Tuesday, April 30, 2024

శ్రీవారి దర్శనానికి వస్తే.. దొంగ ఓటర్లు అంటూ గొడవ చేస్తారా?

తిరుపతి ఉప ఎన్నికలో ఎక్కడా చిన్నపాటి ఘటనలు కూడా లేకుండా ప్రశాంతంగా జరుగుతున్నాయని  ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. టీడీపీనే లేనిపోని గొడవ చేస్తోందని విమర్శించారు. తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా తమపై అనవసరంగా దొంగ ఓట్ల ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. పోలింగ్‌పై టీడీపీ నేతలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని అన్నారు. తిరుపతికి వచ్చే టూరిస్టులు దొంగ ఓటర్లని టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.  శ్రీవారి దర్శనానికి బస్సుల్లో వస్తే దానిపై కూడా గొడవ చేస్తారా? అని ప్రశ్నించారు. తిరుపతి తప్ప మిగిలిన చోట్ల ఇలాటి ఘటనలు ఎందుకు లేవని నిలదీశారు. ప్రతిదీ కుట్రపూరితంగా ఆలోచించడం చంద్రబాబు నైజం అని విమర్శించారు. తిరుపతి లోక్ సభ స్థానం ఉప ఎన్నిక పరిధిలో చంద్రబాబు మిగతా అసెంబ్లీ స్థానాలను వదిలేసి తిరుపతినే టార్గెట్ చేయడం వెనుక లోతైన కుట్ర ఉందన్నారు.

తిరుపతికి దేశం నలుమూలల నుంచి వేలమంది భక్తులు వస్తుంటారు కాబట్టి వారిని దొంగ ఓటర్లుగా ముద్ర వేసే తంతుకు తెరదీశారని ధ్వజమెత్తారు. తమకు అనుకూల మీడియా సాయంతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఎక్కడైనా దొంగ ఓటర్లను బస్సులు పెట్టి తీసుకువస్తారా అని ప్రశ్నించారు. దొంగ ఓట్ల పేరుతో టీడీపీ డ్రామాలు ఆడుతోందని సజ్జల రామకృష్ణారెడ్డి దుయ్యబట్టారు. చంద్రబాబు ఆయన గతంలో చేసిన పనులను తమ ప్రభుత్వానికి ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఓడిపోతారని తెలిసే బాబు ముందుగా సాకులు వెతుక్కుంటున్నారని పేర్కొన్నారు. డిపాజిట్‌ కూడా దక్కదనే భయంతోనే చంద్రబాబు దొంగ డ్రామాలు ఆడుతున్నారని, దొంగ ఓట్లు వేసే అవసరం తమకు లేదని సజ్జల స్పష్టం చేశారు.  

Advertisement

తాజా వార్తలు

Advertisement