Sunday, May 19, 2024

Delhi | రాహుల్ హామీని జనంలోకి తీసుకెళ్తా : వీహెచ్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తాము అధికారంలోకి వస్తే రిజర్వేషన్లపై అమలవుతున్న గరిష్ట పరిమితిని ఎత్తేస్తానంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ప్రకటనను ప్రజల్లోకి తీసుకెళ్తానని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ వీ. హనుమంత రావు అన్నారు. సోమవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన, ఇప్పటి వరకు మొత్తం రిజర్వేషన్లపై 50% గరిష్ట పరిమితి అమలవుతోందని, ఈ కారణంగా అధిక సంఖ్యాక ఓబీసీ వర్గాలకు అన్యాయం జరుగుతోందని అన్నారు.

‘ఎంత జనాభాకు అంత వాటా’ అన్న రాహుల్ నినాదం ప్రకారం రిజర్వేషన్లు పెరిగి బీసీలకు ప్రయోజనం చేకూరుతుందని సూత్రీకరించారు. ఇది జరగాలంటే రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిని చేయాలని, ఇందుకోసం ప్రతి చోట కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని పిలుపునిచ్చారు. భారత్ జోడో యాత్రలు చేసిన రాహుల్ గాంధీ దేశంలోని అన్ని ప్రాంతాలు సందర్శించి అక్కడి ప్రజల కష్టనష్టాలను తెలుసుకున్నారని వీహెచ్ అన్నారు.

అందుకే కులాలవారిగా జనగణన చేపట్టాలన్న డిమాండ్ చేస్తున్నారని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కులగణన జరుగుతుందని తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తాను బీసీ బిడ్డను అని చెప్పుకోవడం తప్ప బీసీలకు చేసిందేమీ లేదని అన్నారు. తెలంగాణ పర్యటనకు వస్తున్న ప్రధాని, బీసీ రిజర్వేషన్ల పెంపుపై ఏం సమాధానం చెబుతారో చూద్దామని వ్యాఖ్యానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement