Monday, April 29, 2024

తెలంగాణలో ఒంటరి పోరే.. బీజేపీ వైఖరి స్పష్టం చేసిన తరుణ్ చుగ్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలంగాణలో పొత్తులపై భారతీయ జనతా పార్టీ స్పష్టతనిచ్చింది. ఏ పార్టీతోనూ పొత్తుల ప్రసక్తే లేదని తేల్చేసింది. తెలుగుదేశం పార్టీతో పొత్తు గురించి సమాలోచనలు చేస్తున్నట్టుగా వచ్చిన కథనాలను బీజేపీ తెలంగాణ ఇంచార్జ్ తరుణ్ చుగ్ ఖండించారు. పార్టీకి దురుద్దేశాలు ఆపాదించే లక్ష్యంతోనే ఆ కథనాలు సృష్టించారని పేర్కొంటూ చుగ్ ఒక ప్రకటన విడుదల చేశారు. గురువారం సాయంత్రం ఆయన సంక్రాంతి (లోడి) సందర్భంగా మీడియా ప్రతినిధులకు అల్పాహార విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పిచ్చాపాటిగా రాజకీయాల గురించి మాట్లాడారు. ఇందులో తెలుగుదేశంతో పొత్తుల గురించి ఆలోచిస్తామని, షర్మిలకు మద్ధతివ్వడం గురించి పరోక్షంగా కూడా తాను ప్రస్తావించలేదని చెప్పారు. తెలంగాణలో ఉనికి కోల్పోయిన కొన్ని రాజకీయ పార్టీలు అసత్య ప్రచారం చేస్తూ తమతో పొత్తుల కోసం అర్రులు చాస్తున్నాయని మండిపడ్డారు. తెలంగాణలో అధికార భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)ను ఒంటరిగా ఓడించేంత బలం బీజేపీకి ఉందని, రాష్ట్రంలో బీజేపీయే ప్రత్యామ్నాయమని ఆయన పునరుద్ఘాటించారు.

చెలిమి చేటే!

తెలుగుదేశం పార్టీతో చెలిమి విషయంలో కమలనాథులకు కొన్ని నిశ్చితమైన అభిప్రాయాలున్నాయి. తెలుగురాష్ట్రాల్లో పార్టీ ఆశించిన స్థాయిలో ఎదగలేకపోవడానికి కారణంగా దశాబ్దాలుగా ఆ పార్టీతో చేసిన చెలిమే కారణమని బీజేపీలో ఒక వర్గం మొదటి నుంచి అభిప్రాయపడుతోంది. తెలుగుదేశం మిత్రపక్షం ముసుగులో తాను లబ్దిపొందడమే తప్ప, బీజేపీని ఎదగనీయకుండా చేసిందని వారు చెబుతుంటారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ దాదాపు కనుమరుగైన స్థితిలోనే బీజేపీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగిందని, ఇంతకాలం పాటు ఆ పార్టీతో ఉన్న చెలిమి కారణంగానే ఎదగలేకపోయామని సూత్రీకరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇదే సూత్రం వర్తిస్తుందని, ఆ రాష్ట్రంలో టీడీపీ బలహీనపడితేనే బీజేపీ ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా అవతరించేందుకు ఆస్కారం కల్గుతుందని విశ్లేషించుకుంటున్నారు. ఈ విషయం అధినాయకత్వానికి కూడా తెలుసని, అందుకే బీజేపీతో చెలిమి కోసం తెలుగుదేశం పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఏమాత్రం సానుకూలత వ్యక్తం చేయడం లేదని అంటున్నారు.

మరికొందరైతే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఎదురైన పరిస్థితిని ఉదహరిస్తున్నారు. టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న దశలో ఆ పార్టీ తెలుగుదేశంతో పొత్తులు పెట్టుకుంది. రాజకీయాల్లో ఒకటి ఒకటి కలిస్తే రెండు కాదని, ఒక్కోసారి మైనస్ 2 కూడా అవ్వొచ్చని చెప్పడానికి ఈ పొత్తులే ఒక ఉదాహరణగా విశ్లేషిస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి ప్రతి నియోజకవర్గంలో కనీసం 6 నుంచి గరిష్టంగా 16 శాతం వరకు ఓటుబ్యాంకు ఉందని, ఆ పార్టీతో పొత్తు కారణంగా అది కాంగ్రెస్‌కు కలిస్తే మరిన్ని ఎక్కువ సీట్లు గెలుచుకోవచ్చని కాంగ్రెస్ పార్టీ ఆశపడింది. కానీ తెలుగుదేశంతో కలవడాన్ని కేసీఆర్ తెలివిగా రాజకీయాస్త్రంగా మలచడంతో రాష్ట్రంలో రివర్స్ సెంటిమెంట్ మొదలైంది. ‘అమరావతిలో రిమోట్ కంట్రోల్’, ‘కొట్లాడి సాధించుకున్న రాష్ట్రంపై వలస పాలకుల పెత్తనం’ వంటి వ్యాఖ్యలతో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా సెంటిమెంటు రాజుకుంది.

- Advertisement -

చివరకు ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే బీజేపీలో కిషన్ రెడ్డి, డా. లక్ష్మణ్ వంటి నేతలు కూడా ఓటమిపాలయ్యారు. నియోజకవర్గాలవారిగా బీజేపీకి పడిన ఓట్లను లెక్కించినప్పుడు, హీనపక్షంలో సగటున 3 నుంచి 4 వేల ఓట్లు పడాల్సిన చోట కూడా 1,000 నుంచి 1,500 ఓట్లు మాత్రమే పోలైనట్టు కమలనాథులు గుర్తించారు. ఆ స్థాయిలో తెలంగాణ ఓటర్లు తెలుగుదేశంపై వ్యతిరేకతను చాటారని అభిప్రాయపడ్డారు. చివరకు ఆంధ్ర ప్రాంత జనాభా ఎక్కువగా ఉన్న కూకట్‌పల్లి నియోజకవర్గంలో ఎన్టీఆర్ కుమార్తె నందమూరి వెంకట సుహాసినిని నిలబెట్టినప్పటికీ ఓటమి పాలైన అంశాన్ని ఉదహరించారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో సొంతంగా బలం పెంచుకుని బీఆర్ఎస్‌తో ఢీకొడుతున్న సమయంలో టీడీపీతో కలిస్తే 2018లో కాంగ్రెస్‌కు ఎదురైన పరిస్థితే తమకు ఎదురవుతుందని లెక్కలు వేస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం తెలంగాణ సెంటిమెంట్ వాడుకునే పరిస్థితి పేరు మార్చుకున్న టీఆర్ఎస్‌కు లేనప్పటికీ, టీడీపీతో చెలిమి మేలు కంటే చేటే ఎక్కువ చేస్తుందని ఎక్కువ మంది బీజేపీ నేతలు అభిప్రాయపడుతున్నారు.

ఏపీలోనూ ఒంటరి బాటసారే

ఇరుగు పొరుగు రాష్ట్రాలైనప్పటికీ బీజేపీ విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో పరస్పర భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణలో బీఆర్ఎస్‌కు సవాల్ విసురుతున్న స్థితి కనిపిస్తుండగా, ఏపీలో అందుకు పూర్తి భిన్నమైన స్థితి కనిపిస్తోంది. నిజానికి అక్కడ ప్రజలు అటు తెలుగుదేశం, ఇటు వైఎస్సార్సీపీతో విసిగిపోయిన స్థితిలో 3వ ప్రత్యామ్నాయంగా బీజేపీ-జనసేన కూటమిని ఆదరిస్తారని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ తమ మిత్రపక్షంగా భావిస్తున్న జనసేన మాత్రం తెలుగుదేశం పొత్తు ఉంటుందని సంకేతాలిస్తోంది. ఈ తరుణంలో ఒంటరిగా వెళ్తే ప్రయోజనం ఉండదని కమలనాథులకు తెలుసు. అయినప్పటికీ ఏనాటికైనా సొంత బలం పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పుడు, మరొకరికి మద్ధతిచ్చి తమ ఎదుగుదలకు బ్రేకులు వేసుకోవడం దేనికి అన్న ధోరణిలో ఆలోచిస్తున్నారు. నిజానికి ఆంధ్రప్రదేశ్‌లో రెండు రాజకీయ పార్టీలు కేంద్రంలో బీజేపీ సర్కారుకు మద్ధతిస్తూనే ఉన్నాయి. రాష్ట్రపతి ఎన్నికల వంటి సందర్భాల్లో బీజేపీ పాలిత రాష్ట్రాల కంటే ఎక్కువ మద్ధతు ఆంధ్రప్రదేశ్ నుంచి దొరికింది. ఈ పరిస్థితుల్లో ఒకరికి దగ్గరై మరొకరికి దూరమవడం ఎందుకనే ఆలోచన కూడా చేస్తోంది. ఇద్దరికీ సమదూరాన్ని పాటిస్తూ సొంతంగా బలపడడమే తమ ముందున్న లక్ష్యమని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బీజేపీ నేత ఒకరు వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లోనూ తెలంగాణ తరహాలో ఒంటరిగా ఎన్నికలను ఎదుర్కొనేందుకు కమలదళం సమాయత్తమవుతోంది. ఇంకా చెప్పాలంటే ఏపీలోనూ తెలుగుదేశం పార్టీ బలహీనపడ్డప్పుడే బీజేపీకి ప్రత్యామ్నాయ హోదా దక్కుతుందని బలంగా విశ్వసిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement