Friday, May 17, 2024

జాబ్ పేరుతో మొసాలు.. ఎక్క‌డో తెలుసా..

న్యూఢిల్లి, (ప్రభన్యూస్): దేశ రాజధాని న్యూఢిల్లి నడిబొడ్డున, పార్లమెంటుకు కూతవేటు దూరంలో గల్ఫ్‌ ఉద్యోగాల పేరుతో టోకరా వేసిన ఘరానా మోసం వెలుగుచూసింది. ఢిల్లిలోని పటేల్‌ నగర్‌లో ”స్కైనెట్‌ గ్లోబల్‌ సొల్యూషన్స్‌” పేరుతో నిరుద్యోగులకు గాలమేసిన ఓ సంస్థ, వారిదగ్గర నుంచి వేలల్లో డబ్బులు వసూలు చేసి, విమానం ఎక్కించేముందు బోర్డు తిప్పేసింది. దీంతో బాధితులు లబోదిబోమంటూ స్థానిక పటేల్‌నగర్‌ పోలీసులను ఆశ్రయించారు. బాధితుల్లో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలతో పాటు కేరళ, కర్ణాటక, యూపీ, బీహార్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాలకు చెందినవారు ఎక్కువ మంది ఉన్నారు. పాస్‌పోర్టులు, తాము కట్టిన డబ్బులు ఇప్పించాలంటూ పోలీసులు వారు ప్రాధేయపడుతున్నారు. ఫిర్యాదు చేసి మూడు రోజులు గడిచినా పోలీసులు పట్టించుకోవడం లేదని, కన్సల్టెన్సీ యజమాని ధీరజ్‌ సహా ఉద్యోగులంతా ఫోన్‌లో అందుబాటులోనే ఉన్నారని బాధితులు చెబుతున్నారు. జీఎస్టీ రిజిస్ట్రేషన్‌, ఆన్‌లైన్‌ పేమెంట్‌ విధానం చూసి తాము కన్సల్టెన్సీని నమ్మామని, కానీ తీరా చూస్తే సంస్థ బోర్డు తిప్పేసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సోషల్‌ మీడియాలో ప్రకటనలు చూసి తాను ఈ కన్సల్టెన్సీని ఆశ్రయించానని ఉత్తరాఖండ్‌కు చెందిన రతన్‌సింగ్‌ చెప్పారు. తొలుత పాస్‌పోర్ట్‌ తీసుకుని వీసా, మెడికల్‌ టెస్టుల కోసం డబ్బులు కట్టించుకున్నారని, వీసా కూడా వచ్చిందని చెప్పారు. ఆన్‌లైన్‌లో పరిశీలిస్తే, వీసా కూడా నిజమైనదేనని తేలిందని, దాంతో తాను మిగతా డబ్బు కట్టానని అన్నారు. తనకు ఈనెల 3న ఢిల్లి నుంచి దుబాయ్‌కి విమానం టికెట్లు బుక్‌ చేశారని, కానీ తీరా విమానాశ్రయానికి చేరుకున్నాక అవి రద్దయినట్టు తెలిసిందని వాపోయారు. ఇదేంటని కన్సల్టెన్సీని ప్రశ్నిస్తే, ఎదురు బెదిరింపులకు దిగారని ఆవేదన వ్యక్తం చేశారు. ”చెల్లించిన డబ్బుల విషయం మర్చిపోండి, పాస్‌పోర్ట్‌ పోస్టులో ఇంటికి వస్తుంది, గట్టిగా గొడవ చేస్తే పాస్‌పోర్టు కూడా తిరిగివ్వను, ఏం చేసుకుంటారో చేసుకోండి” అంటూ బెదిరిస్తున్నారని రతన్‌ సింగ్‌ చెప్పారు.

గతంలో గల్ఫ్‌ దేశాల్లో 14 ఏళ్లపాటు పనిచేసిన తెలంగాణలోని కామారెడ్డికి చెందిన బాబు మహమ్మద్‌ కూడా ఈ కన్సల్టెన్సీ చేతిలో మోసపోయారు. అయితే ఈ కన్సల్టెన్సీ జీఎస్టీ రిజిస్ట్రేషన్‌ ఉన్నప్పటికీ, జాబ్‌ కన్సల్టెన్సీ లైసెన్స్‌ లేకపోవడంతో కొంత సందేహిస్తూనే వచ్చానని, అందుకే సగం డబ్బు మాత్రమే కట్టి, విమానం ఎక్కే ముందు మిగతా డబ్బు చెల్లిస్తానని చెప్పానని తెలిపారు. గల్ఫ్‌ దేశాల్లో విజిట్‌ వీసాపై వెళ్లి, ఆ తర్వాత దాన్ని వర్క్‌ పర్మిట్‌గా మార్చుకోవడం సహజమేనని, ఈ క్రమంలో తనకు పంపిన విజిట్‌ వీసా చూసి కొంత నమ్మానని చెప్పుకొచ్చారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement