Sunday, April 28, 2024

Delhi | సుప్రీం ముంగిట ఆర్-5 జోన్ కేసు.. హైకోర్టు తీర్పుపై స్టే కోరుతూ పిటిషన్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై అమరావతి రైతులు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ అంశంపై ఏపీ హైకోర్టులో తాము ఆశించినట్లుగా మధ్యంతర ఉత్తర్వులు రాకపోవడంతో, వారు సుప్రీంకోర్టు తలుపు తట్టారు. ఆర్-5 జోన్‌లో వేరే ప్రాంతాల వారికి ఇళ్ల స్థలాలను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోలను రద్దు చేయాలని, అలాగే ఈ అంశంపై ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ‘స్టే’ విధించాలని కోరుతూ రైతులు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. అమరావతి మాస్టర్ ప్లాన్‌కు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం జీవోలు తీసుకొచ్చి ఇళ్లపట్టాలు పంచేందుకు ప్రయత్నిస్తోందని రైతులు ఆరోపించారు. ఇదివరకు ఒకసారి సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ విచారణ చేపట్టే సమయంలో ధర్మాసనం అనుమతి తీసుకుని పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నారు. హైకోర్టు ఇచ్చే ఉత్తర్వుల ఆధారంగా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని ఆ సమయంలో కోర్టుకు తెలిపారు.

తాజాగా అమరావతిలో ఆర్-5 జోన్‌ అంశంపై రైతులు దాఖలు చేసిన  పిటిషన్‌ను ఏపీ హైకోర్టు తిరస్కరించింది. ఇళ్ల పట్టాల పంపిణీ కోర్టు తీర్పునకు లోబడి ఉండాలన్న రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పినప్పటికీ, మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు మాత్రం నిరాకరించింది. ఈ పరిస్థితుల్లో రైతులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయించుకున్నారు. మాస్టర్ ప్లాన్ మార్చడం చట్ట విరుద్ధమని ఏపీ హైకోర్టు ఇదివరకే చెప్పిందని, కానీ ఆ తీర్పునకు విరుద్ధంగా ప్రభుత్వం ఆర్-5 జోన్ ఏర్పాటు చేసి రాజకీయ కారణాలతో ఇతరులకు భూములు పంచుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.

- Advertisement -

రాష్ట్ర ప్రభుత్వం మాస్టర్‌ప్లాన్ ప్రకారం పెట్టుబడులతో వచ్చే ఐటీ కంపెనీల కోసం కేటాయించిన ప్రాంతాన్ని విజయవాడ, గుంటూరు నగరాలకు చెందిన పేదలకు ఇళ్ల స్థలాల రూపంలో పట్టాలు ఇచ్చేందుకు ప్రత్యేక జోన్ ఏర్పాటు చేసింది. ఈ మేరకు సీఆర్డీఏ చట్టానికి ప్రభుత్వం సవరణ కూడా చేసింది. తుళ్లూరు మండలంలోని మందడం, ఐనవోలు, మంగళగిరి మండలంలోని కృష్ణాయపాలెం, నిడమర్రు, కురగల్లు గ్రామాల పరిధిలో ఉన్న 1,134 ఎకరాలను నివాస ప్రాంతంగా మార్చి ఆర్-5 జోన్‌గా పేర్కొంటూ గెజిట్ నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. ఆర్‌-5 జోన్‌పై అభ్యంతరాలు, సూచనలు, సలహాలు స్వీకరించటానికి 15 రోజుల గడువు ఇవ్వగా.. దీనిపై  రైతులు హైకోర్టుకు వెళ్లారు. రైతుల పిటిషన్‌ను హైకోర్టు కొట్టేయడంతో ఇళ్ల పట్టాల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వానికి మార్గం సుగమమైంది.

సోమవారం సీజే ధర్మాసనం ముందు ప్రస్తావన..

సుప్రీంకోర్టును ఆశ్రయించిన అమరావతి రైతులు తమ న్యాయవాది ద్వారా సోమవారం భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఎదుట తమ కేసును ప్రస్తావించే అవకాశం ఉంది. దీనిపై వీలైనంత త్వరగా విచారణ చేపట్టాలని అభ్యర్థించనున్నట్టు తెలిసింది. అమరావతి – మూడు రాజధానుల అంశంపై దాఖలైన కేసు మే 9న సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. అయితే ఆ రోజు చనిపోయిన పిటిషనర్ల (అమరావతి రైతులు) స్థానంలో వారి వారసులను ప్రతివాదులగా చేర్చే అంశంపై మాత్రమే విచారణ జరగనుంది. వీలుంటే ఈ అంశంతో పాటు ఆర్-5 జోన్ వ్యవహారాన్ని విచారణకు స్వీకరించాలని ధర్మాసనాన్ని కోరనున్నట్టు సమాచారం. 

Advertisement

తాజా వార్తలు

Advertisement