Sunday, May 12, 2024

Delhi | రేపల్లె ఘటనపై టీడీపీది శవ రాజకీయం: వైసీపీ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: గుంటూరు జిల్లా రేపల్లెలో జరిగిన బాలుడి హత్యతో తెలుగుదేశం పార్టీ శవ రాజకీయం చేస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు మండిపడ్డారు. శుక్రవారం ఢిల్లీలోని ఆంధ్రప్రేదశ్ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఉభయ సభలకు చెందిన సభ్యులు మోపిదేవి వెంకట రమణ, బీద మస్తాన్ రావు, బెల్లాన చంద్రశేఖర్, డా. బీశెట్టి సత్యవతి, పిల్లి సుభాష్ చంద్రబోస్ పాల్గొన్నారు. తొలుత మోపిదేవి మాట్లాడుతూ.. రాజకీయాల్లో ఎత్తుకు పై ఎత్తులు, విమర్శలు – ప్రతివిమర్శలు సహజమని, కానీ తెలుగుదేశం పార్టీ వాస్తవాలను నూటికి 200 శాతం వక్రీకరిస్తూ ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా గోబెల్స్ ప్రచారం చేస్తోందని ఆరోపించారు.

ఆ పార్టీకి ఇది వెన్నతో పెట్టిన విద్య అన్నారు. తన ఉనికి చాటుకోవడం కోసం చంద్రబాబు నాయుడు నానాకష్టాలు పడుతున్నారని మోపిదేవి వ్యాఖ్యానించారు. యువగళం పేరుతో నారా లోకేశ్ పెయిడ్ ఆర్టిస్టులతో యాత్ర చేస్తున్నారని విమర్శించారు. డబ్బులతో ప్రజలను పోగు చేసి యాత్రలు, కుల సంఘాల పేరుతో సభలు నిర్వహిస్తున్నారని దుయ్యబట్టారు. మే 16న ఓ బాలుడి హత్య జరిగిందని, దానికి ఎలాంటి రాజకీయ కారణాలు లేవని చెప్పారు. ఉదయం గం. 5.30కు హత్య జరిగితే, గం. 11.00 వరకు ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, నాలుగో నిందితుణ్ణి మే 20న అదుపులోకి తీసుకున్నారని వివరించారు.

- Advertisement -

ఘటన అనంతరం బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం పరామర్శించడంతో పాటు 24 గంటల్లోపే రూ. 10 లక్షల పరిహారం కూడా అందించామని గుర్తుచేశారు. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, ఒక ఇల్లు సహా బాధితుల డిమాండ్లను ప్రభుత్వం 24 గంటల్లోనే అమలు చేసిందని అన్నారు. అయితే బాధిత కుటుంబంలో తల్లిని, మరో బాలికను చంద్రబాబు నాయుడు ఒంగోలు సభలో వేదిక మీదకు తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేయించారని మోపిదేవి మండిపడ్డారు. ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చిన తరహాలో ఆ ఇద్దరికీ ట్రైనింగ్ ఇచ్చి మాట్లాడించారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బాలిక చేత అన్నీ అబద్ధాలు చెప్పించారని దుయ్యబట్టారు.

రాష్ట్రంలో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే బీసీల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయని మోపిదేవి వెంకట రమణ అన్నారు. అసెంబ్లీలో స్పీకర్ సహా రాష్ట్ర మంత్రివర్గంలో 11 మంది (45 శాతం) మంత్రులు బీసీలేనని తెలిపారు. తెలుగుదేశం హయాంలో రాజ్యసభకు బీసీలను పంపిన దాఖలాలే లేవని, కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రతి చోటా బీసీలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ఉద్యోగ నియామకాల్లో సచివాలయం ద్వారా 1.5 లక్షల మంది శాశ్వత ఉద్యోగ అవకాశం కల్పించగా, వారిలో ఏకంగా 60% మంది బీసీలేనని తెలిపారు.

తెలుగుదేశం హయాంలో బీసీలకు రూ. 16 వేల కోట్లు మాత్రమే ఇవ్వగా, జగన్ సర్కారు ఇప్పటికే రూ. 84 వేల కోట్లు కేటాయించిందని చెప్పారు. బీసీలకు పెద్దపీట వేశాం అని చెప్పుకునే ధైర్యం తెలుగుదేశం పార్టీకి ఉందా అని సవాల్ విసిరారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో బీసీలు మళ్లీ జగన్మోహన్ రెడ్డినే ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నారని తెలిపారు. మణిపూర్ అంశంపై పార్టీ వైఖరి ఏంటని విలేకరులు ప్రశ్నించగా.. కచ్చితంగా ఖండించి తీరాల్సిందేనని అన్నారు. అవిశ్వాస తీర్మానం విషయంలో వైఎస్సార్సీపీ విధానం గురించి ప్రశ్నించగా.. తమ అధినేత జగన్‌తో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు.

బీసీల అభ్యున్నతిలో తండ్రిని మించిన తనయుడు – బీద మస్తాన్ రావు
దేశంలో నిజమైన సామాజిక న్యాయాన్ని అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక్కరేనని వైఎస్సార్సీపీ ఎంపీ బీద మస్తాన్ రావు అన్నారు. తండ్రి రాజశేఖర రెడ్డి కంటే తనయుడు జగన్ ఓ రెండు అడుగులు ముందుకేసి వినూత్న పథకాలతో బీసీల అభ్యున్నతి కోసం శ్రమిస్తున్నారని కొనియాడారు. అలాంటి ముఖ్యమంత్రిని చంద్రబాబు కుట్రల నుంచి బీసీలు అందరూ కలిసి కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. రేపల్లె ఘటనను రాజకీయం చేయడం ఏమాత్రం సరికాదని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement