Wednesday, May 1, 2024

ప్రాజెక్టుల పనుల్లో వేగం.. కృష్ణా వరదనీటికి అడ్డుకట్ట

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ప్రస్తుత వర్షకాలంలో కృష్ణా పరివాహక ప్రాజెక్టుల్లో పూర్తి స్థాయి నీటి నిల్వలు చేసేందుకు సాగునీటి పారుదల శాఖ పెండింగ్‌ ప్రాజెక్టులతో పాటుగా నిర్మాణ దశలో ఉన్న ప్రాజెక్టుల పనుల్లో వేగం పెంచింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రాజెక్టుల పునరుద్ధరణ పనులు పూర్తి చేసి నీటి సామర్ధ్యాన్ని పెంచాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో పనులు కొనసాగుతున్న ప్రాజెక్టులు ఈనెల చివరినాటికి పూర్తి చేయాలనే పట్టుదలతో పనుల్లో వేగం పెంచింది. ఇందులో భాగంగా రాజీవ్‌ బీమా పునరుద్ధరణ పనుల పురోగతిపై ఇరిగేషన్‌ శాఖ దృష్టి సారించింది. కృష్ణా నది నుంచి రెండుదశల్లో నీటిని తోడి 241 చెరువులను నింపేందుకు ప్రాజెక్టు పనులను ప్రారంభించిన ప్రభుత్వం జూలైలోగా పనులు పూర్తి చేసి లక్ష్యం చేరుకోవాలని నీటిపారుదల శాఖను ఆదేశించింది.

రెండుదశల్లో పనులు కొనసాగుతున్న ఈ ప్రాజెక్టు మొదటి దశలో జూరాల ప్రాజెక్టు ఎగువ భాగం పంచదేవపాడు గ్రామం దగ్గర కృష్ణా నీటిని ఎత్తిపోస్తుంది.రెండవదశలో రామన్‌పాడు ఊక చెట్టి వాగు ప్రాజెక్టు ఎగువ భాగాలకు నీటిని ఎత్తిపోసేందుకు పనులుకొనసాగుతున్నాయి. కృష్ణా నది వాటాలో 299 టీఎంసీలు తెలంగాణకు వాటా ఉంది. ఈ వాటాలోని నీటితో పాటు వరదజలాల్లో ఉన్న వాటా నీటిని ఉపయోగించుకునేందుకు ఇప్పటికే సీడబ్ల్యూసీ అనుమతి ఉంది. అయితే ఏపీ ప్రాజెక్టు విస్తరణను తప్పుబడుతూ నిలిపివేసేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో జూలై నాటికి పనులు పూర్తి చేయాలనే పట్టుదలతో పనుల్లో వేగం పెంచింది ప్రభుత్వం.

- Advertisement -

రాజీవ్‌ బీమా ఎత్తిపోతల విస్తరణ పనులు పూర్తి అయితే దీర్ఘ కాలంగా కరువు ప్రభావిత ప్రాంతాలైన మక్తల్‌, మగనూరు, ఆత్మకూరు, చింతకుంట, దేవరకద్ర, అడ్డాకుల కొత్తకోట, పెద్దమందడి, వనపర్తి, పెబ్బేరు,పనగల్‌,కోడేరు, వీపనగండ్ల కొల్లాపూర్‌ మండలాలతో పాటుగా మహబూబ్‌ నగర్‌,నాగర్‌ కర్నూల్‌, నారాయణపేట, వనపర్తి జిల్లాలోని 196 గ్రామాలకు తాగునీరు అందనుంది. రెండుదశలో ఎత్తిపోతల్లో మొదటిదశలో లక్షా 11వేల ఎకరాలు, రెండవదశలో 92 వేల ఎకరాలకు సాగునీరు అందేందుకు ప్రాజెక్టు పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి.

అయితే ప్రతిపాదిత సామర్ధ్యంలో 2లక్షల 300 ఎకరాలు కాగా ప్రస్తుతం లక్షా 58 వేల ఎకరాలకు నీరు అందించేందుకు వీలుగా పనులు పూర్తి అయ్యాయి. మిగతాపనులను జూలై లోగా పూర్తి చేసి మిగతా ఆయకట్టును స్థిరీకరించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు నిర్మాణ అంచెనా వ్యయాన్ని రూ. 2వేల 654 కోట్ల 95 లక్షలకు పెంచి నిర్ధిష్ట గడువును ప్రభుత్వం విధించింది. అయితే ప్రస్తుత వర్షాకాలంలో పూర్తి చేసి వరదజలాలకు అడ్డుకట్టవేయాలనే ప్రయత్నం ఫలించేందుకు సాగునీటి పారుద శాఖ చేస్తున్న కృషి ఫలిస్తోందని భావిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement