Thursday, May 9, 2024

రామానాయుడు స్టూడియోలో ఎమోష‌న‌ల్ అయిన.. చంద్ర‌బోస్

ఆర్ ఆర్ ఆర్ టీమ్ అంద‌రికంటే చంద్ర‌బోస్ కి గ్రాండ్ స్వాగ‌తం ద‌క్క‌డం విశేషం. హైదరాబాద్ వచ్చీ రాగానే ఆయన తనకు తొలి అవకాశం కల్పించిన నిర్మాత(రామానాయుడు)కు థ్యాంక్స్ చెప్పారు. తనకు తొలి అవకాశం కల్పించిన మ్యూజిక్‌ డైరెక్టర్, చిత్ర దర్శకులను గుర్తు చేసుకుంటూ వారికి ధన్యవాదాలు తెలుపుకున్నారు. అందులో భాగంగానే చంద్రబోస్ నేడు రామానాయుడు స్టూడియోకి వెళ్లి అక్కడ ఫస్ట్ టైమ్‌ తన పాట సెలెక్ట్ అయిన ప్రదేశంలో ఉండి భావోద్వేగానికి గురయ్యారు. రామానాయుడు స్టూడియోలోని లెజెండరీ నిర్మాత రామానాయుడు ఎక్కువగా ఉండే గ్లాస్‌ రూమ్‌ వద్దకు చేరుకుని ఆ మెమరీస్‌ని గుర్తు చేసుకున్నారు చంద్రబోస్. అప్పటి రామానాయుడు గ్లాస్‌ రూమ్‌ ఇప్పుడు జిమ్‌ సెంటర్‌గా మార్చారు. ఆ ప్రదేశంలో ఉండి రామానాయుడు కుమారుడు నిర్మాత సురేష్‌ బాబుతో తన ఆనందాన్ని షేర్‌ చేసుకున్నారు. 1995లో తాజ్‌ మహల్‌ చిత్రంలోని మంచు కొండల్లోన చంద్రమ అనే పాటతో చంద్రబోస్‌ రచయితగా సినిమా జర్నీ ప్రారంభమైన నేపథ్యంలో, ఆయన చెబుతూ ఈ ప్రదేశంలోనే ఫైనల్‌ అయ్యిందని, ఇక్కడే తన పాటకి సంగీత దర్శకులు ఎంఎం శ్రీలేఖ చేసిన ట్యూన్‌ ని రామానాయుడుకి వినిపించారట.

ఆయన, దర్శకుడు ముప్పలనేని శివ విని ఓకే చేశారట. అలా తన తొలి పాట సినిమాల్లో వచ్చిందని, ఈ పాటతో పాటల రచయితగా తన కెరీర్‌ ప్రారంభమైందని తెలిపారు చంద్రబోస్‌. ఇది తన పాట మొట్టమొదటి సారి పుట్టిన ప్రదేశమని, మొదటిసారి బయటకు వచ్చిన ప్రదేశం అని, బయటి వాళ్లు నన్ను పాటల రచయితగా గుర్తించిన ప్రదేశం, నా పాట ప్రయాణం ప్రారంభమైన ప్రదేశం అంటూ ఆయన ఎమోషనల్‌ అయ్యారు. ఆ రోజు ఇక్కడ ప్రారంభమై, ఇప్పుడు అమెరికా వెళ్లి ఆస్కార్‌ అవార్డుని సాధించి పెట్టిందని సురేష్‌బాబుకి చెబుతూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. మన ఇండియాకి, మన తెలుగుకి మొదటి ఆస్కార్ ని తీసుకొచ్చిందని, రామానాయుడి ఆశీస్సులతో తన తొలి అడుగు ఇక్కడ పడటం చాలా సంతోషంగా, గర్వంగా ఉందన్నారు. రామానాయుడు ఎక్కడున్న ఆయన ఆశీస్సులు మాకు ఉంటాయి. ఇది చూసి ఆయన ఆనందిస్తుంటారు. ఆయన లేని లోటుని సురేష్‌బాబులో చూసుకుంటున్నాం. ఆయన కూడా మమ్మల్ని సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. నా కెరీర్‌ ప్రారంభించినప్పట్నుంచి ఇప్పటి వరకు సురేష్‌ ప్రొడక్షన్‌ నా జీవితంలో కీలక భూమిక పోషించిందని, సురేష్‌బాబు కూడా నాకు అవకాశాలిస్తూ, ప్రోత్సహిస్తున్నారు. చేయూతనిస్తున్నారు. వారిపై నాకు ఆ కృతజ్ఞతాభావం ఎప్పుడూ ఉంటుందన్నారు. చంద్రబోస్‌ ఆస్కార్‌ అవార్డుతో కలిసి సురేష్‌బాబు వద్దకు వెళ్లి ఇలా తన సంతోషాన్ని, భావోద్వేగాన్ని పంచుకోవడం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement