Friday, April 26, 2024

విశాఖ ఉక్కు ప‌రిర‌క్ష‌ణ‌కు 18న రాష్ట్రవ్యాప్త ఆందోళనకు టీడీపీ పిలుపు

విశాఖ: స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు నిరసనగా ఈ నెల 18న రాష్ట్రవ్యాప్త ఆందోళనకు తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు నిరసన కార్యక్రమాలు, ర్యాలీలు చేపట్టాలని శ్రేణులను ఆదేశించారు. ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉన్న ఉక్కు పరిశ్రమను కాపాడుకునేందుకు ఎలాంటి పోరాటానికైనా టిడిపి సిద్ధమన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రభుత్వ రంగంలో కొనసాగించే వరకు విశ్రమించబోమ‌ని స్పష్టం చేశారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా ఉన్న విశాఖ ఉక్కును సీఎం జగన్‌మోహన్‌రెడ్డి తన కేసుల మాఫీ కోసం ప్రైవేట్ పరం చేస్తూ, రాష్ట్రానికి తీరని ద్రోహం చేస్తున్నారని ఆరోపించారు. పోస్కోతో లోపాయికారి ఒప్పందంతో రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టి మిగులు భూమి 8వేల ఎకరాలను కాజేసేందుకు కేంద్ర ప్రభుత్వం ముందు మోకరిల్లారని చంద్రబాబు దుయ్యబట్టారు. ప్రైవేటీకరణకు కూడా బాటలు వేసి ప్లాంట్‌నే నిర్వీర్యం చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధికి వెన్నెముకలా నిలిచిన విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రత్యక్షంగా 40వేల మంది, పరోక్షంగా మరో 50 వేల మంది కార్మికులకు నీడనిచ్చిందన్నారు. ఉద్యమస్ఫూర్తితో మరోసారి దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజలపై ఉందన్నారు. తెలుగు ప్రజల ఉక్కు సంకల్పం ముందు జగన్‌ కుట్ర రాజకీయాలు సాగవని చంద్రబాబు అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement