Saturday, May 4, 2024

Delhi | 120 రోజుల యాక్షన్ ప్లాన్ రెడీ, జులైలో 70 సీట్ల ప్రకటన.. టీ-కాంగ్రెస్ నేతలకు రాహుల్ అల్టిమేటం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ఇచ్చిన ఉత్సాహంతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ కదనోత్సాహంతో అడుగులేస్తోంది. ఎన్నికల తేదీలను దృష్టిలో పెట్టుకుని 120 రోజుల ప్రణాళికను సిద్ధం చేసింది. మంగళవారం తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలతో నిర్వహించిన కీలక స్ట్రాటజీ సమావేశంలో అధిష్టానం పెద్దలు దిశానిర్దేశం చేశారు. ముందే నిర్ణయించిన మేరకు మధ్యాహ్నం గం. 12.00కు కాస్త అటూ ఇటూగా ప్రారంభమైన సమావేశం మొత్తం రెండున్నర గంటలకు పైగా సాగింది. ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో అధిష్టానం నుంచి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత వ్యవహారాలు) కేసీ వేణుగోపాల్, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్ రావ్ థాక్రేతో పాటు ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు ఉన్నారు.

తెలంగాణ రాష్ట్ర నేతల్లో పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, ఎంపీలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రులు జానా రెడ్డి, దామోదర రాజనర్సింహ, శ్రీధర్ బాబు, షబ్బీర్ అలీ, ఎమ్మెల్యేలు జగ్గా రెడ్డి, సీతక్క, పొదెం వీరయ్య, ఏఐసీసీ కార్యదర్శులు మధుయాష్కి గౌడ్, వంశీచంద్ రెడ్డి, సంపత్, సీనియర్ నేత వీ. హనుమంత రావు (వీహెచ్) తదితర ముఖ్య నేతలు హాజరయ్యారు. సమావేశం ప్రారంభమవడంతోనే ముందుగా పార్టీలో అంతర్గత కుమ్ములాటలపై అధిష్టానం దృష్టి సారించినట్టు తెలిసింది. పార్టీ విజయావకాశాలను దెబ్బతీస్తున్న అనైక్యతను పరిష్కరిస్తేనే అనుకున్న ప్రణాళికలను అమలు చేయగలమని భావించిన రాహుల్ గాంధీ.. ఏ సమస్య ఉన్నా నేరుగా ఇంచార్జి మాణిక్ రావ్ థాక్రే దృష్టికో లేదంటే కేసీ వేణుగోపాల్ దృష్టికో తీసుకురావాలని.. అంతే తప్ప మీడియాలో రచ్చ చేస్తే సహించబోనని గట్టిగా హెచ్చరించినట్టు తెలిసింది.

అలాగని రేవంత్ రెడ్డిని బాహాటంగా విమర్శిస్తున్న సీనియర్లు నొచ్చుకోకుండా సర్దిచెప్పే స్వరంలోనే ఈ హెచ్చరిక చేసినట్టు తెలిసింది. “పార్టీకి మీరే ఆస్తి. పార్టీ కోసం మీరు చేసిన సేవలు, శ్రమ మాకు తెలుసు. ఏదున్నా సరే.. మాతో చెప్పండి. మీకోసం మేం ఎప్పుడూ అందుబాటులోనే ఉంటాం. అంతే తప్ప మీడియా ముందుకెళ్తే పోయేది మన ఇంటి పరువే” అంటూ వ్యాఖ్యానించినట్టు తెలిసింది. అందుకే సమావేశానికి వెళ్లే ముందు తమ వైరివర్గంపై సంచలన వ్యాఖ్యలు చేసిన జగ్గా రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వంటి నేతలు ఆ తర్వాత మీడియా ఎంత ప్రయత్నించినా మాట్లాడేందుకు నిరాకరించారు.

- Advertisement -

అయితే సమావేశం ముగిసిన వెంటనే జగ్గారెడ్డి రాహుల్ గాంధీతో విడిగా తన సమస్య చెప్పుకునే ప్రయత్నం చేశారు. రాహుల్ గాంధీ ఏఐసీసీ కార్యాలయం నుంచి పక్కనే ఉన్న తన నివాసం 10, జన్‌పథ్‌కు నడుచుకుంటూ వెళ్తూ తనతో పాటు జగ్గారెడ్డిని వెంటబెట్టుకెళ్లారు. ఆ కాసేపట్లో తాను చెప్పదల్చుకున్నది రాహుల్ గాంధీతో చెప్పుకున్నారు. ఆ తర్వాత కేసీ వేణుగోపాల్‌కు కూడా సమస్యను వివరించి చెప్పారు. కానీ ఏం చెప్పారన్నది మీడియాకు మాత్రం వెల్లడించడానికి ఆయన ఇష్టపడలేదు.

చేసేవే చెప్పండి

అంతర్గత కుమ్ములాటల గురించి క్లారిటీ ఇచ్చిన అధిష్టానం.. ఆ తర్వాత యాక్షన్ ప్లాన్‌లో కీలకమైన మేనిఫెస్టో గురించి చర్చ జరిగింది. కర్ణాటక గెలుపులో ఐదు అంశాలతో కూడిన పంచసూత్ర మేనిఫెస్టో మాదిరిగా తెలంగాణలోనూ ఆకట్టుకునేలా మేనిఫెస్టో తయారు చేయాలని అధిష్టానం సూచించింది. అయితే ఈ క్రమంలో ఆచరణ సాధ్యం కాని హామీలను పొందుపర్చవద్దని తేల్చి చెప్పింది. “చేసేవే చెప్పండి.. చెప్పేవే చేయండి” అన్న నినాదాన్ని ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలని రాహుల్ గాంధీ స్పష్టమైన ఆదేశాలిచ్చినట్టు తెలిసింది. రాష్ట్ర బడ్జెట్.. ఆదాయ వ్యయాల గణాంకాలను దృష్టిలో పెట్టుకుని మేనిఫెస్టో తయారు చేయాలని, ఈ క్రమంలో అవసరమైతే సంబంధిత రంగాల నిపుణుల సలహాలు, సూచనలు తీసుకోవాలని, ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు సహకారం కూడా ఉంటుందని చెప్పినట్టు సమాచారం.

టికెట్ల నిర్ణయం మీదే ఆమోదముద్ర మాది

అత్యంత కీలకమైన అభ్యర్థుల ఎంపిక విషయాన్ని సైతం కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర నాయకత్వానికే అప్పగించినట్టు తెలిసింది. అయితే అభ్యర్థులను ఎంపిక చేసే విషయంలో శాస్త్రీయంగా నిర్వహించిన సర్వే రిపోర్టులను పరిగణలోకి తీసుకుని, స్థానిక సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని ఖరారు చేయాలని.. అంతిమంగా ఆమోదముద్ర తాము వేస్తామని చెప్పినట్టు సమాచారం. ఈ సందర్భంగా ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి జోక్యం చేసుకుంటూ తన పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో రిజర్వుడు స్థానాలు మినహా మిగతా ఐదింటిలో మూడు స్థానాలను బీసీలకే ఇవ్వాలని సూచించారు.

బీసీలకు టికెట్లు ఇస్తే గెలవలేరు అన్న అపోహలు ఉన్నాయని, కానీ తన నియోజకవర్గంలో గెలిపించే బాధ్యత తాను తీసుకుంటానని చెప్పారు. జనాభాలో సగం కంటే ఎక్కువ సంఖ్యలో ఉన్న బీసీలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని సీనియర్ నేత వీ.హనుమంత రావు అధిష్టానం పెద్దలతో చెప్పగా.. మాజీ మంత్రి శ్రీధర్ బాబు కూడా ఈ వాదనను బలోపేతం చేసినట్టు తెలిసింది. ఎన్నికల తేదీలు ప్రకటించక ముందే కర్ణాటక మాదిరిగా తెలంగాణలోనూ అభ్యర్థులను ముందే ప్రకటించాలని నేతలు సూచించారు. మొత్తం 119 స్థానాల్లో పోటీ – వివాదం లేని స్థానాలకు జులైలోనే అభ్యర్థులను ప్రకటించేందుకు కసరత్తు జరుగుతోందని, సుమారు 70 స్థానాల్లో అభ్యర్థుల ప్రకటన ఉంటుందని తెలిసింది.

టికెట్ల కోసం ఢిల్లీకి వచ్చి పైరవీలు చేయాల్సిన పనిలేకుండా ఈ కసరత్తు సాఫీగా, పారదర్శకంగా సాగాలని అధిష్టానం సూచించింది. అభ్యర్థుల ఎంపికలో సునీల్ కనుగోలు ఇచ్చే సర్వే రిపోర్టులతో పాటు ఆయా జిల్లాల్లోని సీనియర్ నేతల అభిప్రాయాలు, సామాజిక సమీకరణాలు పరిగణలోకి తీసుకోవాలని అధిష్టానం సూచించింది. ఈ వారంలోనే పార్టీ ఎలక్షన్ కమిటీ సమావేశం ఉంటుందని తెలిసింది.

దూరమైన వర్గాలకు చేరువగా…

కాంగ్రెస్ పార్టీకి బలమైన ఓటుబ్యాంకుగా, వెన్నెముకగా నిలిచిన బడుగు, బలహీనవర్గాలను మళ్లీ దగ్గర చేసుకోవాలని.. తద్వారా కోల్పోయిన ఓట్ల శాతం భర్తీ చేసుకోవచ్చని కొందరు నేతలు సూచించగా అధిష్టానం సానుకూలంగా స్పందించింది. తెలంగాణలో మైనారిటీ ఓటుబ్యాంకు పరిస్థితి గురించి షబ్బీర్ అలీ అధిష్టానం పెద్దలకు వివరించి చెప్పినట్టు తెలిసింది. ఈ సందర్భంగా మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ గురించి, రాష్ట్రంలో బీజేపీ వైపు తరలిన ఓబీసీల్లో ఓ సామాజిక వర్గం గురించి చర్చ జరిగినట్టు సమాచారం.

మొత్తంగా పార్టీకి దూరమైన వర్గాలను తిరిగి దగ్గరచేసుకునే దిశగా అడుగులు వేయాలని, అన్ని వర్గాల్లోకి కాంగ్రెస్ చొచ్చుకెళ్లేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధిష్టానం పెద్దలు చెప్పారు. ఈ క్రమంలో ఆకట్టుకునే స్లోగన్లు, నినాదాలను ఎన్నికల వ్యూహకర్త రూపొందిస్తారని రాహుల్ గాంధీ చెప్పినట్టు తెలిసింది. ఇక ఎన్నికల ప్రచారం కోసం ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తానని రాహుల్ గాంధీ తెలంగాణ నేతలకు హామీ ఇచ్చినట్టు తెలిసింది.

సమావేశం అనంతరం మాణిక్‌రావ్ థాక్రే, రేవంత్ రెడ్డి, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, రేణుక చౌదరి, వి.హనుమంతరావు, మధుయాష్కి గౌడ్ తదితరులు ఏఐసీసీ ప్రాంగణంలో విలేకరుల సమావేశం నిర్వహించి సమావేశం వివరాలను వెల్లడించారు.

కర్ణాటక ఫార్ముల తెలంగాణలో అమలు: రేవంత్ రెడ్డి

మరో 120 రోజుల్లో జరగబోయే ఎన్నికలకు ఎలా ముందుకెళ్లాలి, కలిసికట్టుగా పోరాడడం, కేసీఆర్ పాలన వైఫల్యాలను ఎండగట్టడం, కేంద్రంలో నరేంద్రమోదీ అధికార దుర్వినియోగాన్ని ఎలా ప్రజలకు వివరించాలనే అంశాలపై సన్నాహక సమావేశంలో చర్చించామని రేవంత్ రెడ్డి వెల్లడించారు. బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టి ఎన్నికలకు సిద్ధమయ్యేలా రాహుల్, ఖర్గే దిశానిర్దేశం చేశారని తెలిపారు. ఖాళీలను తిరిగి పునర్నియామకం చేసి, నాయకులను ఎన్నికలకు సిద్ధం చేయడంపై  చర్చించామని చెప్పారు. కేసీఆర్ పాలనలో అవినీతి ఆకాశానికి, అభివృద్ధి పాతాళానికి వెళ్లిందనే విషయంపై చర్చ జరిగిందన్నారు.

ముఖ్య నాయకులందరం కలిసి కేసీఆర్‌‌ను గద్దె దించేందుకు భవిష్యత్ కార్యాచరణతో ముందుకు వెళ్లాలని పూర్తి స్థాయిలో చర్చ జరిపామని చెప్పారు. కాంగ్రెస్ ఎన్నికల కార్యాచరణను ప్రారంభించిందని పార్టీ శ్రేణులు, ప్రజలకు రేవంత్ స్పష్టం చేశారు. రాహుల్, ఖర్గే, కేసీ వేణుగోపాల్ తమ అనుభవాలు, సలహాలు, సూచనలు ఇచ్చారని వివరించారు. కర్ణాటకలో కాంగ్రెస్ ఏ ఫార్ములాతో ఎన్నికలను ఎదుర్కొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందో అలాంటి పదునైన కార్యాచరణతో ప్రజల్లోకి వెళ్లాలని, అక్కడి మౌలిక సూత్రాలను తెలంగాణలో పాటించి అధికారంలోకి వచ్చేందుకు చర్యలు చేపట్టాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు రేవంత్ స్పష్టం చేశారు.

ఇది తెలంగాణ కాంగ్రెస్‌కు దిశానిర్దేశక సమావేశం: ఉత్తమ్ కుమార్ రెడ్డి  

ముఖ్య నాయకులందరి అభిప్రాయాలు, సూచనలు, సలహాలతో  2023 డిసెంబర్‌లో జరిగే ఎన్నికలకు సన్నాహకంగా నేటి సమావేశం జరిగిందన్నారు. అందరూ ఐకమత్యంతో వ్యూహాత్మకంగా ముందుకెళ్లడం, బీఆర్‌ఎస్ వైఫల్యాలను ఎంతగట్టాలని, పార్టీలోని లోపాలను సరిదిద్దుకోవాలని, టికెట్ల ప్రక్రియను పూర్తి చేయడం వంటి అంశాలపై తమ అభిప్రాయాలను రాహుల్, ఖర్గే, కేసీ వేణుగోపాల్ తీసుకున్నారని, కొన్ని మార్గనిర్దేశాకాలను వారూ తమకు అందించారని తెలిపారు. కర్ణాటక వంటి పెద్ద విజయాన్ని తెలంగాణలో సాధించబోతున్నామని రాహుల్ గాంధీ స్పష్టమైన సందేశమిచ్చారని ఉత్తమ్ వెల్లడించారు.

బీఆర్‌ఎస్ వాగ్దానాలపై దృష్టి: వి.హనుమంతరావు

తాను సూచించిన కుల గణన, బీసీలకు సరైన ప్రాధాన్యం వంటి అంశాలను కింది స్థాయి వరకు తీసుకెళ్లాలని, వెనుకబడిన వర్గాలను ఆకట్టుకోవాలని  రాహుల్ గాంధీ సూచించారని వి.హనుమంతరావు తెలిపారు. ఎన్నికల ముందు బీఆర్‌ఎస్ చేసిన వాగ్దానాల అమలు అంశంపై దృష్టి పెట్టాలని రాహుల్ సూచించారన్నారు. మైనారిటీలు, ఎస్సీ, ఎస్టీలను కూడా ఆకట్టుకోవాలని అధిష్టానం చెప్పిందని వీహెచ్ వెల్లడించారు.

త్యాగం కాంగ్రెస్‌ది-భోగం కల్వకుంట్ల కుటుంబానిది: మధు యాష్కీ గౌడ్

బీఆర్‌ఎస్‌తో కాంగ్రెస్‌కు ఎట్టి పరిస్థితుల్లోనూ పొత్తు ఉండబోదని అధిష్టానం స్పష్టం చేసిందని మధుయాష్కీ గౌడ్ తెలిపారు. బీఆర్‌ఎస్ – బీజేపీ ఒకటేనన్నారు. జాతీయ ప్రతిపక్ష పార్టీల మీటింగుల్లో బీఆర్‌ఎస్‌ను తాము భాగస్వామిని చేయలేదని ప్రజలకు వివరించమని రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే తమకు చెప్పారన్నారు. త్యాగం కాంగ్రెస్‌ది అయితే… భోగం కల్వకుంట్ల కుటుంబానిది అయిందని ఎద్దేవా చేశారు. కుటుంబ పాలన కావాలంటే బీఆర్‌ఎస్‌కు, ప్రజల పాలన కావాలంటే కాంగ్రెస్‌కు ఓటేయాలనే నినాదంతో ముందుకు వెళ్లబోతున్నామని ఆయన వివరించారు. కమ్యునిస్టులు కన్ఫూజన్‌తో మునుగోడులో మునిగిపోయారని, ఇప్పటికైనా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలని మధుయాష్కీ హితవు పలికారు.

బీజేపీ వ్యతిరేక ఓటు చీల్చేందుకు బీఆర్ఎస్ యత్నం: మాణిక్ రావ్ థాక్రే

దేశంలో ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందో అక్కడికి బీఆర్ఎస్ వెళ్లి ప్రచారం చేస్తోందని, తద్వారా పరోక్షంగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి సహకరిస్తోందని థాక్రే నిందించారు. బడుగు, బలహీన, నిరుపేద వర్గాల కష్టాలు చూసిన సోనియా గాంధీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి ఆదుకోవాలని అనుకున్నారని ఏఐసీసీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్ రావ్ థాక్రే అన్నారు. కానీ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఆ వర్గాల ప్రజల జీవితాల్లో ఏ మార్పూ లేదన్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏం చేస్తామన్నది ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పాలని, ఆ దిశగా ఎన్నికల ప్రచార ప్రణాళిక.. శరవేగంగా అమలు చేయాలని నిర్ణయించినట్టు ఆయన చెప్పారు. అణచివేతకు గురైన వర్గాల అభ్యున్నతి కాంగ్రెస్‌తోనే సాధ్యమని ఆయనన్నారు. ఓబీసీలు, మైనారిటీలు, దళితులు, గిరిజనుల అభ్యున్నతి కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు.

నేతలంగా కలసికట్టుగా పనిచేసి బీఆర్ఎస్‌ను ఓడించాలని థాక్రే సూచించారు. నేతలు, కార్యకర్తలు అందరూ ఒక కుటుంబంలా పనిచేస్తే బలం రెట్టింపు అవుతుందని అన్నారు. తెలంగాణ నేతలందరితో మాట్లాడిన తర్వాత రాహుల్ గాంధీ చేసిన దిశానిర్దేశం ఇదేనని వెల్లడించారు. ప్రజలు బీఆర్ఎస్‌ పాలనను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని, ఈ వ్యతిరేకతను కాంగ్రెస్ అనుకూలంగా మలచుకోవాలని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement