Friday, April 26, 2024

ఓపెక్‌ నుంచి త‌గ్గి.. రష్యా నుంచి పెరిగిన చమురు దిగుమతులు

మన దేశం చమురు దిగుమతులపై గతంలో ఎక్కువగా ఓపెక్‌ దేశాలపైనే ఆధారపడేది. ప్రధానంగా మిడిల్‌ ఈస్ట్‌, ఆఫ్రికా దేశాల నుంచి మన దేశం 72 శాతం చమురు దిగుమతి చేసుకునేంది. ప్రస్తుతం ఓపెక్‌ దేశాల నుంచి చమురు దిగుమతులు క్రమంగా తగ్గిపోతున్నాయి. ఏప్రిల్‌ నెలలో ఆల్‌ టైమ్‌ గరిష్టానికి చేరింది. ఈ నెలలో కేవలం 46 శాతం మాత్రమే ఓపెక్‌ దేశాల నుంచి మన దేశం చమురును దిగుమతి చేసుకుంది. ఉక్రెయిన్‌ పై దాడి తరువాత అమెరికా, దాని మిత్ర దేశాలు రష్యాపై ఆంక్షలు అమలు చేస్తున్నాయి. రష్యా నుంచి ఈ దేశాలు ఎగుమతులు, దిగుమతులను నిషేధించాయి. దీంతో రష్యా తాను ఉత్పత్తి చేస్తున్న చమురును డిస్కౌంట్‌ ధరకే విక్రయిస్తోంది. మన దేశం తక్కువకే వస్తున్నందున రష్యా నుంచి భారీగా దిగుమతులు పెంచింది. 2022 ఏప్రిల్‌లో మన దేశం ఓపెక్‌ దేశాల నుంచి మన దేశీయ అవసరాల్లో 72 శాతం దిగుమతి చేసుకుంటే, ఈ సంవత్సరం ఏప్రిల్‌లో ఇది 46 శాతానికి తగ్గిందని ప్రభుత్వం విడుదల చేసిన తాజా నివేదిక పేర్కొంది. ఒక దశలో మన దేశం 90 శాతం చమురును ఓపెక్‌ దేశాల నుంచే దిగుమతి చేసుకుంది. రష్యా చమురు దిగుమతులతో ఈ పరిస్థితి మారిపోయింది.

- Advertisement -

నెంబర్‌ 1 సరఫరాదారుగా రష్యా …

ఏప్రిల్‌ నెలలో మన దేశం రోజుకు 4.6 మిలియన్‌ బేరళ్లను దిగుమతి చేసుకుంది. ఇందులో ఓపెక్‌ దేశాల నుంచి రోజుకు 2.1 మిలియన్‌ బేరళ్ల చమురును మాత్రమే దిగుమతి చేసుకుంది. రష్యా నుంచి మన దేశ అవసరాల్లో మూడో వంతు ముడి చమురును దిగుమతి చేసుకుంటున్నాం. ఇలా గత 7 నెలలుగా వరసగా రష్యా నుంచే అధికంగా చమురును దిగుమతి చేసుకున్నాం. అనేక సంవత్సరాలుగా మన దేశం అత్యధికంగా ఇరాక్‌, సౌదీ అరేబియా నుంచే దిగుమతి చేసుకుంటున్నాం. రష్యా నుంచి చమురు దిగుమతులు పెరగడంతో ఇక్కడి నుంచి గణనీయంగా దిగుమతులు తగ్గాయి. గత ఏడు నెలలుగా మనకు చమురు సరఫరా చేస్తున్న దేశాల్లో రష్యానే మొదటి స్థానంలో ఉంది. ఏప్రిల్‌లో రష్యా నుంచి దిగుమతి చేసుకున్న చమురు మొత్తం ఇరాక్‌, సౌదీ అరేబియా నుంచి చేసుకున్నదాని కంటే ఎక్కువగా ఉంది.

1 నుంచి 36 శాతానికి…

2022, ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై రష్యా దాడికి దిగడానికి ముందు రష్యా నుంచి మన దేశానికి దిగుమతి అవుతున్న ముడి చమురు వాటా 1 శాతం కంటే తక్కువగా ఉంది. ఈ ఏప్రిల్‌లకు ఇది 36 శాతానికి పెరిగింది. ఏప్రిల్‌లో మన దేశం రష్యా నుంచి ప్రతి రోజూ 1.67 మిలియన్‌ బేరళ్ల చమురును దిగుమతి చేసుకుంది. గతంలో రష్యా నుంచి చమురును దిగుమతి చేసుకునేందుకు షిపింగ్‌ ఖర్చులు ఎక్కువగా అయ్యేవి అందుకే మన దేశం దగ్గరగా ఉన్న సౌదీ, ఇరాక్‌ నుంచే ఎక్కువ చమురును దిగుమతి చేసుకునేంది. ప్రస్తుతం పశ్చిమ దేశాలకు షిపింగ్‌ లేనందున అవి కూడా తక్కువ రేటుకే లభిస్తున్నాయి. దీంతో చమురు డిస్కౌంట్‌తో పాటు, రవాణా ఖర్చులు కూడా గతం కంటే భారీగా తగ్గడంతో దిగుమతులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. మార్చిలో ఇరాక్‌ నుంచి 0.81 మిలియన్‌ బేరళ్ళ చమురు మన దేశానికి వచ్చింది. రష్యా నుంచి దీనికి రెట్టింపు చమురు దిగుమతి అయ్యింది.

2017-18 వరకు మన దేశానికి చమురును విక్రయిస్తున్న దేశాల్లో ఇరాక్‌ అగ్రస్థానంలో ఉంది. తరువాత సౌదీ అరేబియా చమురు సప్లయ్‌లో అగ్రస్థానంలో కొనసాగింది. సౌదీ అరేబియా నుంచి మార్చిలో 0.67 మిలియన్‌ బేరళ్ళ చమురు మన దేశానికి వచ్చింది. ప్రస్తుతం మన దేశానికి చమురు సరఫరా చేస్తున్న దేశాల్లో రష్యా అగ్రస్థానంలోనూ, ఇరాక్‌ రెండో స్థానంలో, సౌదీ అరేబియా మూడో స్థానంలో ఉన్నాయి. రష్యా నుంచి మన చమురు దిగుమతులు పెరుగుతూ మార్చిలో 1.64 మిలియన్‌ బెెరళ్ళకు చేరింది. మార్చిలో అమెరికా నుంచి కంటే యూనైటెడ్‌ అరబ్‌ ఎమరేట్స్‌ నుంచి మన దేశం ఎక్కువ దిగుమతి చేసుకుంది. అమెరికా నుంచి రోజుకు 1,19,000 బేరళ్ల చమురు దిగుమతి అయితే, యూఏఈ నుంచి 1,85,000 బేరళ్ళ చమురు దిగుమతి అయ్యింది. ఏప్రిల్‌లో రష్యా నుంచి దిగుమతులు రికార్డ్‌ స్థాయికి చేరాయి. రష్యా నుంచి చైనా కూడా రికార్డ్‌ స్థాయిలో ముడి చమురును దిగుమతి చేసుకుంటోంది.

రష్యా నుంచి చమురు దిగుమతిలో మనకు చైనా నుంచే గట్టి పోటీ ఎదురవుతోంది. గత సంవత్సరం డిసెంబర్‌లో యూరోపియన్‌ యూనియన్‌ రష్యా చమురు ఎగుమతులపై ఆంక్షలు విధించింది. 60 డాలర్ల ప్రైస్‌ క్యాప్‌ విధించింది. మన దేశానికి రష్యా నుంచి ఈ ప్రైస్‌ క్యాప్‌ కంటే తక్కువకే చమురు దిగుమతి చేసుకుంటున్నాం. రష్యా నుంచి మన దేశం 2022 మార్చిలో కేవలం రోజుకు 68,600 బేరళ్ల చమురును మాత్రమే దిగుమతి చేసుకుంటే, ఈ సంవత్సరం మార్చి నాటికి ఇది రోజుకు 16,78,000 బేరళ్లకు చేరిందని ప్రముఖ చమురు విశ్లేషణ సంస్థ వోర్‌టెక్స్‌ తెలిపింది. రష్యా నుంచి ముడి చమురును, పెట్రోల్‌, డీజిల్‌ను నేరుగా కొనుగోలు చేయడం సాధ్యం కాని చాలా యూరోపియన్‌ దేశాలు మన దేశం నుంచి భారీగా చమురును దిగుమతి చేసుకుంటున్నాయి. రష్యా నుంచి చమురు కొంటున్న మన దేశం అదే చమురును పలు యూరోపియన్‌ దేశాలకు విక్రయిస్తోంది. ఇందులో ప్రధానంగా ప్రైవేట్‌ కంపెనీలు ఈ రకమైన బిజినెస్‌ చేస్తూ భారీగానే లాభాలు ఆర్జిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement