Saturday, May 4, 2024

Delhi | చంద్రబాబు శిష్యుణ్ణి కాదు, సహచరుణ్ణి మాత్రమే: రేవంత్ రెడ్డి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తాను చంద్రబాబు నాయుడికి శిష్యుణ్ణి కాదు సహచరుణ్ణి అని తెలంగాణ పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్నారు. తనను చంద్రబాబు నాయుడి శిష్యుడు అంటూ భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నేతలు చేస్తున్న విమర్శలకు బదులిస్తూ.. తాను, కేసీఆర్ ఇద్దరం తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చినవాళ్లమే అని గుర్తుచేశారు. మంగళవారం సాయంత్రం ఢిల్లీలోని తన నివాసం వద్ద మీడియా సమావేశం నిర్వహించిన రేవంత్.. తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరానని, కేసీఆర్ మాత్రం యూత్ కాంగ్రెస్ నుంచి బహిష్కరణకు గురై తెలుగుదేశం పార్టీలో కార్యకర్తగా చేరి శిష్యుడిగా పనిచేశారని అన్నారు.

నిలువనీడ లేని కేసీఆర్‌కు టీడీపీనే ఆధారమైందని అన్నారు. తెలుగుదేశం పార్టీలో తానెప్పుడూ చంద్రబాబు నాయుడుకు సహచరుడిగానే వ్యవహరించానని, ఏ పార్టీలో ఉన్నా సరే తెలంగాణ పట్ల తన నిబద్ధత మారలేదని వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఒకలా, బయటికొచ్చాక మరోలా మాట్లాడింది కేసీఆరేనని.. తెలంగాణకు కేసీఆర్ చేసిన ద్రోహంపై అమరవీరుల స్థూపం వద్ద చర్చకు సిద్ధమని రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ రాలేకపోతే కేటీఆర్, హరీష్ ను పంపాలని సవాల్ విసిరారు.

అసెంబ్లీలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. తండ్రీ కొడుకుల తీరుపై విమర్శలు కురిపించారు. నాటి టీఆర్ఎస్ ప్రభుత్వంలో భాగంగా ఉన్నప్పుడే అప్పటి ప్రభుత్వం తెలంగాణకు నష్టం కలిగించే పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచిందని, పోలవరం ప్రాజెక్టు కోసం టెండర్లు పిలిచిందని రేవంత్ గుర్తుచేశారు. ప్రభుత్వంలో టీఆర్ఎస్ నేతలు మంత్రులుగా ఉన్నప్పుడే పులిచింతల ప్రాజెక్టు కట్టారని అన్నారు. “కేసీఆర్ తెలంగాణకు చేసిన ద్రోహంపై అమరవీరుల స్థూపం వద్ద చర్చకు నేను సిద్ధంగా ఉన్నా… కేసీఆర్ నువ్వు నా పేరు ఎత్తలేవు.. నీ కొడుకు కేటీఆర్ నా కళ్ళలోకి సూటిగా చూడలేడు.. అందుకే చర్చకు అల్లుడు హరీష్ ను పంపు” అంటూ రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.

- Advertisement -

వచ్చే ఎన్నికల్లో బీఆరెస్ కు 25 సీట్లకు మించి రావని, అందుకే కేసీఆర్ కాంగ్రెస్ పై దాడికి దిగారని రేవంత్ అన్నారు. కేసీఆర్ అండ్ కో అసెంబ్లీని చిల్లర రాజకీయాలకు వేదికగా మార్చారని దుయ్యబట్టారు. తెలంగాణ తొలిదశ, మలి దశ ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించిన గద్దర్‌కు శాసనసభలో సంతాపం తెలపకపోవడం దారుణమని అన్నారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో చర్చ జరపడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. కేవలం రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని, కాంగ్రెస్ పార్టీని దూషించడం కోసమే సభా సమయాన్ని కేటాయించారని మండిపడ్డారు.

తెలంగాణ పట్ల తన నిబద్ధత ఎప్పుడూ మారలేదని, తెలంగాణ సమస్యలపై ప్రశ్నించడంలో ఎప్పుడూ ముందే ఉన్నానని చెప్పారు. కానీ కేసీఆర్ చంద్రబాబుతో ఉన్నప్పుడు 610 జీవోను తప్పుబడుతూ తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతీసేలా మాట్లాడారని గుర్తుచేశారు. 1996లో 610జీవోను, జోనల్ విధానాన్ని రద్దు చేయాలని అసెంబ్లీలో మాట్లాడిన తెలంగాణ ద్రోహి కేసీఆర్ అని రేవంత్ విరుచుకుపడ్డారు. 1996లో మంత్రిగా కేసీఆర్ మాట్లాడిన మాటలను కేటీఆర్ వినాలని సూచించారు. సోనియా గాంధీ వల్లే తెలంగాణ సాకారమైందని 2014 జూన్ 13న తెలంగాణ తొలి శాసనసభలో చెప్పిన కేసీఆర్… ఇప్పుడు కాంగ్రెస్ ను, రేవంత్ రెడ్డిని దోషిగా ఎలా నిలబెడతారని ప్రశ్నించారు.

తెలంగాణ కోసం 2011లో అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకున్నది, నిలదీసింది తానేనని… చంద్రబాబు సహచరుడుగా ఉన్నా ఆనాడు తెలంగాణపై తన నిబద్ధత మారలేదని గుర్తుచేశారు. ఆనాడు గవర్నర్ పై దాడి ఘటనలో సభ నుంచి సస్పెండ్ అయ్యాయనని అన్నారు. 2014 జనవరి 24న సమైక్య పాలనలో తెలంగాణకు జరిగిన అన్యాయంపై 54 నిమిషాలు సభలో వివరించానని తెలిపారు. హైదరాబాద్ తో కూడిన తెలంగాణ రాష్ట్రం కావాలని నొక్కి చెప్పానని, అప్పర్ సీలేరు, లోయర్ సీలేరులో తెలంగాణ కు అన్యాయం జరుగుతుందని చెప్పానని గుర్తుచేశారు.

తాను ఏ స్థాయిలో ఉన్నా తెలంగాణ పక్షానే ఉన్నానని, పాలక పక్షాలకు నేను ఎన్నడూ అమ్ముడు పోలేదన్నారు. పార్టీలు మారి ఉండవచ్చు కానీ తెలంగాణ వాదాన్ని వీడలేదన్నారు. అధికారంలో ఉన్న పార్టీల్లో చేరి పదవులు పొందలేదని, పార్టీ మారిన ప్రతి సందర్భంలోనూ ప్రతిపక్షంలో ఉండగా చేరి ప్రజా గొంతుకగా వ్యవహరించానని అన్నారు. పొన్నం, వివేక్ వెంకటస్వామి, జైపాల్ రెడ్డి, కోమటిరెడ్డి లాంటి కాంగ్రెస్ నాయకులు అధిష్టానాన్ని వ్యతిరేకించి తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్లేనని గుర్తు చేశారు. తెలంగాణ కోసం మంత్రి పదవి త్యాగం చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి మళ్లీ ఏ పదవీ తీసుకోలేదని అన్నారు.

కేసీఆర్ కుటుంబం ఇప్పుడు అనుభవిస్తుందంతా కాంగ్రెస్ బిక్షనే అని రేవంత్ అన్నారు. “కాంగ్రెస్ లేకపోతే కెసిఆర్ కుటుంబం బిచ్చమెత్తుకునేది. కేసిఆర్ ని కేంద్రంలో మంత్రిని చేసిందే కాంగ్రెస్ పార్టీ. ఎమ్మెల్యేగా గెలవకపోయినా హరీష్ రావు ను మంత్రిని చేసింది కాంగ్రెస్.  కేకే మహేందర్ కు వెన్నుపోటు పొడిచి కేటీఆర్ ను కేసీఆర్ గెలిపించుకుంది నిజం కాదా? టీడీపీ కండువా కప్పుకుంటేనే సిరిసిల్లలో  కేటీఆర్ మొదటిసారి గెలిచింది. మహబూబ్ నగర్ లో ఎంపీగా గెలిపించింది నేను కాదా?. అప్పుడు టీఆర్ఎస్ జెండా మోసేవాడే లేడు.

టీడీపీ, కాంగ్రెస్ లో ఉండి తెలంగాణ కు మోసం చేసింది కేసీఆర్. టీడీపీ, కాంగ్రెస్ లు నష్టం చేశాయని చెప్పే కేసీఆర్… అప్పుడు ఎన్నికల్లో వాటితోనే ఎందుకు పొత్తు పెట్టుకున్నారు?. శాసనమండలి ఎన్నికల్లో ఎమ్మెల్యేలను అమ్ముకున్నది కేసీఆర్ కాదా? వ్యాపారం చేసింది హరీష్ రావు కాదా?. సమైక్య ఆంధ్రప్రదేశ్ కోసం నెలల తరబడి ఉద్యమం చేసిన జగన్ ను ప్రగతి భవన్ కు పిలిచి పంచభక్ష పరమాన్నాలు పెట్టింది ఎవరు?” అంటూ రేవంత్ బీఆర్ఎస్ అధినేతలపై ప్రశ్నల వర్షం కురిపించారు. తెలంగాణ ద్రోహులతో అంటకాగింది కేసీఆర్ అని, పార్టీ పెట్టేందుకు ఆఫీస్ ఇచ్చిన కొండా లక్ష్మణ్ బాపూజీ లాంటి వ్యక్తి చనిపోతే కనీసం నివాళి అర్పించేందుకు కూడా వెళ్లని కుసంస్కారి కేసీఆర్ అని రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

నిక్కర్ పార్టీ – లిక్కర్ పార్టీ ఒక్కటయ్యాయి

2011లో కేసీఆర్ తో కిషన్ రెడ్డి పొత్తు పెట్టుకుని ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ ద్రోహులతో అంటకాగి కేసీఆర్ లాలూచీపడ్డారని విమర్శించారు. ఏ రోకటి కాడ ఆ పాట పాడే వ్యక్తి కేసీఆర్ అని రేవంత్ రెడ్డి విమర్శించారు. “గద్దర్ 2019 మొదలు పెట్టిన తుది దశ తెలంగాణ ఉద్యమం సాకారం కావాలి. గద్దర్ చివరి కోరిక, ఆకాంక్ష నెరవేర్చేందుకు ఆయన స్ఫూర్తిని మేం కొనసాగిస్తాం. నిక్కర్ పార్టీ, లిక్కర్ పార్టీ ఒక్కటయ్యాయని గద్దరన్న నాతో చెప్పారు. యుద్ధం వ్యూహాత్మకంగా చేయాలని నాకు సూచించారు..కేసీఆర్ క్రిమినల్ పొలిటీషియన్ అని.. జాగ్రత్తగా ఉండాలని ఆయన అప్పుడే చెప్పారు.” అని రేవంత్ రెడ్డి అన్నారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement