Friday, May 17, 2024

Hyd: జూపల్లిని పార్టీలోకి ఆహ్వానించిన రేవంత్, కోమటిరెడ్డి

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్‌లో చేరికల విషయంలో కొందరు నేతల నుంచి అభ్యంతరాల వ్యక్తం అవుతున్నాయనే ప్రచారం నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఈరోజు హైదరాబాద్‌లోని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నివాసానికి వెళ్లారు. అక్కడ కోమటిరెడ్డి, రేవంత్ రెడ్డిలు కొద్దిసేపు చర్చించుకున్నారు. అనంతరం ఇరువురు నేతలు కలిసి అక్కడి నుంచి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు నివాసానికి బయలుదేరి వెళ్లారు. జూపల్లిని రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు.

అయితే జూపల్లి ఇంటికి బయలుదేరే సమయంలో మీడియాతో మాట్లాడిన ఇరువురు నేతలు.. పార్టీలో ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. తాను, రేవంత్ రెడ్డి రోజు మాట్లాడుకుంటామని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కలిసి పనిచేస్తామని చెప్పారు. మరోవైపు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాహుల్ గాంధీని ప్రధానిని చేసేవరకు కోమటిరెడ్డి, రేవంత్ రెడ్డి కలిసి పనిచేస్తారని అన్నారు. రేపు జరగబోయే ఎన్నికల్లో తెలంగాణ నుంచి కనీసం 15 పార్లమెంట్ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించేందుకు తాను, కోమటిరెడ్డి, ఇతర నాయకులు కలిసి పనిచేస్తామని చెప్పారు. అనంతరం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసానికి కూడా వెళ్లనున్నట్లు తెలిపారు. అంతకు ముందు రేవంత్ రెడ్డి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఆ తర్వాత ఆ ఇద్దరు నేతలు, చిన్నారెడ్డి, మల్లు రవితో కలిసి జూపల్లి ఇంటికి వెళ్లి లంచ్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

Advertisement

తాజా వార్తలు

Advertisement