Friday, April 26, 2024

కేటీఆర్ కనుసన్నల్లో సిట్ విచారణ.. టీఎస్‌పీఎస్సీ లీకేజీపై ఎంపీ రేవంత్ రెడ్డి డిమాండ్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : టీఎస్‌పీఎస్సీ పేపర్ల లీకేజీ అంశంపై మంత్రి కేటీఆర్‌ను కూడా విచారణ జరపాలని టీపీసీసీ అధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతోందని, కేటీఆర్ ఇందులో నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారని చెప్పుకొచ్చారు. విచారణను తప్పుదారి పట్టించి ప్రభుత్వంలో పెద్దలను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని కేటీఆర్ మాటలు, తొందరపాటు చూస్తే తెలంగాణ సమాజానికి స్పష్టంగా అర్థమవుతుందని వివరించారు. నేరగాళ్లు పంపకాల్లో తేడాలతో వారికి వారే ఈ కుంభకోణాన్ని బయట పెట్టుకున్నారని, కేసీఆర్ కుటుంబంపై ఆరోపణలు రావడంతో విధిలేని పరిస్థితుల్లోనే టీఎస్పీఎస్సీ బేగంపేటలో పిర్యాదు చేసిందని రేవంత్ తెలిపారు.

- Advertisement -

కేసును పక్కదారి పట్టించేందుకే కేసును సిట్‌కు అప్పగించారని, రాష్ట్ర ప్రభుత్వం సిట్‌కు అప్పగించిన ఏ కేసులోనూ నివేదిక ఇవ్వలేదని, చర్యలు చేపట్టలేదని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం టీఎస్పీఎస్సీ ఛైర్మన్, సభ్యుల నియామకంలోనే అవకతవకలకు పునాది వేసిందని ఆయన ధ్వజమెత్తారు. గ్రూప్1 పరీక్ష కేంద్రంలో సమయం దాటిన తరువాత కూడా పరీక్షలు రాయించారని, ఈ విషయాలను రాష్ట్ర ప్రభుత్వం కప్పిపుచ్చే ప్రయత్నం చేసిందని ఆరోపించారు. ఈ కేసు ఇద్దరికి సంబంధించిందని కేటీఆర్ విచారణకు ముందే ఎలా చెబుతారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. చర్చంతా కేటీఆర్ వైపు దారితీయడంతో తన పీఏకు కూడా కేసుతో సంబంధం లేదని చెప్పుకొస్తున్నారని దుయ్యబట్టారు. సిట్ విచారణ నివేదికను కోర్టుకు ఇవ్వకముందే జగిత్యాలలో పరీక్ష రాసిన వారి సమాచారం కేటీఆర్‌కు ఎలా వచ్చిందని ఆయన నిలదీశారు. ఆ సమాచారాన్ని నేరస్తులు ఇచ్చారా? విచారణ అధికారి ఇచ్చారా? అని ప్రశ్నిచారు.

కేటీఆర్ వద్ద నిర్దిష్టమైన సమాచారం ఉందని, ఆయనకు నోటీసులు ఇవ్వాలని తాము డిమాండ్ చేస్తే తమ మీదే క్రిమినల్ కేసులు పెడతామని మీడియాకు లీకులు ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు నోటీసులు ఇస్తున్న సిట్, విచారణ జరిపిన రహస్య సమాచారాన్ని కేటీఆర్‌కు అందిస్తోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. తమకు నోటీసులు ఇచ్చిన ఏఆర్ శ్రీనివాస్ మంత్రికి ఎందుకు ఇవ్వరని, దీని వెనుక గూడుపుఠాణి ఏంటని నిలదీశారు. దీన్ని బట్టి చూస్తే సిట్ విచారణ కేటీఆర్ కనుసైగల్లోనే జరుగుతోందనే విషయం అర్థమవుతోందన్నారు. ఈడీ,  సీబీఐ అధికారులు తమకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు వెంటనే అపాయింట్‌మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కేసులో ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ పెట్టాల్సిన అవసరం ఉందని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. సీబీఐ, ఈడీ, ఏసీబీ ఇలా అన్ని డిపార్ట్‌మెంట్స్ అధికారులతో కలిపి సిట్ వేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement