Thursday, May 2, 2024

అధిష్టానం సైలెంట్‌.. బీజేపీ తెలంగాణ నేతల్లో టెన్షన్‌..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో బీజేపీ నాయకత్వాన్ని పునర్‌వ్యవ్యస్థీకరించాలని పార్టీ అధిష్టానం భావిస్తున్నట్లు విస్తృతంగా చర్చ జరుగుతుండడంతో ఆ పార్టీ తెలంగాణ నేతల్లో ఒకింత టెన్షన్‌ నెలకొంది. ఏకంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిని కొత్తవారికి ఇవ్వడంతోపాటు పార్టీ ప్రచార కమిటీ, ఎన్నికల కమిటీ , మేనిఫెస్టో కమిటీ తదితర బాధ్యతలను కీలకనేతలకు అప్పగించనున్నట్లు వారం రోజులుగా నేతల మధ్యన, మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.

అయినప్పటికీ బీజేపీ జాతీయ నాయకత్వం ఆ ప్రచారాన్ని ఖండించకపోగా ప్రచారాన్ని నిలువరించే ప్రయత్నాలు కూడా చేయకుండా మౌనం వహించింది. మాములుగా అయితే ఏ చిన్న ప్రచారం జరిగినా వెంటనే ఖండించే బీజేపీ రాష్ట్ర ఇన్‌చార్జిలు, అపార్టీ అగ్రనేతలు సైలెంట్‌ అయ్యారు. ఈ పరిస్థితుల్లో ఎవరి పదవి ఊడుతోందో, జాతీయ స్థాయిలో బాధ్యతలు నిర్వహిస్తున్న ఏ నేతకు తెలంగాణలో బాధ్యతలు అప్పగిస్తారో..?, కొత్తగా పార్టీ జాతీయ బాధ్యతలను ఎవరికైనా అప్పగిస్తారా..? కీలకమైన పదవులు ఏ నేతకు వెళుతాయి..? అన్న టెన్షన్‌ బీజేపీ నేతల్లో నెలకొని ఉంది.

బీజేపీ అధిష్టానం మౌనంగా ఉండడంతో పార్టీ కీలక పద వుల్లో కచ్చితంగా మార్పులు చేర్పులు ఉంటాయన్న స్పష్టమవుతోంది. చివరకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కూడా పార్టీలో పదవుల అప్పగింత, కొందరి పదవుల మార్పుపై మౌనంగా ఉండడంతో పార్టీలో కీలక మార్పులు చోటు చేసుకునే అంశానికి బలం చేకూరుతోంది.

- Advertisement -

సీఎం కేసీఆర్‌ను ఎదుర్కోవడమే లక్ష్యంగా బాధ్యతల అప్పగింత…

తెలంగాణలో అసెంబ్లి ఎన్నికలకు సమయం తక్కువగా ఉన్న నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ను ఢీకొనాలంటే బలమైన ఎన్నికల టీఎం ఏర్పాటు కావాలన్న యోచనలో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర నాయకత్వంలో మార్పులు చేర్పులు భారీగా చేపట్టేందుకు అధిష్టానం సిద్ధమవుతున్నట్లు తెెలిసింది. ఈ మధ్య కాలంలో 2019 నుంచి కొంత మంది సీనరియర్లకు కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది.

కేసీఆర్‌ను ఓడించాలంటే నాయకత్వం బలంగా ఉండాలన్న యోచనలో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణలోని కీలక బీజేపీ నేతలకు పదవులు కట్టబెట్టే విషయంలో వారం రోజులుగా అధిష్టానం పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీ జాతీయ కార్యదర్శి సునిల్‌ భన్సల్‌ రెండు రోజుల క్రితం తెలంగాణలోని కీలక నేతలతో సమావేశమయ్యారు.

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు ఎంపీ లక్ష్మణ్‌ తదితరులతో ఆయన కీలక చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఏయే మార్పులు చేస్తే ఎన్నికల్లో కేసీఆర్‌ను ఢీకొట్టగలం, మెరుగైన ఫలితాలు సాధించగలమన్న అంశంపై అధిష్టానానికి నివేదిక కూడా ఇచ్చినట్లు తెలిసింది. ఆ నివేదికతో రాష్ట్ర నాయకత్వంలో మార్పులు చేయాలని అధిష్టానం ఫిక్స్‌ అయినట్లు తెలుస్తోంది. ఇప్పుడున్న సైలెంట్‌గా ప్రచారాన్ని బలం చేకూరుతోంది.

కొత్తగా చేరిన ముఖ్యనేతలకు కీలక పదవులు…?

పార్టీలో కీలక బాధ్యతలు దక్కనున్న నేతల పేర్లలో 2019లో బీజేపీలో చేరిన డీకే అరుణ పేరు కూడా వినిపిస్తోంది. ఆమె ఇప్పటికే పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. మరోవైపు సీనియర్‌ నేత ఈటల రాజేందర్‌ కు కీలక బాధ్యతలు అప్పగిస్తారన్న చర్చ జరుగుతోంది. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కి కీలక పదవి అప్పగించే యోచనలో అధి ష్టానం ఉన్నట్లు సమాచారం.

పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్‌ వెంకటస్వామి, జితేందర్‌గౌడ్‌, బూర నర్సయ్యగౌడ్‌, ఎంపీ అరవింద్‌, ఎమ్మెల్యే రఘునందన్‌రావుకు కూడా కీలక పదవులు, బాధ్యతలు కట్టబెట్టాలన్న యోచనలో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి అసెంబ్లి, సార్వత్రిక ఎన్నికల వేళ కీలక నేతల మధ్య సమన్వయం కొనసాగేలా అధిష్టానం వ్యూహ రచన చేస్తోంది. కీలక నేతల్లో నెలకొన్న అసంతృప్తిని చల్లబరిచే యత్నాల్లో ఢిల్లిd పెద్దలున్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement