Tuesday, April 30, 2024

ప్రజలు ధన రాజకీయాలను ప్రోత్సహించవద్దు : వెంకయ్య నాయుడు

దుత్తలూరు, జూన్ 11 (ప్రభ న్యూస్) : ప్రస్తుతం దేశంలో ధన రాజకీయాలు శాసిస్తున్నాయి.. అన్ని దేశాల‌కు కావాల్సింది గుణ రాజకీయాలు అని భారత మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు తెలిపారు. ఆయన నర్రవాడలోని శ్రీ వెంగమాంబ పేరంటాలును సతీ సమేతంగా దర్శించు కొన్ని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ అధికారులు ఆలయ లాంచనాలతో సత్కరించి అమ్మవారి ప్రసాదం అందచేశారు. అనంతరం శ్రీ వెంగమాంబ గెస్ట్ హౌస్ నందు ఉదయగిరి నియోజకవర్గ తన ఆత్మీయ మిత్రుల‌ను కలుసుకొని ఆప్యాయంగా పేరు పేరున పలకరించారు. అనంతరం జరిగిన సమావేశంలో మాట్లాడుతూ.. ఉదయగిరి నియోజక వర్గ ప్రజలు 1978 సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభంజనంలో ఉదయగిరి నుండి బీజేపీ ఎమ్మెల్యే గా గెలిపించారని తరువాత 1983లో టీడీపీ ప్రభంజనంలో నన్ను మరల బీజేపీ ఎమ్మెలేగా గెలిపించి నా రాజకీయ అభివృద్ధికి దోహదపడ్డారని తెలిపారు. ఉదయగిరి ప్రజలు నాకు రాష్ట్రంలో గుర్తింపు తెచ్చారని తెలిపారు. తరువాత జరిగిన పరిణామాల వలన ఆత్మకూరుకు వలస వెళ్లి అక్కడ ఓడిపోయానన్ని తెలిపారు. ఆత్మకూరు ప్రజలు ఓడించి తనను దేశం స్థాయిలో రాజకీయ ఎదుగుదలకు దోహద పడ్డారని తెలిపారు. దేశం స్ధాయిలో అనేక పదవులు అనుభవించాన‌న్నారు. దేశంలో ఉప రాష్ట్రపతి పదవితో నేను చేయాల్సిన పదవులు అన్ని చేశానని తెలిపారు. రాజకీయాలలో నాకు ఎటువంటి అసంతృప్తి లేదని తెలిపారు. యువత రాజకీయాల్లో రాణించాలని తరచూ పార్టీలు మారడం సబబు కాదని తెలిపారు. నేను బిజేపి పార్టీని నమ్ముకొని దేశం స్ధాయిలో గుర్తింపు పొందానని తెలిపారు. రాజకీయాలలో పదవి విరమణ పొందానని, ప‌దవి విరమణ పొందలేదని ప్రజలకు దేశానికి కావాల్సిన సందేశాలు ఎపుడు ఇస్తుంటానని తెలిపారు. ప్రస్తుతం రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా అందరూ వచ్చి ఆప్యాయంగా పలకరిస్తున్నారని తెలిపారు. ఉదయగిరి అభివృద్ధికి తమవంతు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉదయగిరి శాసన సభ్యులు మేకపాటి చంద్ర శేఖర రెడ్డి, మాజీ శాసన సభ్యులు బొల్లినేని వెంకట రామారావు, కంభం విజయ రామిరెడ్డి, జిల్లా ప్రజా పరిషత్ మాజీ చైర్మన్ పొన్నేబోయిన చెంచల బాబు యాదవ్, మాజీ ఎమ్మెల్సీ బీద రవి చంద్ర, బీజేపీ జిల్లా అధ్యక్షులు గుండ్లపల్లి భరత్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement