Sunday, May 5, 2024

Big Story | లక్ష్యానికి చేరువగా రాజీవ్‌ బీమా ఎత్తిపోతల.. పూర్తి కావస్తున్న పెండింగ్‌ పనులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: వలసబతుకుల్లో ఆశలు చిగిరించే విధంగా సాగునీటి రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ పాలమూరును పచ్చపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం జలాశయాల పెండింగ్‌ పనులపై దృష్టి సారించింది. గతపాలకులు ప్రాజెక్టులు నిర్మించకుండా వదిలివెళ్లిన పనులు పూర్తి చేసి పూర్వ మహబూబ్‌ నగర్‌ జిల్లాలోని రిజర్వాయర్ల ను కృష్ణానది జలాలతో నింపాలనే లక్ష్యంతో నీటిపారుదల శాఖ పనుల్లో వేగం పెంచింది.రాజీవ్‌ బీమా ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తే మరో 45వేల ఎకరాలకు సాగునీరు అందనుండటంతో పనులు కొనసాగుతున్నాయి. రాజీవ్‌ బీమా ఎత్తిపోతల పథకం ప్రారంభంనుంచి అనేక సమస్యల వలయంలో చిక్కుకోవడంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే ఈ ప్రాజెక్టుపై ప్రభుత్వం దృష్టి సారించి నిధులు కేటాయించి చేసిన పనులు ఫలితాలు ఇస్తున్నాయి.

నిజాం రాష్ట్రంలో అప్పటి గుల్బర్గా జిల్లాలో ఈ ప్రాజెక్టును నిజాంపాలకుడు మీర్‌ ఉస్మాన్‌ ఖాన్‌ ప్రతిపాధించినప్పటికీ భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పడటంతో కర్ణాటక ప్రభుత్వం ప్రాజెక్టును నిలిపివేసింది. మహబూబ్‌నగర్‌ జిల్లా మాగనూరు మండలంలోని తంగిడి గ్రామం దగ్గర బీమానది పై ఈ ప్రాజెక్టు నిర్మాణం అప్పటి ప్రభుత్వం చేపట్టింది. అయితే కృష్ణా జలాల కేటాయింపుల పై కర్ణాటక అభ్యంతరాలు తెలపడంతో కేంద్రం జోక్యం చేసుకుని కేంద్ర జలవనరుల సంఘం 20 టీఎంసీల నీటిని కేటాయించడంతో పనులుప్రారంభమైన నత్తనడక నడిచాయి. తెలంగాణ ఏర్పడిన అనంతరం ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచడంతో లక్ష్యానికి చేరువైంది. కృష్ణా నది నుంచి నీటిని రెండు వేరువేరు ప్రదేశాల్లో నీటిని ఎత్తిపోసే విధంగా ప్రాజెక్టు రూపురేఖలను మార్చి పనుల్లో వేగం పెంచారు ఇందులో జూరాల ప్రాజెక్టు ఎగువ భాగంలోని పంచవేడు గ్రామం దగ్గర ఒక ఎత్తిపోతల, రెండవది రామణ్‌ పాడు లోని ఉక చెట్టి వాగు ప్రాజెక్టు ఎగువ భాగంలో ప్రతిపాదించి పనులను ప్రభుత్వం చేపట్టింది.

- Advertisement -

కరువు ప్రభావిత ప్రాంతాల్లో నీటి పారుదల కోసం మక్తల్‌, మగనూరు, ఆత్మకూరు నర్వ చిన్నచింతకుంట, దేవరకద్ర, అడ్డాకుల, కొత్తకోట, పెద్దమందడి, వనపర్తి, పెబ్బేరు, పనగల్‌,కోడేరు, వీపనగండ్ల,కొల్లాపూర్‌ మండలాలు, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణ పేట, లోని 196 గ్రామాలకు తాగునీరు అందించడానికి ఈఎత్తిపోతల ప్రతిపాదించారు. మొదటి దశ ఎత్తిపోతలలో లక్షా 11 వేలు, రెండవ దశ ఎత్తిపోతలలో 92 వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణతో పాటుగా శంకరసముద్రం కింద ఉన్న 2,134 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ, రంగసముద్రం కింద 1866 ఎకరాల స్థిరీకరణ తో పాటుగా రంగసముద్రం బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ గా రాజవ్‌ బీమా ఎత్తిపోతల ప్రాజెక్టును ప్రతిపాదించి చేసిన పనులు దాదాదపుగా పూర్తి కావచ్చాయి.

ఈ ఎత్తిపోతల పథకం ఎఐబిపి కింద భారత ప్రభుత్వం 90 శాతం గ్రాంటు మంజూరు చేసింది. ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ. 2వేల 654 కోట్ల 54 లక్షలు గా నిర్ణయించారు. అయితే లిఫ్ట్‌ ఒకటి, లిఫ్ట్‌ రెండు పంపులు ప్రారంభం కావడంతో ప్రస్తుతం యాసంగి, ఖరీప్‌ పంటలకు లక్ష్యానికి చేరువగా నీరు అందుతుంది. అయితే ప్రతిపాదిత సాగునీరు రెండులక్షల 3 వేల ఎకరాలుకాగా ప్రస్తుతం లక్షా 58వేల ఎకరాలకు సాగునీరు సిద్ధంగా ఉంది. అయితే నర్ధిష్ట లక్ష్యంలో మరో 45వేల ఎకరాలకు సాగునీరందించాల్సి ఉండటంతో పెండింగ్‌ పనులు, ప్రధానకాలువ విస్తరణ, పంటకాలువల నిర్మాణాలపై దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం ఖరీఫ్‌ సీజన్‌ లో నీరందించేందుకు నీటిపారుదల శాఖ పనుల్లో వేగం పెంచింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement