Saturday, May 4, 2024

Delhi | రాజ్యసభ, కౌన్సిళ్ళలోనూ మహిళలకు రిజర్వేషన్ కల్పించాలి.. విజయసాయి విజ్ఞప్తి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : రాజ్యసభ, రాష్ట్రాల శాసన మండళ్ళలో కూడా మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ కల్పించాలని వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాజ్యసభలో గురువారం మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. మహిళా బిల్లుకు తమ పార్టీ మద్దతు తెలుపుతోందన్నారు. లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ కల్పించేందుకు ఉద్దేశించిన ఈ బిల్లులో రాజ్యసభ, రాష్ట్రాల శాసన మండళ్ళలో మహిళల రిజర్వేషన్‌ను విస్మరించడం తగదని అన్నారు.

- Advertisement -

రాజ్యసభ, మండళ్ళలో సభ్యులు తమ టర్మ్‌ పూర్తవగానే రిటైర్‌ అవుతుంటారవుతుండడం వల్ల రెండేళ్ళకు ఒకసారి ఖాళీలు ఏర్పడుతుంటాయని వివరించారు. కాబట్టి రాజ్యసభ, మండళ్ళలో కూడా మహిళలకు రిజర్వేషన్లు కల్పించేందుకు రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 80, 171లను సవరించాలని ఆయన న్యాయ శాఖ మంత్రికి విజ్ఞప్తి చేశారు.

చట్ట సభలలో మహిళలకు రిజర్వేషన్‌ కల్పించే చారిత్రాత్మకమైన బిల్లును  సభలో ప్రవేశపెట్టినందున ప్రతి ఏటా జరుపుకునే అంతర్జాతీయ మహిళా దినోత్సవం మాదిరిగానే చరిత్రలో మహిళల ఔన్నత్యాన్ని చాటి చెప్పేలా సెప్టెంబర్‌ నెలను చారిత్రక మహిళా మాసంగా జరుపుకునేలా ప్రకటించాలని విజయసాయి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

ఏపీలో మహిళలకు 50 శాతానికి మించే రిజర్వేషన్‌

1992లో రాజ్యాంగంలోని 73, 74 ఆర్టికల్స్‌ను సవరించడం ద్వారా పంచాయతీలు, మున్సిపాలిటీలలో మహిళలకు మూడింట ఒక వంతు రిజర్వేషన్‌ కల్పించరాని, అయితే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం చట్టబద్దంగా నిర్దేశించిన 33 శాతంకు మించే పంచాయతీలు, స్థానిక సంస్థలలో ప్రాతినిధ్యం కల్పించి మహిళా అభ్యున్నతి పట్ల తమ చిత్తశుద్ధిని చాటుకుందని విజయసాయి రెడ్డి వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం మహిళకు ఏ విధంగా పెద్ద పీట వేసిందో గణాంకాలతో సహా వివరించారు. స్థానిక సంస్థల్లో 1,356 ఖాళీలు ఉండగా అందులో 688 స్థానాలను అంటే 51 శాతం స్థానాలను మహిళలతో భర్తీ చేసినట్లు తెలిపారు. 13 జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పదవుల్లో ఏడింటిని మహిళలకు (అంటే 54 శాతం) కేటాయించడం జరిగింది. అలాగే 26 జిల్లా పరిషత్‌ వైఎస్‌ చైర్మన్‌ పోస్టులు ఉంటే 15 పోస్టులను (అంటే 58 శాతం) మహిళలే అలంకరించారు.

మునిసిపల్‌ కార్పొరేషన్లలో మొత్తం 36 మేయర్‌, డిప్యూటీ మేయర్‌ పోస్టులలో 50 శాతం అంటే 18 పోస్టుల్లో మహిళల నియామకం జరిగిందని చెప్పారు. 671 మునిసిపల్‌ కార్పొరేషన్‌, వార్డు సభ్యుల పదవుల్లో 53.8 శాతం పదవులు మహిళలకే దక్కాయి. రాష్ట్రంలోని 73 మున్సిపల్‌ ఛైర్మన్‌ పదవుల్లో 45 మంది మహిళలు (అంటే 62 శాతం) ఛైర్‌పర్సన్లుగా ఎన్నికయ్యారు. 2,124 మున్సిపల్‌ వార్డు సభ్యుల పదవుల్లో 1,061 పదవులకు మహిళలే ఎన్నికయ్యారని ఆయన వెల్లడించారు.

గ్రామ సర్పంచ్‌లలో 57 శాతం, ఎంపీటీసీలలో 54 శాతం, మండల అధ్యక్షుల్లో 53 శాతం, జడ్పీటీసీలలో 53 శాతం మహిళా సభ్యులే ఉన్నారని చెప్పారు. అలాగే వార్డు, విలేజ్‌ వలంటీర్లలో 53 శాతం, వార్డు, గ్రామ సచివాలయ అధికారుల్లో 51 శాతం మంది మహిళలే ఉన్నారని ఆయన తెలిపారు. ప్రతి కార్యక్రమంలో మహిళలకు సగభాగం అవకాశం కల్పిస్తూ మహిళా సాధికారికత కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నచర్యలు తమ చిత్తశుద్ధికి నిదర్శనమని విజయసాయి రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement