Saturday, April 27, 2024

Delhi : జైలు నుంచే రూలింగ్… తొలి ఆదేశం జారీ చేసిన కేజ్రీవాల్

జైలుకు వెళ్లినా కేజ్రీవాలే సీఎంగా కొనసాగుతారని ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికే పలుమార్లు ప్రకటించింది. అన్నట్లుగానే ఈడీ కస్టడీ నుంచే కేజ్రీవాల్ ఢిల్లీని పాలిస్తున్నారు. ఈమేరకు ఆయన తొలి ఆదేశాలు జారీచేశారు. ఆర్డర్ లెటర్ ను మంత్రి అతిషీకి పంపించి, ఆమేరకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

- Advertisement -

ఈ లెటర్ ను అందుకున్నాక తనకు కన్నీళ్లు ఆగలేదని మంత్రి అతిషీ పేర్కొన్నారు. ఈమేరకు మీడియా సమావేశం ఏర్పాటు చేసి, కేజ్రీవాల్ పంపిన ఆర్డర్ లెటర్ ను చదివి వినిపించారు. లేఖ చదువుతూ కన్నీటిపర్యంతమయ్యారు. ఎక్కడ ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే కేజ్రీవాల్ ఆలోచనలన్నీ ఢిల్లీ ప్రజల సంక్షేమం చుట్టూనే తిరుగుతాయని మంత్రి చెప్పారు. ఇది కేవలం ఒక్క కేజ్రీవాల్ మాత్రమే చేయగలడని, ఆయనకు మాత్రమే సాధ్యమయ్యే పని అని అతిషీ చెప్పారు. ఇలాంటి నాయకుడి వెంట నడవడం గర్వకారణమని అన్నారు.

కేంద్రంలోని బీజేపీ కక్షగట్టి కేజ్రీవాల్ ను జైలుకు పంపొచ్చు గాక.. ఢిల్లీ ప్రజలపై ఆయనకున్న ప్రేమను ఇసుమంతైనా తగ్గించలేదని మంత్రి అతిషీ చెప్పారు. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ప్రజలు నీటి ఎద్దడి, సీవేజ్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని సీఎం కేజ్రీవాల్ దృష్టికి వెళ్లిందన్నారు. దీంతో ఆయన వెంటనే స్పందించారని, అవసరమైన చర్యలు చేపట్టాలని, అవసరమైతే ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సహకారం తీసుకోవాలని ఆదేశిస్తూ లేఖ రాసి పంపారని తెలిపారు.

అందులో.. తాను జైలులో ఉండడం వల్ల ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి తలెత్తకూడదని, నీటి కొరతను తీర్చేందుకు ట్యాంకర్లను పంపించాలని ఢిల్లీ వాటర్ బోర్డ్ అధికారులను సీఎం కేజ్రీవాల్ ఆదేశించారని అతిషీ వివరించారు. ఢిల్లీలోని రెండు కోట్ల మంది ప్రజలను తన కుటుంబ సభ్యులుగా భావిస్తున్నారు కాబట్టే కేజ్రీవాల్ వారి ఇబ్బందులు తీర్చేందుకు తపిస్తున్నారని చెప్పారు. తన పరిస్థితిని, ఇబ్బందులను కూడా మరిచి ప్రజల కోసమే ఆలోచిస్తున్న గొప్ప నేత అని అతిషి కొనియాడారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement