Saturday, April 27, 2024

థియేటర్ల వ్యవస్థపై ఆర్.నారాయణమూర్తి సంచలన వ్యాఖ్యలు

తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు సినిమా థియేటర్లు తెరుచుకోవడానికి అనుమతి ఇచ్చినా ఎగ్జిబిటర్లు ఆచితూచి స్పందిస్తున్నారు. తెలంగాణలో ఈనెల 30 నుంచి థియేటర్లు తెరుచుకోనున్నా.. ఏపీలో పరిస్థితిపై అయోమయం నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో థియేటర్ల వ్యవస్థపై సీనియర్ నటుడు, విప్లవ సినిమాలకు పెట్టింది పేరు అయిన ఆర్.నారాయణమూర్తి స్పందించారు. పేదోడు వినోదానికి దూరమవుతున్నాడని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా అనేది కచ్చితంగా థియేటర్‌లో చూడాలని… నాలుగు గోడల మధ్య చూస్తే సినిమాకు ఉన్న ఎమోషన్ తెలియదని ఆయన అభిప్రాయపడ్డారు.

ఉదాహరణకు ఇటీవల వెంకటేష్ నటించిన ‘నారప్ప’ సినిమా ఓటీటీలో విడుదలైందని.. ఆ సినిమాను కేవలం 25 శాతం మంది మాత్రమే చూశార‌ని తెలిపారు. మిగిలిన 75 శాతం వాళ్ల ఇళ్లల్లో ఓటీటీ లేదు అని.. మరి అలాంటి వాళ్లు వెంకటేష్ సినిమా చూడకుండా ఏం పాపం చేశార‌ని ప్రశ్నించారు. ఓటీటీ రిలీజ్ అనేది కేవలం 25 శాతం మంది వరకు మాత్రమే వెళ్తుందని.. మిగిలిన 75 శాతం కేవలం థియేటర్లలోనే సినిమాలు చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారని ఆర్.నారాయణమూర్తి అన్నారు. అందరికి ఓటీటీ సినిమాలు చేరువైనప్పుడు తాను కూడా ఓటీటీల్లో సినిమాల విడుదలకు ఒప్పుకుంటానని చెప్పారు. కరోనా వస్తుంది పోతుంది కానీ.. థియేటర్స్ మాత్రం ఎప్పటికీ శాశ్వతమన్నారు. దయచేసి ఓటీటీలో సినిమాలు విడుదల చేయడం ఆపాలంటూ నిర్మాతలను కోరారు. థియేటర్లో చూడాల్సిన సినిమాలు ఓటీటీలో విడుదల చేస్తే.. మన చేతులతో మనమే థియేటర్స్ వ్యవస్థను చంపేసినట్లు అవుతుందని అభిప్రాయపడ్డారు. ఏపీ, తెలంగాణ సీఎంలు కూడా ఈ విషయంపై ఒకసారి ఆలోచించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఈ వార్త కూడా చదవండి: సుమంత్ రెండో పెళ్లిపై వర్మ ట్వీట్

Advertisement

తాజా వార్తలు

Advertisement