Monday, May 20, 2024

సీఎంల‌తో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్.. కొవిడ్ ప‌రిస్థితుల‌పై చ‌ర్చించే అవ‌కాశం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : దేశంలో మరోసారి కోవిడ్-19 కేసులు పెరుగుతున్న వేళ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశమవ్వాలని నిర్ణయించారు. నేడు (బుధవారం) మధ్యాహ్నం గం. 12.00కు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. పెరుగుతున్న కొత్త కేసులు, కొత్త వేరియంట్లు, దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు జరిగిన వ్యాక్సినేషన్ ప్రక్రియ, రాబోయే కోవిడ్-19 ఫోర్త్ వేవ్ ముప్పును ఎదుర్కొనేందుకు చేపట్టాల్సిన చర్యలపై ప్రధాని ముఖ్యమంత్రులతో చర్చించే అవకాశం ఉంది. దేశంలో ఇప్పటి వరకు 86% జనాభాకు రెండు డోసుల కోవిడ్-19 వ్యాక్సిన్ అందించినట్టు కేంద్ర ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఫ్రంట్‌లైన్ వర్కర్లు, వయోధికులకు బూస్టర్ డోస్ సైతం కేంద్ర ప్రభుత్వం ఉచితంగా అందజేసింది. మిగతా వయస్సువారు కావాలనుకుంటే 3వ డోసు వ్యాక్సిన్ పొందేందుకు వెసులుబాటు కల్పించింది.

మరోవైపు 12 ఏళ్లు దాటిన చిన్నారులకు ఇప్పటికే వ్యాక్సిన్ అందజేస్తుండగా, 5 నుంచి 12 ఏళ్ల మధ్య వయస్సు గల పిల్లల కోసం రూపొందించిన వ్యాక్సిన్లకు సైతం భారత ఔషధ నియంత్రణ మండలి అనుమతులు మంజూరు చేసింది. త్వరోలనే ఈ వ్యాక్సిన్లు వినియోగంలోకి రానున్నాయి. ప్రధాని ఏర్పాటు చేసిన సమావేశంలో వీటన్నింటి గురించి చర్చిస్తూ, కోవిడ్-19 కొత్త వేవ్ ను ఎదుర్కొనే క్రమంలో రాష్ట్రాల అవసరాలను తెలుసుకునేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement