Tuesday, May 21, 2024

పరుగులు పెడుతున్న ఐటీ.. రాష్ట్ర జీఎస్డీపీలో గణనీయంగా పెరిగిన వాటా..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తొలినాళ్లతో పోలిస్తే తెలంగాణ రాష్ట్ర స్థూల రాష్ట్రీయ ఉత్పత్తిలో ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ రంగం(ఐటీ) వాటా గణనీయంగా పెరిగింది. 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుంచి విడిపోయి ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన కొత్తలో తెలంగాణ జీఎస్డీపీ రూ.5 లక్షల కోట్లుండగా అప్పట్లో రాష్ట్రం నుంచి ఐటీ ఎగుమతులు 55 వేల కోట్లుగా ఉన్నాయి. ఇది మొత్తం జీఎస్డీపీలో 11 శాతం వాటా కాగా గడిచిన ఆర్ధిక సంవత్సరం(2021-22)లో రాష్ట్ర జీఎస్డీపీ 11 లక్షల కోట్ల రూపాయలకు చేరగా ఇదే ఆర్ధిక సంవత్సరంలో ఐటీ ఎగుమతులు ఏకంగా లక్షా 83 వేల కోట్లకు చేరుకున్నాయి. దీంతో ప్రస్తుతం తెలంగాణ జీఎస్డీపీలో ఐటీ ఎగుమతుల వాటా 17 శాతానికి చేరినట్లయింది. ఈ వివరాలను ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన 2021-22 ఐటీ రంగ వార్షిక నివేదికలో ప్రభుత్వం వెల్లడించింది. గడిచిన రెండేళ్లలో కొవిడ్‌ సంక్షోభంలో రాష్ట్ర జీఎస్డీపీ వృద్ధితో పోలిస్తే ఐటీ ఎగుమతుల వృద్ధి ఎక్కువగా ఉండడమే జీఎస్డీపీలో ఐటీ రంగం వాటా పెరిగేందుకు దోహదపడిందని ఐటీ శాఖ ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు. కొవిడ్‌తో సమాజంలో వచ్చిన మార్పుల ప్రభావంతో ఐటీ రంగం వృద్ధి వేగవంతమైందని, ఇది భవిష్యత్తులో కూడా కొనసాగుతుందని వారు చెబుతున్నారు. ఒక్క 2021-22 ఆర్ధిక సంవత్సరంలోనే రాష్ట్రంలో ఐటీ ఎగుమతులు అంతకముందు ఆర్ధిక సంవత్సరం(2020-21)తో పోలిస్తే రికార్డుస్థాయిలో 26.14 శాతం వృద్ధి చెందాయని, ఈ రికార్డుస్థాయి వృద్ధి వల్లే ఐటీ రంగంలో ఒక్క ఏడాదిలోనే ఒక లక్షా 50వేల కొత్త ఉద్యోగాల కల్పన జరిగిందని అధికారులు పేర్కొంటున్నారు. గడిచిన ఆర్ధిక ఏడాదిలో దేశం మొత్తం మీద ఐటీ రంగంలో 4లక్షల50వేల ఉద్యోగాల సృష్టి జరగగా వీటిలో మూడవ వంతు కేవలం తెలంగాణలోనే ఉద్యోగాల కల్పన జరగడంపై పలువురు ఐటీ రంగ వాణిజ్యవేత్తలు, నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఎనిమిదేళ్లలో 4లక్షల54వేల కొత్త ఉద్యోగాలు…

తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఐటీ రంగంలో ఉద్యోగాలు 3లక్షల23వేల396 ఉండగా గడిచిన ఎనిమిదేళ్లలో తెలంగాణ ప్రభుత్వం ఐటీ రంగంపై పెట్టిన ఫోకస్‌ కారణంగా ఓ వైపు ఎగుమతులు రికార్డుస్థాయిలో వృద్ధి చెందుతూ మరోవైపు 4లక్షల54వేల కొత్త ఐటీ ఉద్యోగాలు వచ్చాయి. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం ఐటీ ఉద్యోగుల సంఖ్య 7లక్షల78వేల121కి చేరింది. అవినీతికి ఆస్కారం లేని సింగిల్‌ విండో సెల్ఫ్‌ సర్టిఫికేషన్‌ విధానం టీఎస్‌ఐపాస్‌కు ఆకర్షితమై భారీగా రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడుల వల్లే ఐటీ ఎగుమతులు, ఉద్యోగాల్లో రికార్డుస్థాయి వృద్ధి సాధ్యమైందని అధికారులు పేర్కొంటున్నారు.

2035 లక్ష్యాలు 2025కల్లా పూర్తి…

2010లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉండగా అప్పటి యూపీఏ ఆధ్వర్యంలోని కేంద్రప్రభుత్వం హైదరాబాద్‌లో ఐటీఐఆర్‌ ఏర్పాటు చేస్తూ 25 సంవత్సరాల్లో ఐటీ రంగం సాధించగలిగే లక్ష్యాలను అంచనా వేసింది. అయితే అనంతర పరిస్థితుల్లో కేంద్రప్రభుత్వం మారి ఐటీఐఆర్‌ రద్దయినప్పటికీ ఆంధ్రప్రదేశ్‌ నుంచి ప్రత్యేక రాష్ట్రంగా విడిపోయిన తెలంగాణ మాత్రం ఐటీ రంగంలో దూసుకుపోతూ 2035 లక్ష్యాలను కేవలం 15 ఏళ్లలోనే అంటే 2025కల్లా చేరుకునే అవకాశాలున్నాయని నాస్కామ్‌ అంచనా వేస్తుండడం విశేషం.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement