Monday, April 29, 2024

తెలంగాణాకు మరోసారి వానగండం.. తొమ్మిది జిల్లాలకు వడగండ్ల ముప్పు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : తెలంగాణాకు మరోసారి వానగండం పొంచివుందన్న వార్త ఒకవైపు వ్యవసాయ రంగాన్ని, రైతాంగాన్ని, మరోవైపు ప్రభుత్వాన్ని, అధికార యంత్రాంగాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. రాబోయే 3 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో మోస్తరు వర్షంతో పాటు భారీ ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని శనివారం రాత్రి 8 గంటలకు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తాజా బులెటిన్‌లో ప్రకటించింది. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, నారాయణపేట, సంగారెడ్డి, వరంగల్‌, భద్రాద్రి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ జిల్లాలకు వడగండ్ల ముప్పు పొంచివుందని తెలిపింది. మత్స్యకారులు, రైతులు, కూలీలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

వర్షాల కంటే ఈదురు గాలుల ప్రభావం అధికంగా ఉంటుందని.. గంటకు 41 నుంచి 61 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అక్కడక్కడ పిడుగులు పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రజలు ఇళ్ల వద్దనే ఉండాలని సూచించారు. మరోవైపు శనివారం రాత్రి భాగ్య నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. నగరంలోని కేపీహెచ్‌బీ, హైదర్‌నగర్‌, నిజాంపేట, ప్రగతినగర్‌, కూకట్‌పల్లి, దుండిగల్‌, మల్లంపేట్‌, గండి మైసమ్మ, సూరారం, గాగిల్లాపూర్‌, కొండాపూర్‌, శేరిలింగంపల్లి, మియాపూర్‌, చందానగర్‌, మదీనాగూడ తదితర ప్రాంతాల్లో కురిసిన వర్షానికి రహదారులపై నీరు నిలిచింది. దీంతో వాహనచోదకులు, పాదచారులు ఇబ్బంది పడ్డారు. నాగర్‌ కర్నూలు జిల్లా కేంద్రంలోనూ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది.

పొంచి ఉన్న మరో తుపాను

ఆగ్నేయ బంగాళాఖాతం.. దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇది సముద్ర మట్టం నుంచి మధ్య ప్రోపోస్పిరిక్‌ స్థాయి వరకు కొనసాగుతుందని పేర్కొంది. దీని ప్రభావంతో ఈ నెల 8వ తేదీ ఉదయం అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ప్రకటించింది. ఇది మరుసటి రోజున వాయుగుండంగా కేంద్రీకృతమయ్యే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం సంచాలకులు విడుదల చేసిన ప్రకటనలో వివరించారు. ఈ వాయుగుండం ఉత్తరం దిశగా పయనిస్తూ మధ్య బంగాళాఖాతం వైపునకు కదులుతూ తీవ్ర తరమై తుపాన్‌గా బలపడే అవకాశం ఉందని సంచాలకులు ప్రకటించారు.

- Advertisement -

ఆందోళనలో అన్నదాతలు

అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన రైతులు.. వాతావరణ శాఖ చేసిన ప్రకటనలతో మరింత ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే ఈదురు గాలులు, వడగళ్ల వర్షాలతో వరి, మామిడి, మొక్కజొన్న రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈదురు గాలులతో వరి ధాన్యం చాలా వరకు నేల రాలగా.. మిగిలిన పంటను కోయడానికీ రైతులు ఇష్టపడటం లేదు. అవి కోసినా కనీసం పెట్టు-బడి కూడా రాదని వాపోతున్నారు. మరికొన్ని పంటలు కోతకు సిద్దంగా ఉండగా.. తాజా ప్రకటన రైతుల్లో ఆందోళన కల్గిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement