Monday, May 13, 2024

వ‌డ్ల పైస‌లు రైతులకు చెల్లించండి.. సీఎం కేసీఆర్‌కు బండి లేఖ‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : యాసంగి వడ్ల కొనుగోలు డబ్బులను వెంటనే రైతుల ఖాతాలలో జమ చేయాలంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుబండి సంజయ్‌ సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. యాసంగి ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ చేసిన పోరాటాలకు దిగివచ్చిన రాష్ట్ర ప్రభుత్వం వడ్ల కొనుగోలును చేపట్టిందని, వడ్లు కొన్నప్పటికీ వారికి చెల్లించాల్సిన డబ్బులను ఇంతవరకు చెల్లించలేదని గుర్తు చేశారు. ధాన్యం డబ్బుల చెల్లింపులో జాప్యం వల్ల అనేక జిల్లాలలో రైతాంగం ఆందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమవుతున్నా యాసంగి పంట డబ్బులు చేతికి అందక పోవడంతో రైతులు నానా అవస్థలు పడుతున్నారని, దీన్ని ఆసరాగా చేసుకుని కొన్ని జిల్లాల్లో ప్రైవేట్‌ వడ్డీ వ్యాపారులు రైతులకు అప్పుల ఆశ చూపి అధిక వడ్డీ వసూలు చేస్తున్నారని వివరించారు.

ఒక్క ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోనే 1286 కొనుగోలు కేంద్రాల ద్వారా 1,91,852 మంది రైతుల నుంచి 11.2 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించారని, ఈ మొత్తం ధాన్యం విలువ రూ. 2192.16 కోట్లు కాగా వీటిలో ఇంకా రూ. 517.16 కోట్లు రైతులకు చెల్లించాల్సి ఉందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అహంకార పూరిత ప్రకటనల వల్ల రైతాంగం దాదాపు 14 లక్షల ఎకరాలలో యాసంగిలో వరి పంట వేయలేదని, ఈ రైతాంగానికి నష్టం వాటిల్లిందన్నారు. ధాన్యం సేకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన వైఖరితో ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ అవసరాల కోసం సాధారణ రైతులను బలిపశువులను చేస్తున్నారన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement