Sunday, May 19, 2024

Delhi | గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఆర్డినెన్సును వ్యతిరేకిస్తాం.. ఢిల్లీ రాంలీలా మైదాన్‌లో నేడు ర్యాలీ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఢిల్లీ ప్రభుత్వంలో అధికారుల బదిలీలు, పోస్టింగులపై కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్సును వ్యతిరేకిస్తూ నేడు ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) భారీ ప్రదర్శనకు సిద్ధమైంది. ఈ సభను జయప్రదం చేయాలంటూ ఆ పార్టీ నేతలు ఇచ్చిన పిలుపు మేరకు దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి ఆప్ నేతలు హస్తిన బాట పట్టారు. ఈ క్రమంలో తెలంగాణ నుంచి రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు భూక్యా శోభన్ బాబు, అధికార ప్రతినిధి మహమూద్ అలీ, యూత్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు రణధీర్ సింగ్, పెద్దపల్లి పార్లమెంటరీ కన్వీనర్ మధు తదితరులు ఢిల్లీ చేరుకుని మీడియా సమావేశం నిర్వహించారు.

కోర్ కమిటీ సభ్యులు శోభన్ బాబు మాట్లాడుతూ ఢిల్లీలో ప్రజలెన్నుకున్న ప్రభుత్వాన్ని కాదని, లెఫ్టినెంట్ గవర్నర్‌కు అధికారాలు కట్టబెడుతూ కేంద్రంలోని బీజేపీ సర్కారు తీసుకున్న నిర్ణయం ప్రజాస్వామ్య స్ఫూర్తికే విఘాతమని అన్నారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తాము పోరుబాట పట్టామని చెప్పారు. పార్లమెంటులో ఈ బిల్లును ఓడించడమే లక్ష్యంగా ఆదివారం ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశామని, ఈ సభను జయప్రదం చేయాలని కోరారు.

- Advertisement -

కేంద్ర ప్రభుత్వ ఆర్డినెన్సుపై ఇప్పటికే ఇంటింటి ప్రచారం కూడా చేపట్టామని, విపక్షాల మద్దతు కూటగట్టి పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పునే కాలరాస్తూ తీసుకొచ్చిన ఈ ఆర్డినెన్సు సమాఖ్య వ్యవస్థపై దాడి అని ఆప్ నేతలు అభివర్ణించారు. బీజేపీ ఓడిన ప్రతిచోటా గవర్నర్ల ద్వారా ప్రతిపక్ష ప్రభుత్వాలను ఇబ్బందులకు గురిచేస్తోందని దుయ్యబట్టారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement