Monday, May 6, 2024

TS | మరింత వేగంగా రెండో విడత గొర్రెల పంపిణీ.. చ‌ర్య‌లు తీసుకుంటున్న తెలంగాణ‌ స‌ర్కారు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రానున్న పది రోజుల్లో రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం మరింత వేగవంతం కానుంది. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఈ నెల 9న తెలంగాణ వ్యాప్తంగా రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. అయితే ఇటీవల వానాకాలంలోనూ తీవ్రమైన ఎండలు కాయడం వంటి ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో లబ్దిదారులకు గొర్రెల ను పంపిణీ చేస్తే ప్రతికూల ఫలితాలు వస్తాయన్న భావనలో రాష్ట్ర షీప్‌ ఫెడరేషన్‌ ఛైర్మన్‌ దూదిమెట్ల బాలరాజు యాదవ్‌ ఉన్నారు. గొర్రెల పంపిణీ కార్యక్రమం నిరంతర కార్యక్రమమని, ఎన్నికల కోడ్‌తోనూ నిమిత్తం లేకుండా పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది.

- Advertisement -

మొదటి విడత జీవాల పంపిణీ కార్యక్రమంలో ఇక్కడి వాతావరణానికి గొర్రెలు తట్టుకోవడంలో అనేక ఇబ్బందులు తలెత్తాయి. అయితే ఈసారి ఆ ఆటంకాలు ఎదురుకాకుండా ఆయా జిల్లాలోని లబ్దిదారులకు పరిసర రాష్ట్రాల్లో నుంచే గొర్రెలను కొనుగోలు చేసి పంపిణీ చేయాలని షీప్‌ ఫెడరేషన్‌ నిర్ణయించింది. ఉదాహారణకు నిజామాబాద్‌ జిల్లా లబ్దిదారులకు పరిసర మహారాష్ట్ర నుంచి, మహబూబ్‌నగర్‌ లబ్దిదారులకు పరిసర కర్ణాటక రాష్ట్రం నుంచి గొర్రెలను కొనుగోలు చేసి పంపిణీ చేయనున్నారు. ఈ నెల 9న రాష్ట్రంలోని 99 నియోజకవర్గాల్లో కలిపి మొత్తం 2528గొర్రెల యూనిట్లు పంపిణీ అయ్యాయి. రెండు రోజుల తర్వాత రెండో విడతలో లబ్దిదారులుగా గుర్తించిన 3లక్షలా 38వేల మందికి జీవాల యూనిట్లు పంపిణీ కానున్నాయి.

ఇందుకు సంబంధించిన దాణా, గొర్రెల కొనుగోలు, రవాణా తదితర ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ప్రస్తుతం తెలంగాణ షీప్‌ సొసైటీలో రాష్ట్ర వ్యాప్తంగా 7, 61, 800 మంది సభ్యులుగా ఉన్నారు. గొర్రెల పంపిణీ పథకం కింద పొందిన జీవాలను అమ్ముకుంటే కఠిన చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. అధికారుల కళ్లుగప్పి అమ్మితే కేసులు నమోదు చేసేందుకు షీప్‌ ఫెడరేషన్‌ సిద్ధమవుతోంది. అదే సమయంలో ప్రతినెలలో రెండుసార్లు గ్రామాలకు అధికారులు వెళ్లి తనిఖీలు నిర్వహించాలని నిర్ణయించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement