపంచాయతీ అనగానే ఒక్క ‘గంగదేవిపల్లి’ మాత్రమే కనిపించేదని, కానీ ఇప్పుడు రాష్ట్రంలో ప్రతి గ్రామం ఒక గంగదేవిపల్లిలా తయారవుతోందని అన్నారు. సోమవారం విజ్ఞాన్ భవన్‌లో జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో వరుసపెట్టి అవార్డుల మీదు అవార్డులు తీసుకుంటుంటే రాష్ట్రపతి, కేంద్ర మంత్రితో పాటు ఇతర రాష్ట్రాల మంత్రులు సైతం అభినందించారని గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలను తూచా తప్పకుండా అమలు చేస్తున్నామని, అందుకే ఇన్ని అవార్డులు గెలుచుకోగలిగామని ఎర్రబెల్లి అన్నారు. ఇకమీదట మొత్తం అన్ని విభాగాల్లో అన్ని అవార్డులు తెలంగాణయే గెలుచుకునేలా ముందుకెళ్తున్నామని చెప్పారు.

అవార్డులిస్తూ.. నిధుల్లో కోత పెట్టొద్దు

తెలంగాణ రాష్ట్రానికి అవార్డులు ఇస్తూ నిధుల్లో కోత పెట్టొద్దని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మిషన్ భగీరథ పథకానికి రూ. 19 వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ సిఫార్సు చేసినప్పటికీ కేంద్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని గుర్తుచేశారు. గుజరాత్ రాష్ట్రానికి ఇచ్చినట్లే తెలంగాణలో మిషన్ భగీరథకు నిధులు ఇవ్వాలని కేంద్రానికి, రాష్ట్రపతికి తాను మరోసారి విజ్ఞప్తి చేశానని అన్నారు. అలాగే గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన రూ. 907 కోట్లు మెటీరియల్ కంపోనెంట్ నిధులను విడుదల చేయాలని కూడా కోరినట్టు మంత్రి వెల్లడించారు. ఉపాధి హామీ పనిదినాలు పెంచడంతో పాటు, పథకాన్ని రైతులకు అనుసంధానం చేయాలని కోరానని తెలిపారు. పంటలు పెరిగాయని, కూలీలు దొరక్క రైతులు ఇబ్బందులు పడుతున్నారని కేంద్ర మంత్రికి చెప్పానని, కేంద్రం సానుకూలంగా స్పందిస్తుందని ఆశిస్తున్నానని అన్నారు.

ఉపాధి హామీ కూలీలకు ఆన్‌లైన్ విధానంలో అటెండెన్స్ ఏర్పాటుచేయడం దారుణమని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే కూలీలను అనుమానిస్తూ అవమానించేలా గంట గంటకూ వీడియో తీసి అప్‌లోడ్ చేయమని చెప్పడం కూడా సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. పంటలు ఆరబెట్టుకోవడం కోసం తాము కళ్ళాలను నిర్మిస్తే.. తమ అనుమతి లేకుండా ఉపాధి హామీ నిధులు ఉపయోగించుకున్నారని కేంద్ర ప్రభుత్వం అభ్యంతరం చెప్పిందని, దాంతో ఆ ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరించిందని చెప్పారు. అలాగే మెటీరియల్ కాంపోనెంట్ కింద పలుగు, పార, గునపం వంటి వస్తువులను ఇదివరకు కేంద్రం పరిగణలోకి తీసుకునేదని, కానీ ఇప్పుడు వాటిని జాబితా నుంచి తొలగించిందని అన్నారు. అయితే వాటిని తిరిగి జాబితాలో చేర్చాల్సిందిగా తాను కేంద్రాన్ని కోరానని చెప్పారు.

- Advertisement -

మంత్రికి అవార్డు గ్రహీతల సన్మానం

తెలంగాణ రాష్ట్రం ఇన్ని అవార్డులు సాధించడం వెనుక మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కృషి ఎంతో ఉందని చెబుతూ అవార్డు విజేతలు, గ్రహీతలు ఆయన్ను సన్మానించారు. మీడియా సమావేశం ముగిసిన వెంటనే ఆయనకు పుష్పగుచ్చాలు, శాలువాలు అందజేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. అనంతరం మంత్రితో కలిసి గ్రూప్ ఫొటో దిగారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కమిషనర్ హనుమంతరావు, అవార్డు గెలుచుకున్న గ్రామాల సర్పంచ్ లు, ఎంపీపీ లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, పంచాయితీరాజ్ శాఖ అధికారులు ఉన్నారు.

ఉత్తమ జిల్లా పంచాయతీగా ‘ములుగు’

నానాజీ దేశ్‌ముఖ్ సర్వోత్తమ్ పంచాయత్ తత్ వికాస్ పురస్కార్ విభాగం కింద దేశవ్యాప్తంగా ఉత్తమ జిల్లా పంచాయితీ(జిల్లా పరిషత్)లను ఎంపిక చేయగా, తెలంగాణలోని ములుగు జిల్లా 2వ స్థానంలో నిలిచింది. ఒడిశాలోని గంజాం జిల్లా మొదటి స్థానంలో నిలవగా, దాద్రానాగర్ హవేలి 3వ స్థానంలో నిలిచింది. ఉత్తమ జిల్లా పంచాయతీ అవార్డులు జిల్లా పరిషత్ ఛైర్మన్ కుసుమ జగదీశ్వర్ అందుకున్నారు. తెలంగాణలో ఒకప్పుడు మావోయిస్టు ప్రాబల్యంతో అత్యంత వెనుకబడిన జిల్లాల్లో ఒకటిగా ఉన్న ములుగు జిల్లా ఇప్పుడు రాష్ట్రంలోనే పర్యాటక రంగానికి నిలయంగా మారిందని, ఈ క్రమంలో అన్ని గ్రామాలను ఆదర్శప్రాయంగా తీర్చిదిద్ది మరింత ఆకట్టుకునేలా తాము కృషి చేస్తున్నామని కుసుమ జగదీశ్వర్ అన్నారు. ములుగు సమీపంలోని రామప్ప ఆలయం నుంచి ప్రారంభించి లక్నవరం సరస్సు, మేడారం, తాడ్వాయి ఫారెస్ట్ అడ్వెంచర్స్, ఏటూరునాగారం, బొగతా జలపాతం, ఇతర జలపాతాలు, మల్లూరు నరసింహస్వామి దేవాలయం సహా ఎన్నో పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాలున్నాయని.. మౌలిక వసతులను ఎప్పటికప్పుడు మెరుగుపర్చుకుంటూ ముందుకెళ్తున్నామని చెప్పారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement