Thursday, May 16, 2024

డాన్‌బోస్‌లో రష్యాకు షాక్‌.. వైమానిక దళ కమాండర్‌ మృతి

కీవ్‌:తూర్పు ఉక్రెయిన్‌లోని డాన్‌బోస్‌ ప్రాంతంలో దూసుకుపోతూ ఆ దేశ భూభాగాలను స్వాధీనం చేసుకుంటున్న రష్యాకు గట్టి దెబ్బ తగిలింది. రష్యాలో అత్యంత సీనియర్‌, నిపుణుడైన యుద్ధవిమానాల పైలట్‌, జనరల్‌ కనమట్‌ బొతషెవ్‌ యుద్ధక్షేత్రంలో కన్నుమూశారు. ఆయన నడుపుతున్న యుద్ధ విమానాన్ని ఉక్రెయిన్‌ క్షిపణులతో కూల్చివేసింది. బొతషెవ్‌ నడుపుతున్న విమానం నేలకూలుతున్న చివరి క్షణాలకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. ఆయన వయస్సు 63 ఏళ్లు. లుషాంక్‌ ప్రాంతంలో రెండు యుద్ధ నౌకలకు రక్షణగా అత్యంత దిగువనుండి ఈ యుద్ధవిమానాన్ని నడుపుతూండగా స్ట్రింగర్‌ క్షిపణితో ఉక్రెయిన్‌ బలగాలు దాడి చేశాయి. ఉక్రెయిన్‌ భూభాగంలో ఉక్రెయిన్‌ సేనలు చుట్టుముట్టడంతో చిక్కుకుపోయిన రష్యా సేనలకు అండగా ఉండేందుకు చేసిన ప్రయత్నం ఆయన ప్రాణాలను బలిగొంది. ఈ సంఘటన మే నెల 24న చోటుచేసుకుంది. రష్యా ఆధీనంలోని కొమ్మెరసంట్‌ ప్రాంతంలో ఆయన అంత్యక్రియలు పూర్తి చేశారు. క్షిపణి దాడితో మండిపోయిన ఆ విమానం నుంచి బయటకు వచ్చేంత సమయం కూడా అతడికి దక్కలేదని నిపుణులు నిర్ధారించారు.

వైమానిక శిక్షణలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన యెయెస్క్‌ హయ్యర్‌ మిలటరీ ఏవియేషన్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ఫైటర్‌ – బాంబర్‌ విమానాలు నడపడంలో ఆయన గ్రాడ్యుటే|న్‌ చేశాడు. ఆ తరువాత లెఫ్టినెంట్‌ నుంచి జనరల్‌ స్థాయికి ఎదిగాడు. ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర ప్రారంభించిన తరువాత రష్యా కోల్పోయిన అత్యంత ఉన్నత వైమానిక దళ అధికారి ఇతనే. ఇప్పటికే 9మంది జనరళ్లను, 40 మంది కల్నల్‌ స్థాయి సైనికాధికారులను రష్యా కోల్పోయింది. 204 విమానాలు, 24 యుద్ధవిమానాలు, 2 యుద్ధనౌకలు, 2వేల యుద్ధ ట్యాంకులను ఉక్రెయిన్‌ నేలకూల్చింది. ఇటీవలే పదవీవిరమణ చేసిన ఆయనను ఉక్రెయిన్‌ నేపథ్యంలో మళ్లి విధుల్లోకి తీసుకున్నారు. ఈ యుద్ధంలో ఇప్పటివరకు 31మంది సుశిక్షితులైన పైలట్లు ప్రాణాలు కోల్పోయారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement