Friday, May 10, 2024

తొలి టెస్టు ఇంగ్లండ్‌దే.. 5 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌పై ఘన విజయం

పర్యాటక న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లండ్‌ జట్టు ఘన విజయం సాధించింది. లార్డ్స్‌లో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో జోరూట్‌ అద్భుతంగా రాణించాడు. 170 బంతులు ఎదుర్కొని 12 ఫోర్లతో సెంచరీతో అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. మరో రోజు మిగిలి ఉండగానే 5వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ గెలుపొందింది. అంతకు ముందు 216/5 స్కోరుతో నాల్గవ రోజు బరిలోకి దిగిన జో రూట్‌.. ఏ దశలోనూ తన పట్టు సడలించలేదు. కడవరకు క్రీజులో ఉండి విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. ఈ క్రమంలో ఇంగ్లండ్‌ వికెట్‌ కీపర్‌ కమ్‌ బ్యాటర్‌ బెన్‌ ఫోక్స్‌ (32) కలిసి కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. వీరిద్దరు 120పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నమోదు చేసి ఇంగ్లండ్‌ విజయదాహాన్ని తీర్చారు. ఇక టెస్ట్‌ ఛాంపియన్‌ షిప్‌ (2021- 23)లో ఇప్పటికే 13 మ్యాచ్‌లలో ఒక్క మ్యాచ్‌ మాత్రమే గెలిచి అట్టడుగు స్థానంలో కొనసాగుతున్న ఇంగ్లండ్‌కు ఈ విజయంతో 2వ గెలుపుతో కాస్త ఊరట లభించినట్లయింది. ఇక సిరీస్‌లో (1-0)తేడాతో ఇంగ్లండ్‌ ఆధిక్యంలో వచ్చింది. కొత్త కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌, కొత్త కోచ్‌ బ్రెండన్‌ మెక్కల్లమ్‌ ఆధ్వర్యంలో గెలుపుతో ఇంగ్లండ్‌ తన ప్రయాణాన్ని ప్రారంభించింది.

న్యూజిలాండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో డరైల్‌ మిచెల్‌ (108) సెంచరీతో ఆకట్టుకోగా.. టామ్‌ బ్లండెల్‌ (96) రాణించడంతో 285పరుగులు చేసింది. ఇకపోతే 277పరుగుల విజయలక్ష్యంతో చివరి ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు గడ్డుపరిస్థితి ఎదురైంది. ఓపెనర్లు క్రీజులో నిలదొక్కుకోకుండానే పెవిలియన్‌ చేరారు. ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌ లైనప్‌ను న్యూజిలాండ్‌ బౌలర్‌ కైలీ జేమీసన్‌ (4-59) తన పదునైన బంతులతో ముప్పుతిప్పలు పెట్టి కుప్పకూల్చాడు. దీంతో 59పరుగులకే 4వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ తీవ్ర కష్టాల్లో పడింది. ఈ దశలో బరిలోకి దిగిన జో రూట్‌, కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌తో కలిసి ఇన్నింగ్స్‌ చక్కదిద్దారు. స్టోక్స్‌(54) హాఫ్‌ సెంచరీ అనంతరం ఔటయినా, జోరూట్‌ మొండిగా క్రీజులో నిలిచి పోరాడాడు. ఈ దశలో సెంచరీ పూర్తి చేసిన జోరూట్‌.. 118టెస్ట్‌ల్లో పదివేల పరుగుల మైలురాయి కూడా చేరుకున్నాడు. ఇక కడవరకు క్రీజులో ఉండి చివరగా బౌండరీ బాది ఇంగ్లండ్‌కు మరపురాని విజయాన్ని అందించాడు.

స్కోర్‌ బోర్డు..

న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 132
ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 141
న్యూజిలాండ్‌ సెకండ్‌ ఇన్నింగ్స్‌: 285
ఇంగ్లండ్‌ సెకండ్‌ ఇన్నింగ్స్‌: 279/ 5వికెట్లు

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement