Wednesday, May 8, 2024

ప్రయాణికుల, సరుకు రవాణాలో రైల్వే రికార్డ్‌

అమరావతి, ఆంధ్రప్రభ: దక్షిణ మధ్య రైల్వే నూతన ఆర్థిక సంవత్సరాన్ని అసాధారణ ప్రతిభ కనబరుస్తూ ఆశాజనకంగా ప్రారంభించింది. 2022 మే నెలలో ప్రయాణికులు, సరుకు రవాణా రంగాల ఆదాయంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఉత్తమమైన నెలవారీ ఆదాయాలను సాధించింది. 2022 మే నెలలో రూ. 423.98 కోట్ల ప్రయాణికుల ఆదాయాన్ని నమోదు చేసింది. తద్వారా గతంలో నమోదైన రూ. 414.48 కోట్ల అధిక ఆదాయాన్ని అధిగమించింది. అలాగే జోన్‌ 2022 మే నెలలో రూ. 1,067.57 కోట్ల సరుకు రవాణా ఆర్జించింది. ఇది ఒక నెలలో సాధించిన ఆదాయంలో ఇది అత్యధికంగా ఉంది. దక్షిణ మధ్య రైల్వే వేసవి కాలంలో ప్రయాణికుల భారీ రద్దీని దృష్టిలో పెట్టుకుని మే నెలలో 66 ప్రత్యేక రైళ్లను(266 ట్రిప్పులను) నడిపించగా, 2.65 లక్షల మంది ప్రయాణించారు. ప్రయాణికుల డిమాండ్‌ను బట్టి అదనపు కోచులను ఏర్పాటు- చేసి ఎక్కువమంది ప్రయాణించేందుకు అవకాశం కలిగించింది. 2022 మే నెలలో 1533 అదనపు కోచులు ఏర్పాటు చేయడంతో మొత్తం లక్షా 14 వేల 835 మంది ప్రయాణించారు. ఈ చర్యల ఫలితంగా మెయిల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో ఒక నెలలో రికార్డు స్థాయిలో అత్యధిక ఆక్యుపెన్సీ నమోదు అయ్యింది. జోన్‌ గతంలోనే కోవిడ్‌ ముందు నడిపినట్లు- అన్ని మెయిల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు సర్వీసులను పునరుద్ధరించడం గమనార్హం.

సరుకు రవాణాలోనూ..

మరోవైపు ఇదే కాలంలో జోన్‌ సరుకు రవాణాలో నూతన సరుకు రవాణా లక్ష్యాలను జోడించి ఈ రంగం పటిష్టతకు చర్యలు తీసుకుంది. ఈ దిశగా నిరాటంకంగా చేపట్టిన కృషితో మే నెలలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక నెలలో రూ. 1,067.57 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. మే నెలలో 11.713 మిలియన్‌ టన్నుల సరుకు రవాణా జరిగింది. ఇది గతంలో ఎన్నడూ లేనివిధంగా రెండో అత్యుత్తమ లోడింగ్‌గా నమోదైంది. నడికుడి నుంచి క్లింకర్‌, రెడ్డిపాలెం, నర్సారావుపేట నుంచి మొక్కజొన్న, సదాశివపేట్‌ రోడ్‌ నుంచి క్వార్ట్జ్‌, ట్యాంక్‌ కంటెనర్లలో సిమెంట్‌ మొదలగు నూతన రంగాలు సరుకు రవాణాలో కొత్తగా చేరాయి. అదేవిధంగా 6.037 ఎమ్‌టీల బొగ్గు లోడ్‌ కాగా, సిమెంట్‌(3.147 ఎమ్‌టీలు), ఎరువులు(0.719 ఎమ్‌టీలు), ఆహార ధాన్యాలు(0.558 ఎమ్‌టీలు) సరుకుల లోడింగ్‌ జరిగింది. దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌(ఇన్‌చార్జి) అరుణ్‌ కుమార్‌ జైన్‌ నూతన ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో మెరుగైన ఆదాయాలను సాధించడానికి కృషి చేసిన ఆపరేటింగ్‌, కమర్షియల్‌ బృందాలను అభినందించారు. బృందం సభ్యులు నిబద్ధతతో అవిశ్రాంతంగా చేసిన కృషితో ఈ విజయాలు సాధ్యమయ్యాయని ఆయన అన్నారు. ఇకముందు కూడా ప్రయాణికులతో పాటు సరుకు రవాణా రెండు రంగాలలో అవసరాలమేరకు క్రియాశీలకంగా వ్యవహరించాలని డివిజన్లకు ఆయన సూచించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement