Sunday, May 26, 2024

TS | గోదావరి-కావేరి నదుల అనుసంధానంకు తెలంగాణ అంగీకారం…

హైదరాబాద్‌,ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర జలప్రయోజనాలకు విఘాతం కలగకుండా నదులను అనుసంధానం చేస్తే అభ్యంతరం లేదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల నీటి కేటాయింపులతో పాటుగా నీటివాటాల్లో తెలంగాణకు ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్ర జలశక్తి ఆధీనంలోని నేషనల్‌ వాటర్‌ డెవెలప్‌ మెంట్‌ ఏజెన్సీకి రాష్ట్ర నీటి పారుదల శాఖ స్పష్టం చేసింది. ఈ ప్రతిపాదనలకు అంగీకారం తెలిపిన ఎన్‌ డబ్ల్యూ డీఏ అధికారికంగా త్వరలో ప్రకటిస్తామని హామీ ఇచ్చింది. శుక్రవారం జలసౌధలో ఎన్‌ డబ్ల్యూడీఏ నదుల అనుసంధానం పై టాస్క్‌ ఫోర్స్‌ సమావేశం జరిగింది.

ఇచ్చంపల్లి నుంచి కావేరికి గోదావరి నది జలాలను అనుసంధానం చేసే అంశంపై జరిగిన 5వ సమావేశంలో తెలంగాణ, ఏపీ ఈఎన్సీలు పాల్గొనగా మహారాష్ట్ర, ఛత్తీస్‌ ఘడ్‌, తమిళనాడు,కేరళ రాష్ట్రాలతో పాటుగా కేంద్ర పాలిత ప్రాంతం పదుచ్చేరి వీడియో కాన్ఫరెన్స్‌ లో పాల్గొన్నాయి. ఈ సమావేశానికి నేషనల్‌ వాటర్‌ డెవెలఫ్‌ మెంట్‌ ఏజెన్సీ ఛార్మన్‌ వెదిరె శ్రీరాం, డైరెక్టర్‌ జనరల్‌ భూపాల్‌ సింగ్‌, రాష్ట్ర నీటిపారుదలశాఖ స్పెషల్‌ సీఎస్‌ రజత్‌ కుమార్‌,సీఎం ఓఎస్‌డీ శ్రీధర్‌ రావు దేశ్‌ పాండే, ఈఎన్‌సీ సీ. మురళీధర్‌, ఇంటర్‌ స్టేట్‌ సీఎస్‌ మోహన్‌ కుమార్‌, ఏపీ నుంచి నీటి పారుదల శాఖస్పెషల్‌ సీఎస్‌ శశిభూషణ్‌, ఈఎన్‌సీ నారాయణ రెడ్డి పాల్గొన్నారు.

గోదావరి కావేరి అనుసంధానంతో 147.93 టీఎంసీలతోపాటుగా కృష్ణా ఉపనదులైన బెడ్తి, వార్తా అనుసంధానంతో 18.50 టీఎంసీల మళ్లింపుకు ప్రతిపాదనలు చేశారు. ఇప్పటికే పలుమారు క్షేత్ర స్థాయి పరిశోధనలు చేసిన కేంద్ర బృందాలు ఇచ్చంపల్లి నుంచి నీటిని నాగార్జున సాగర్‌ కు తరలించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం కోసం 4 పర్యాయాలు సమావేశాలు నిర్వహించి అభ్యంతరాలను పరిశీీలించి 5వ సమావేసంలో కొంతమేరకు స్పష్టత ఇచ్చింది. గోదావరి నుంచి తరలించే 147.97 టీఎంసీ నీటిని తరలించి మార్గమధ్యలో ఉన్న రాష్ట్రాలకు వాటాలు ఖరారు చేశారు.

- Advertisement -

తాగునీటితో పాటుగా మొత్తం 5.73 లక్షల హెక్టార్లకు సాగునీరు అందించే ప్రతిపాదనలపై చర్చ జరిగింది. అలాగే కర్ణాటకలో కొత్తగా 1.04 ఎకరాలకు కొత్తగా సాగునీరు అందించే ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మొత్తం 6.78 లక్షల హెక్టార్లు సాగులోకి వచ్చే ఈ ప్రాజెక్టును ఆమోదించాలని చేసిన ప్రతిపాదనలపై విభిన్న వాదనలు వినిపించారు. తెలంగాణ నుంచి నాగార్జున సాగర్‌ వరకు తరలించే మార్గాల్లో వన్యప్రాణ సంరక్షణ కేంద్రాలుండటంతో వాటికి నష్టం వాటిళ్లకుండా చర్యలు తీసుకుంటామనితెలంగాణ ప్రతిపాదనలను వెదిరెశ్రీనివాస్‌ అంగీకరించారు.

నీటివాటలపై తెలంగాణ పట్టువిడవకుండా వాదనలు ప్రారంభించింది. పట్టుదలతో తెలంగాణ చేసిన ప్రతిపాదనలను నేషనల్‌ వాటర్‌ డెవెలఫ్‌ మెంట్‌ ఏజెన్సీ అంగీకరించింది. 147.97 టీఎంసీల్లో తెలంగాణకు 27 శాతం నీటిని ఇచ్చేందుకుఅంగీకారం తెలిపింది. అయితే తెలంగాణలో నదుల అనుసంధానంతో 300 కిలో మీటర్ల పొడవున 60వేల ఎకరాల భూమికోల్పోవడంతో పాటుగా 10 గ్రామాలు, 5వేల 475 కుటుంబాలు, 2లక్షల వేల మంది నిరాశ్రయులు అవుతారని తెలంగాణ నీటిపారుదల శాఖ సమావేశం దృష్టికి తీసుకురాగా రూ. 43వేల కోట్ల కేంద్ర నిధులతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో ఏ రాష్ట్రానికి నష్టం వాటిళ్లదని స్పష్టం చేసింది.

పునరావాస చర్యలను కేంద్ర నిధులతో చేపడతామని ఎన్‌డబ్ల్యూడీఏ హామీ ఇచ్చింది. తెలంగాణలో గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో నిర్మిస్తున్న ప్రాజెక్టుల నీటి వాటాలు 968 టీఎంసీలతో పాటుగా తరలించే తరలించే 120టీఎంసీ మిగులు జలాల్లో 120టీఎంసీ నీటిలో 27 శాతం కావాలని తెలంగాణ ప్రతిపాదనలను ఎన్‌డీడబ్ల్యూడీఏ అంగీకరించింది. మూడుదశల్లో జరిగే గోదావరి-కావేరి నదుల అనుసంధానం లో ఇచ్చంపల్లి(జానాపేట) దగ్గర బ్యారేజీ నిర్మించి 300 కిలోమీటర్ల ప్రయాణ అనంతరం నాగార్జున సాగర్‌ గోదావరి జలాలు చేరుకుంటాయి. అనంతరం నాగార్జున సాగర్‌ నుంచి సోమశిల(పెన్నార్‌)చేరుకుంటాయి.

సోమశిల నుంచి కావేరి నదికి నీరు చేరుకుంటుంది. ఈ నదుల అనుసంధానంతో ఎగువ ప్రాంతాల్లోని భూములకు సాగునీరు అందడంతో పాటుగా సంవత్సరం పోడువునా నీరు అందుబాటులో ఉంటుందని నిపుణులు అంచనావేశారు. అయితే ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు అంగీకరించింది. ఇచ్చంపల్లి నుంచి ప్రాజెక్టు నిర్మాణానికి అవకాశాలు లేని పక్షంలో పోలవరం నుంచి నదుల అనుసంధానానికి సిద్ధంగా ఉన్నామని ఏపీ అధికారులు తెలిపారు. అయితే తెలంగాణ నుంచే నదుల అనుసంధానం చేపడితేనే అన్ని ప్రాంతాలు సస్యశ్యామలం అవుతాయని నేషనల్‌ వాటర్‌ డెవెలఫ్‌మెంట్‌ ఏజెన్సీ స్పష్టం చేస్తూ ప్రధానంగా తెలంగాణ అభ్యంతరాలను పరిశీలించి నిర్ణయాలు తీసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement