Friday, April 26, 2024

ప్రమోషన్లు, బదిలీలు మరింత లేట్‌.. కోర్టు కేసులే సాకు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ ఎంతకీ ఓ కొలిక్కి రావడంలేదు. వేసవి సెలవుల్లో టీచర్ల పదోన్నతులు, బదిలీలకు సంబంధించిన ప్రక్రియ చేపడతామని ప్రకటించిన విద్యాశాఖ ఇప్పుడేమో కోర్టు కేసులు ఉన్నందున ప్రస్తుతం దీనిని చేపట్టలేకపోతున్నామని దాటవేస్తుండటం గమనార్హం. జూన్‌ 17న పండిట్‌, పీఈటీ అప్‌గ్రేడేషన్‌, జూన్‌ 20న పరస్పర బదిలీలకు సంబంధించిన కోర్టు కేసులు ఉన్నందున ఆ తర్వాతే షెడ్యూల్‌ విడుదల చేస్తామని ఉపాధ్యాయ సంఘాలతో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పినట్లు తెలిసింది. ఇదిగో అదిగో అంటూ హడావుడీ చేస్తున్నారు తప్పితే పదోన్నతులు, బదిలీలపై స్పష్టమైన ప్రకటన చేయకపోవడంతో ప్రభుత్వంపై పలు ఉపాధ్యాయ సంఘాల నేతలు మండిపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులు పదోన్నతులు, బదిలీల కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. ఈలోపు 317 జీవో అమలు కావడంతో పదోన్నతులు, బదిలీల అంశం అటకెక్కింది. ప్రస్తుతం 317 జీవో అమలు దాదాపు పూర్తి కావడంతో మళ్లి తెరపైకి పదోన్నతులు, బదిలీ అంశం వచ్చింది. ఈ క్రమంలోనే వేసవి సెలవుల్లో పదోన్నతుల షెడ్యూల్‌ జారీ చేసి జూన్‌ చివరి నాటికి ఈ ప్రక్రియను ముగిస్తామని విద్యాశాఖ పలు సందర్భాల్లో ప్రకటించింది.

కానీ మళ్లిప్పుడేమే కోర్టులో కేసులు కొలిక్కి వచ్చిన తర్వాతే ఈ ప్రక్రియ ప్రారంభిస్తామని చెప్పడం ఉపాధ్యాయుల ఆశలపై నీళ్లు చల్లడమేనని సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. పదోన్నతుల కోసం టీచర్లు దాదాపు ఏడేళ్ల నుంచి ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో 26,050 సర్కారు బడుల్లో దాదాపు 1.05 లక్షల మంది టీచర్లు పనిచేస్తున్నారు. సుమారు రెండు సంవత్సరాలు సర్వీస్‌ పూర్తి చేసుకున్న వారు ప్రమోషన్లు, బదిలీలకు అర్హులు. 2015లో చివరిసారిగా ప్రమోషన్లు చేపట్టారు. 2018లో బదిలీలు చేపట్టారు. దాదాపు ఏడేళ్ల నుంచి ప్రమోషన్లు, నాలుగేళ్ల నుంచి బదిలీలు ఇంత వరకూ చేపట్టలేదని ఉపాధ్యాయ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. జూన్‌ 13న బడుల ప్రారంభానికి ముందే ఉపాధ్యాయుల బదిలీలు చేపట్టి ప్రమోషన్లు కల్పిస్తామని ప్రభుత్వ పెద్దలు ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ప్రతీ రోజు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి పలు ఉపాధ్యాయ సంఘాల నేతలు వరుసగా వినతి పత్రాలు అందిస్తునే ఉన్నారు. ఈ క్రమంలోనే మంగళవారం టీయుటీఎఫ్‌ నేతలు మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిసి పదోన్నతులు, బదిలీల షెడ్యూల్‌ విడుదల చేయాలని కోరగా కోర్టులో కేసులు ఉన్నందున ఆ తరువాతే షెడ్యూల్‌ జారీ చేస్తామని వారితో పెర్కొన్నట్లు తెలిపారు. ఈలోగా మోడల్‌ స్కూళ్లు, కేజీబీవీలోని టీచర్లకు బదిలీలు చేపడతామని హామీ ఇచ్చినట్లు వారు పేర్కొన్నారు.

ప్రాథమిక పాఠశాల హెడ్మాస్టర్ల పోస్టులను 10వేలకు పెంచుతామని గతంలో ప్రభుత్వం ప్రకటించింది. అయితే 5,571 పోస్టుల మంజూరుకు ఆర్థిక శాఖ ఇటీవల ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించిన జీవో రావాల్సి ఉంది.మరోవైపు లాంగ్వేజ్‌ పండిట్‌, పీఈటీల అప్‌గ్రేడ్‌పై హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉంది. జూన్‌ 17కు లాంగ్వేజీ పండిట్ల కేసు విచారణకు రానుంది. అదేవిధంగా జూన్‌ 20న పరస్పర బదిలీల కేసు విచారణకు రానుంది. ఎంఈవో, డిప్యూటీ డీఈవో వంటి పోస్టుల విషయంలోనూ కోర్టు కేసులు విద్యాశాఖకు వెంటాడుతున్నాయి. పంచాయతీ రాజ్‌ ఉపాధ్యాయులకూ ఈ పోస్టులు ఇవ్వాలనే డిమాండ్‌ తెరపైకి వచ్చింది. ఈ సమస్యలన్నీ తీరేవరకు ప్రమోషన్ల ప్రక్రియను చేపట్టే అవకాశం లేదని తెలుస్తోంది. పైగా జూన్‌ 13 నుంచి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. తీరా పాఠశాలలు ప్రారంభమైన తర్వాత బదిలీలు, ప్రమోషన్లు చేపడితే విద్యా సంవత్సరం డిస్టర్బ్‌ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయుల ప్రమోషన్లు, బదిలీలు ఆగస్టులో ఉండొచ్చనే వాదన వినిపిస్తోంది.

అదే క్యాడర్‌లో రిటైర్డ్‌ అవుతున్నారు: టీయూటీఎఫ్‌

- Advertisement -

ఏడు ఏళ్లుగా పదోన్నతులు, నాలుగేళ్లుగా బదిలీలు లేకపోవడంతో ఉపాధ్యాయులు అదే క్యాడర్‌లో రిటైర్‌ అవుతున్నారు. దీంతో టీచర్లు మానసిక ఆందోళనకు గురవుతున్నారు. పాఠశాలలు తెరిచేలోపు ఈ ప్రక్రియను పూర్తి చేసినట్లయితే వచ్చే విద్యా సంవత్సరం నుండి అమలు చేయనున్న ఆంగ్ల మాధ్యమం బోధన విజయవంతమవుతోంది. 317 జీవో కారణంగా స్థానికత కోల్పోయిన టీచర్లకు న్యాయం చేయాలి. బడులు తెరుచుకునేలోపు పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్‌లు విద్యార్థులకు అందజేయాలి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement