Sunday, May 5, 2024

Big Story: రైతుల‌కు అండ, ధరణి సమస్యలకు చెక్‌.. భూ యాజమాన్య హక్కులకు మరింత భద్రత

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ధరణి సమస్యలను నివారించి మరింత సౌకర్యవంతంగా రైతాంగానికి మేలు చేసేలా చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. ఈ నేపథ్యంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించేందుకు సీసీఎల్‌ఏ కార్యాలయం కలెక్టర్లకు లేఖలు రాసింది. జిల్లా, మండలా, గ్రామం, సర్వే నెంబర్‌, ప్రభావిత విస్తీర్ణం, ఎందరు రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు…సమస్య, పరిష్కారం వంటి వివరాలతో కూడిన ప్రొఫార్మా కలెక్టర్లకు చేరింది. సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో సమస్యల నివారణ లక్ష్యంగా అధికారులు చకచకు ముందుకు కదులుతున్నారు. ఈ సమస్యలన్నటినీ గుర్తించి ఏకకాలంలో పరిష్కరించేలా చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.

ధరణి పోర్టల్‌ అమలులోకి వచ్చి దాదాపు 22 నెలలు కావొస్తోంది. ఇప్పటికే 5.50లక్షల ఫిర్యాదులు అధికారులకు చేరాయి. ఇందులో 2లక్షలకుపైగా పెండింగ్‌ మ్యుటేషన్‌ సమస్యలు, 1.80లక్షలకుపైగా ఇతర సమస్యలున్నాయి. నిషేదిత జాబితాలోని భూములపై 60వేలకుపైగా ఫిర్యాదులు పెండింగ్‌లో ఉన్నాయి. ధరణి పోర్టల్‌లో దొర్లిన తప్పులను సరిదిద్ది, సాంకేతికంగా మార్పులు చేసేందుకు మంత్రి హరీష్‌రావు అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించిన ప్రభుత్వం తాజాగా కలెక్టర్లనుంచి ధరణి సమస్యలపై వివరాలను సేకరించింది. సుమారు 18రకాల సవరణలకు సూచనలు రావడంతో సీఎం కేసీఆర్‌ తక్షణ చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.

ఈ నేపథ్యంలో నిషేదిత జాబితాలోనుంచి భూములను క్లీయర్‌ చేసేందుకు ప్రత్యేక ఆప్షన్‌ను కలెక్టర్ల లాగిన్‌లో ఇప్పటికే చేర్చారు. వేగవంతంగా సమస్యల పరిష్కారానికి గతంలో ఉన్న విధానంలో మార్పులు తీసుకొచ్చారు. ఇప్పటివరకు వివిధ రకాల సమస్యలపై 5.5లక్షలకుపైగా ఫిర్యాదులు రైతుల నుంచి వచ్చాయని, సుమారు 10లక్షలకుపైగా ఎకరాలకు చెందిన భూములు నిషేదిత జాబితాలో ఉండటంతో ఇబ్బందులు వస్తున్నాయని ప్రభుత్వానికి నివేదిక అందింది. ఈ నేపథ్యంలో గ్రామస్థాయిలోనే ప్రభుత్వ భూముల రిజిస్టర్‌ రూపొందించాలనే యోచనతోపాటు, ప్రభుత్వ భూముల పరిరక్షణ, జియో కోఆర్డినేట్స్‌ పిక్స్‌ చేయాలని, సర్వే మ్యాపింగ్‌ వివరాలను రిజిస్ట్రేషన్‌ శాఖకు పంపే యోచన పరిశీలిస్తున్నారు.

- Advertisement -

ప్రభుత్వ భూముల పరిరక్షణకు తీసుకున్న చర్యలపై జిల్లాల వారీగా అఫిడవిట్లు రూపొందించాలని కూడా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. తాజా సంస్కరణల్లో భాగంగా సీఎం కేసీఆర్‌ తక్షణమే కలెక్టర్లు రంగంలోకి దిగాలని ధరణి డ్యాష్‌బోర్డును ఫిర్యాదులు పెండింగ్‌లో లేకుండా చూడాలని ఆదేశించారు. కలెక్టర్ల లాగిన్‌లో అన్‌లాక్‌ ఆప్షన్‌ అందుబాటులోకి తెచ్చారు. అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు తీవ్ర ఇబ్బందిగా మారిన గ్రామకంఠం, నోటరీ డాక్యుమెంట్ల సమస్యలు కూడా పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ మేరకు ఇప్పటికే పంచాయితీరాజ్‌ గ్రామీణ అభివృద్ది శాఖకు ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. గ్రామాల్లో ఇప్పటికే ఇండ్లు ఉన్న భూములు, ఖాళీ స్థలాలను గుర్తించే ప్రక్రియ చురుగ్గా కొనసాగుతోంది.

రెవెన్యూ శాఖ సమన్వయంతో క్షేత్రస్థాయిలో అబాది భూములను అధ్యయనం చేసి సమగ్ర నివేదిక రూపొందిస్తున్నారు. గ్రామ పంచాయితీల వారీగా సేత్వార్‌, ఖాస్ర, సేస్లా, జమాబందీ, పైసల్‌పట్టి తదితర రికార్డుల ఆధారంగా గ్రామకంఠాల లెక్క తీసి ఎంత వినియోగంలో ఉంది, ఎంత వృధాగా ఉందనే వివరాలను లెక్క తీస్తున్నారు. ధరణి పోర్టల్‌లో నెలకొన్న 18 రకాల సమస్యలను తక్షణమే నివారించేలా పరిష్కార మార్గాలకు కీలక ఆదేశాలు జారీ అయ్యాయి. లక్షలాది ఎకరాల ప్రైవేట్‌ పట్టా భూములు, మాజీ సైనికుల భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించేలా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.

పాస్‌ పుస్తకాల్లో తప్పుల సవరణ, జాయింట్‌ రిజిస్ట్రేషన్‌, అసైన్డ్‌ భూముల విరాసత్‌, గతంలో సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసుల్లో జరిగిన క్రయ విక్రయాలకు మ్యుటేషన్లు వంటి సమస్యలకు చరమగీతం పాడేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ-పాస్‌ పుస్తకం ఉంటేనే రిజిస్ట్రేషన్లు జరుగుతున్న నేపథ్యంలో ఇంకా ఆరు లక్షల ఖాతాలకు వెంటనే పెండింగ్‌ పాస్‌ పుస్తకాలు జారీ చేసేలా కార్యాచరణ సిద్ధం చేశారు. డిజిటల్‌ సిగ్నిచర్లు, ఆధార్‌ సీడింగ్‌ పూర్తి చేసేలా ఆదేశాలు జారీ అయ్యాయి. భూమి మార్టిగేజ్‌లో నెలకొన్న సమస్యలపై పరిష్కార మార్గాలను సిద్ధం చేస్తున్నారు. రాష్ట్రంలో వెంచర్లుగా మారిన భూములను తక్షణమే వ్యవసాయేతర భూమిగా మార్పులు చేసేందుకు లెక్కలు తీస్తున్నారు.

రాష్ట్రంలో 63 లక్షల 25వేల 695 మంది రైతులకు చెందిన ఒక కోటి 50 లక్షల 18వేల ఎకరాల్లో వ్యవసాయ భూములు ఉన్నట్లుగా ధరణి రికార్డుల్లో ఉంది. అయితే పలు జిల్లాల్లో లక్షల ఎకరాలు వ్యవసాయేతర అవసరాలకు మార్పు చెందినట్టుగా అనధికారికంగా అంచనాలున్నాయి. అయితే వాస్తవికంగా సాగులో ఉన్న భూమి విస్తీర్ణం తేల్చి వాటినే ధరణిలో కొనసాగించాలని మిగతా వాటికి పాస్‌ పుస్తకాలు రద్దు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

రైతులకు ఇబ్బందులు నివారించి యాజమాన్య హక్కులు కల్పించేందుకు తక్షణమే సబ్‌ కమిటీ భేటీ కావాలని నిర్ణయించినట్టు తెలిసింది. పట్టా భూమిని అసైన్డ్‌గా చూపిన తీరుతో పాటు అనేక జిల్లాల్లో ఇనాం భూములకు చెందిన వివరాల సరిజేతకు కొత్త ఆప్షన్లు అందుబాటులోకి తెచ్చారు. గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో 32 జిల్లాల అధికారులు కీలక సమావేశాలు నిర్వహించి సమస్యలను నివేదించారు. వీటిని సబ్‌ కమిటీ పరిశీలించి ప్రభుత్వానికి సమర్పించి రైతుల సమస్యలను నివారించనున్నారు. తద్వారా ఇక మీదట ఎటువంటి సమస్యలు లేకుండా ధరణి పోర్టల్‌ను మరింత ఆధునీకరించే ప్రయత్నాలు తుది దశకు చేరాయి. అనంతరం 1.60 కోట్ల ఎకరాల వ్యవసాయ భూములు ధరణిలో చేరి రాష్ట్ర జీడీపీ మరో మూడు నుంచి నాలుగు శాతం పెరిగే అవకాశం ఉంది. అధికారులు చేసిన తప్పులను తొలగించి పోర్టల్‌ లక్ష్యాలను చేరాలని ఇప్పటికే సీఎం కేసీఆర్‌ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement