Saturday, May 4, 2024

సూడాన్ అంతర్యుద్ధంపై ప్రధాని మోడీ ఆందోళన

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: సూడాన్ అంతర్యుద్ధం, హింసాకాండలో చిక్కుకున్న భారతీయుల భద్రతపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. వారిని సురక్షితంగా స్వదేశానికి తరలించేందుకు ఉన్న అన్ని అవకాశాలను పరిశీలించాలని శుక్రవారం నిర్వహించిన అత్యున్నతస్థాయి సమీక్షలో అధికారులకు సూచించారు. వీడియో కాన్ఫరెన్స్ విధానంలో ప్రధాని నిర్వహించిన హైలెవెల్ రివ్యూ మీటింగ్‌లో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి, జాతీయ భద్రత సలహాదారు, సుడాన్‌లో భారత రాయబారితో పాటు పలువురు ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

సుడాన్‌లో తాజా పరిణామాలను ప్రధాన మంత్రి అడిగి తెలుసుకున్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో తాజా పరిస్థితిపై ఒక నివేదికను ప్రధానికి అందజేశారు. సూడాన్‌ దేశంలో వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న 3,000 మందికి పైగా భారతీయుల భద్రత కోసం తీసుకుంటున్న చర్యలను వివరించారు. కొద్ది రోజుల క్రితం అంతర్యుద్ధంలో గురితప్పి దూసుకొచ్చిన తుపాకీ తూటా తగిలి ఓ భారతీయుడు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ప్రధాని తన సంతాపాన్ని తెలియజేశారు.

అనంతరం అధికారులకు సూచనలిచ్చిన ప్రధాని మోదీ, సుడాన్‌లో సంబంధిత అధికారులు అత్యంత అప్రమత్తంగా, జాగరూకతతో ఉండాలని, పరిణామాలను నిశితంగా పర్యవేక్షించాలని సూచించారు. అలాగే అక్కడి భారతీయుల భద్రత గురించి ఎప్పటికప్పుడు సమీక్ష జరుపుతూ.. వారికి సాధ్యమైనంత మేర అన్ని విధాలుగా సహాయం అందజేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే యుద్ధభూమిగా మారిన సూడాన్ నుంచి భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తరలించేందుకు ఉన్న అన్ని అవకాశాలను పరిశీలించాలని, ఆ మేరకు ఒక ప్రణాళికను సిద్ధం చేయాలని ప్రధాని చెప్పారు. శరవేగంగా మారుతున్న పరిణామాలు, పెరుగుతున్న అశాంతి వాతావరణం, భద్రతాపరంగా ఎదురవుతున్న సవాళ్లను గమనిస్తూ రెస్క్యూ ప్లాన్ రూపొందించాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement