Tuesday, April 30, 2024

దేశ ఖజానాలో రిలయన్స్‌ వాటా 5 ట్రిలియన్లు.. వార్షిక నివేదికలో వెల్లడి

గడచిన మూడేళ్లలో దేశ ఖజానాలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ వాటా రూ.5 లక్షల కోట్లను దాటింది. ఈ మేరకు 2023 సంవత్సరానికి ఇటీవల విడుదలైన రిలయన్స్‌ వార్షిక నివేదిక పేర్కొంది. గత మూడేళ్లలో భారత ప్రభుత్వ బడ్జెట్‌ వ్యయం కన్నా ఇది ఐదు శాతం అధికం. 2023లో ఖజానాకు రిలయన్స్‌ వాటా రూ.1,77,173 కోట్లు కాగా 2022 సంవత్సరానికి అది రూ.1,88,012 కోట్లుగా నమోదైంది. తద్వారా పలు ప్రత్యక్ష, పరోక్ష పన్నుల ద్వారా జాతీయ ఖజానాకు అత్యధిక పన్ను చెల్లింపుదారుగా నిలిచింది. ఉపాధి కల్పనలో కంపెనీ సరికొత్త రికార్డును నెలకొల్పినట్టు నివేదిక పేర్కొంది.

2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను రియలన్స్‌ గ్రూప్‌ 2.62 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చింది. వారిలో 1.8 లక్షల మంది రిటైల్‌లో చేరగా, 70,500 మంది జియోలో చేరారు. ”తన వ్యాపారాలన్నింటా అదనంగా 2,62,558 ఉద్యోగాలను కల్పించడం ద్వారా భారతీయులకు ఉపాధి కల్పనలో రిలయన్స్‌ సరికొత్త రికార్డులను నెలకొల్పింది. 2,45,581 మంది ఆన్‌-రోల్‌ ఉద్యోగులతో దేశంలో అతి పెద్ద ఉద్యోగ ప్రదాతగా రిలయన్స్‌ రిటైల్‌ గుర్తింపు పొందింది” అని నివేదిక పేర్కొంది.

2023 సంవత్సరానికి రిలయన్స్‌ 171 పేటెంట్‌ దరఖాస్తులు చేయగా వాటిలో 141 పేటెంట్లు మంజూరు అయ్యాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది పరిస్థితి మెరుగ్గా ఉంది. 2022లో 152 పేటెంట్‌ దరఖాస్తులు చేయగా వాటిలో 123 మంజూరు అయ్యాయి. 2023 సంవత్సరానికి పరిశోధన, అభివృద్ధి కోసం రిలయన్స్‌ రూ.3,001 కోట్లు వెచ్చించింది. జియో బీపీ దేశవ్యాప్తంగా తన చార్జింగ్‌ పాయింట్లను విస్తరించుకుంటూ పోతున్నది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి 1,000కి పైగా పబ్లిక్‌ చార్జింగ్‌ పాయింట్లను జియో బీపీ ప్లస్‌ బ్రాండ్‌ కింద నెలకొల్పిన జియో బీపీ.. ఎనిమిది నగరాలు, ప్రధాన జాతీయ రహదారుల వెంబడి నెట్‌వర్క్‌ను 1,400కు పైగా పాయింట్లకు పెంచింది.

- Advertisement -

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ ముకేష్‌ అంబానీ వరుసగా మూడవ సంవత్సరం వేతనం పుచ్చుకోలేదు. కోవిడ్‌ మహమ్మారి భారత్‌లోకి ప్రవేశించి యావత్‌ దేశాన్ని సామాజిక, ఆర్థిక, పారిశ్రామిక ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తున్నప్పుడు 2020-21 ఆర్థిక సంవత్సరానికి వేతనం పుచ్చుకోకూడదని ముకేష్‌ స్వచ్చందంగా నిర్ణయించారు. అదే క్రమంలో 2021-22తో పాటుగా 2022-23 ఆర్థిక సంవత్సరంలో సైతం వేతనాన్ని వదులుకున్నారు. ఈ మూడేళ్ళలో చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ పాత్రను పోషించినందుకు గాను రిలయన్స్‌ నుంచి ఆయన ఎలాంటి భత్యాలు, అవసరాలు, ప్రయోజనాలు, కమిషన్‌ లేదా స్టాక్‌ ఆప్షన్లు పొందలేదు.

అంతకుమునుపు మేనేజ్‌మెంట్‌ స్థాయిలో స్వీయ నియంత్రణకు ఒక నిదర్శనం అన్నట్టుగా 2008-09 ఆర్థిక సంవత్సరం నుంచి తన వేతనాన్ని రూ.15 కోట్లకు ముకేష్‌ అంబానీ పరిమితం చేసుకున్నారు. కంపెనీ ఈ నెల 28న వార్షిక సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించనుంది. అదే సమయంలో రిటైల్‌, డిజిటల్‌ సర్వీసెస్‌, ఓ2సీ, ఈ అండ్‌ పీ లాంటి వ్యాపారాల్లో కంపెనీ సాధించిన పురోగతిని వార్షిక నివేదిక వెల్లడించింది. గ్రీన్‌ ఎనర్జీ రంగంలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ ఉద్దేశ్యాలను వివరించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement