Monday, April 29, 2024

30 రోజుల్లోగా ఏపీ విద్యుత్ బకాయిలు చెల్లించండి.. తెలంగాణకు కేంద్రం ఆదేశాలు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన విద్యుత్ బకాయిల విషయంలో కేంద్రం జోక్యం చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014లోని సెక్షన్ 92ను ప్రయోగించి తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. 30 రోజుల్లోగా ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు చెల్లించాల్సిన బకాయిలను చెల్లించాల్సిందిగా కేంద్ర విద్యుత్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. భారత ప్రభుత్వ డిప్యూటీ సెక్రటరీ అనూప్ సింగ్ బిష్త్ పేరిట ఈ ఉత్తర్వులు విడుదలయ్యాయి. విభజన చట్టంలో పొందుపర్చిన మేరకు ఆంధ్రప్రదేశ్ విద్యుదుత్పత్తి సంస్థలు 2014 జూన్ 2 నుంచి 2017 జూన్ 10 వరకు తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలకు విద్యుత్తును అందజేశాయని, అయితే ఈ మేరకు చెల్లింపులు జరపలేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రానికి ఫిర్యాదులు అందాయని ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

బకాయిపడ్డ మొత్తం సొమ్ము రూ. 3,441.78 కోట్లకు లేట్ పేమెంట్ సర్‌చార్జ్ (2022 జులై 31 వరకు) రూ. 3,315.14 కోట్లు కలిపి మొత్తం రూ. 6,756.92 కోట్లు చెల్లించాలని కేంద్ర విద్యుత్ శాఖ తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. 30 రోజుల్లోగా ఈ మొత్తం చెల్లించాలని ఆదేశాల్లో స్పష్టం చేసింది. ఈ ఉత్తర్వుల కాపీలను రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో పాటు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థల సీఎండీలకు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యుత్ ఉత్పత్తి సంస్థల సీఎండీలు సహా మరికొందరు అధికారులకు పంపించింది

Advertisement

తాజా వార్తలు

Advertisement