Sunday, May 5, 2024

Delhi | త్వరలో రీజనల్ రింగ్ రోడ్డు పనులు ప్రారంభం..


న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఇంతకాలం రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం లేకపోవడం కారణంగా నిలిచిపోయిన రూ. 20 వేల కోట్ల రీజనల్ రింగ్ రోడ్డు పనులు త్వరలో ప్రారంభమవుతాయని తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన గురువారం సాయంత్రం కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని ఆయన నివాసంలో కలిశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఇంజనీర్లతో పాటుగా కేంద్ర మంత్రిని కలిసిన కోమటిరెడ్డి 2 గంటలకు పైగా సుదీర్ఘంగా తెలంగాణలోని ప్రాజెక్టుల గురించి చర్చించారు.

రాష్ట్రంలో 2,525 కి.మీ మేర రాష్ట్ర రహదారులను జాతీయరహదారులుగా మార్చినందుకు కేంద్రమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఈ పెంపుతో రాష్ట్రంలో జాతీయ రహదారుల పొడవు 4, 987 కి.మీ వరకు పెరిగిందని తెలిపారు. రాష్ట్రం ప్రభుత్వం ఇప్పటికే జిల్లా కేంద్రాలు, పారిశ్రామిక కారిడార్లు, పర్యాటక ప్రాంతాలు, తీర్థ స్థలాలు మరియు సమీప రాష్ట్రాలను కలిపే ముఖ్యమైన 15 రాష్ట్ర రహదారులను గుర్తించి వాటిని జాతీయ రహదారులుగా అప్ గ్రేడ్ చేయవలసిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతిపాదనలు పంపించిందని గుర్తుచేశారు. అందులో మొదటి ప్రాధాన్యతగా ఈ క్రింద పేర్కొన్న 780 కి.మీ. ల పొడవైన 6 రహదారులను జాతీయ రహదారులుగా ఈ 2024-25 వార్షిక ప్రణాళికలో పెట్టి అప్ గ్రేడ్ చేయాలని కోరారు.

1 చౌటుప్పల్- (NH-65) – ఆమన్ గల్ – షాద్ నగర్ – సంగారెడ్డి (NH-65) 182 కి.మీ
2 మరికల్ (NH-167)- నారాయణ్ పేట్ – రామ్ సముద్రం (NH-150) 63 కి.మీ
3 పెద్దపల్లి (SH-1) – కాటారం (NH-353C) 66 కి.మీ
4 పుల్లురు (NH-44)- ఆలంపూర్ – జెట్ ప్రోల్ – పెంట్లవెల్లి – కొల్లాపూర్ – లింగాల్ – అచ్చంపేట్ – దిండి (NH-765)- దేవరకొండ (NH-167)- మల్లెపల్లి (NH-167)- నల్గొండ (NH-565) 225 కి.మీ
5 వనపర్తి –కొత్తకోట –గద్వాల్ –మంత్రాలయం(NH-167) 110 కి.మీ
6 మన్నెగూడ (NH-163)- వికారాబాద్ – తాండూర్ – జహీరాబాద్ – బీదర్ (NH-50) 134 కి.మీ

RRR దక్షిణ భాగం జాతీయ రహదారి గెజిట్ నోటిఫికేషన్ కోసం వినతి:

భారతమాల పధకం ఫేజ్-I క్రింద రీజినల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగం (“సంగారెడ్డి-నర్సాపూర్-తూప్రాన్-చౌటుప్పల్”)  గ్రీన్ ఫీల్డ్ అలైన్ మెంట్ మాత్రమే మంజూరైంది. దీని కోసం భూసేకరణ కొనసాగుతోంది. రీజినల్ రింగ్ రోడ్డు సంపూర్ణంగా (ఉత్తర మరియు దక్షిణ భాగం) పూర్తయి ప్రజలకు అందుబాటులోకి రావాలంటే.. దక్షిణ భాగానికి కూడా జాతీయ రహదారి హోదా గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని కేంద్ర మంత్రిని కోరారు. అలాగే నల్గొండ బైపాస్ రోడ్ గురించి కూడా విజ్ఞప్తి చేశారు. ఖమ్మం బైపాస్ అలైన్మెంట్ (నాగ్‌పూర్ –విజయవాడ కారిడార్ NH-163G), మహబూబ్ నగర్ బైపాస్ (పనాజీ-హైదారబాద్ ఎకనామిక్ కారిడార్, NH-167), రీజినల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగం యుటిలీటి ఛార్జీల చెల్లించడం వంటి సమస్యల్ని పరిష్కరించినట్టు మంత్రి కోమటిరెడ్డి వెల్లడించారు. అలాగే నల్గొండ టౌన్ బైపాస్ (15.2 కి.మీ) డిటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇదివరకే సమర్పించిన విషయాన్ని గుర్తుచేశానన్నారు. రూ. 700 కోట్ల విలువైన ప్రతిపాదనను 2023-24 వార్షిక ప్రణాళికలోనే మంజూరీ చేయవలసిందిగా కేంద్ర మంత్రిని కోరినట్టు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు.

కేంద్ర ప్రభుత్వ సహకారంతో నకిరేకల్-నాగార్జున సాగర్ రోడ్డుని NH-565గా ప్రకటించి. రూ. 370 కోట్ల మంజూరయ్యాయని, నల్గొండ పట్టణంలో పట్టణీకరణ ఇబ్బందుల వలన 3 కి.మీ మేర మంజూరైనప్పటికీ 4 లైన్లుగా విస్తరణ చేయలేకపోయామని తెలిపారు. నల్గొండ పట్టణంలో 3 కి.మీ పొడవు కలిగిన ఈ రోడ్డును బలోపేతం చేయడం, స్ట్రీట్ లైటింగ్, సైడ్ డ్రైన్స్ నిర్మాణం చేపట్టవలసిందిగా కోరినట్టు మంత్రి వివరించారు. దీంతో పాటు నల్గొండ జిల్లాలో ట్రాన్స్‌పోర్ట్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ కోసం 25 ఎకరాల స్థలాన్ని హైదారాబాద్-విజయవాడ జాతీయ రహదారి (NH-65) పక్కన గుర్తించామని, ఈ  ట్రాన్స్ పోర్ట్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ ఏర్పాటు కోసం రూ.65 కోట్లను వన్ టైం గ్రాంట్ క్రింద మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని కోరారు. ఈ ఇనిస్టిట్యూట్ ద్వారా నల్గొండ జిల్లాతో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ యువతకు ట్రాన్స్‌పోర్ట్ ఫీల్డ్ లో మెరుగైన ఉపాధి దొరుకుతుందని అన్నారు. ఉప్పల్ – ఘట్కేసర్ ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణ పనులు ప్రారంభించి ఐదేళ్లు దాటినా ఇంకా పూర్తికాలేదని, ఈ మార్గం హైదరాబాద్ నగరాన్ని బీబీనగర్‌లో ఏర్పాటు చేసిన ఎయిమ్స్‌తో పాటు తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన యాదగిరి గుట్టకు, వరంగల్ నగరానికి అనుసంధానం చేసే కీలక మార్గమని తెలిపారు. కేంద్ర హైవేలు, ఇతర ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందించాల్సిన సహకారం పూర్తిగా అందుతుందని హామీ ఇచ్చారు. మరోవైపు రైల్వే లైన్లను దాటేందుకు రాష్ట్రంలో చాలాచోట్ల రైల్వే అండర్ బ్రిడ్జిలు ఉన్నాయని, వర్షాకాలంలో అండర్ బ్రిడ్జిలు నీటితో నిండిపోయి వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుందని తెలిపారు. వాటి స్థానంలో ముఖ్యమైన రహదారులపై రైల్వే ఓవర్ బ్రిడ్జిలను మంజూరు చేయాల్సిందిగా కేంద్ర మంత్రిని కోరారు. గత ప్రభుత్వ వైఖరి కారణంగా రూ. 300 కోట్ల విషయంలో వెనుకాడడం వల్ల రూ. 20 వేల కోట్ల విలువైన రీజనల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు పనులు ప్రారంభం కాలేదని, తమ ప్రభుత్వం అన్ని అడ్డంకులు తొలగించిందని తెలిపారు. కేసీఆర్, కేటీఆర్ కు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు, ప్రాజెక్టులకు మీద ఆసక్తి లేదని, “ఆయుష్మాన్ భారత్” వంటి పథకాలను కూడా అమలు కాకుండా గత ప్రభుత్వం వ్యవహరించిందని కోమటిరెడ్డి దుయ్యబట్టారు.

- Advertisement -

యాదాద్రిలో ఖేలో ఇండియా స్టేడియం

యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరిలో నిర్మించ తలపెట్టిన మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం, సింథటికి అథ్లెటిక్ ట్రాక్ నిర్మాణం మరియు స్విమ్మింగ్ ఫూల్ ఏర్పాటు గురించి కేంద్ర క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్‌కు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి డీపీఆర్ (DPR) అందజేశారు. స్టేడియం నిర్మాణానికి ఖేలో ఇండియా పథకంలో భాగంగా రూ. 33.5 కోట్ల నిధులు మంజూరు చేయాల్సిందిగా కోరారు. కేంద్ర మంత్రులతో జరిగిన హైలెవెల్ సమావేశాల్లో మంత్రి కోమటి రెడ్డితో పాటు తాండూర్ ఎమ్మెల్యే బి.మనోహర్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి, ధర్మేంద్ర సారంగి, అడిషనల్ డైరెక్టర్ జనరల్, కేంద్ర రోడ్లు, జాతీయ రహాదారుల శాఖ,నేషనల్ హైవేస్ అధారిటీ ఆఫ్ ఇండియా. మెంబర్(టెక్నికల్),అలోక్ దీపాంకర్, చీఫ్ జనరల్ మేనేజర్ ఏ.కే జాన్బాజ్,రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ కార్యదర్శి శ్రీనివాస రాజు, ఇంజనీర్ ఇన్ చీఫ్ గణపతి రెడ్డి, తెలంగాణ భవన్ రెసిడెంట్ కమీషనర్ డా.గౌరవ్ ఉప్పల్ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement