Saturday, April 20, 2024

ఢిల్లీలో ప్రశంసలు ఇక్కడ తిట్లా.. కేంద్రంపై నిప్పులు చెరిగిన మంత్రి హరీశ్​

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: కేంద్రమంత్రులు ఢిల్లీలో మెచ్చుకుని.. గల్లీలో తిడుతున్నారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌ రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దివంగత ప్రధాని తెలంగాణకు చెందిన మహా నేత పీవీ నరసింహారావు ఘాట్‌ నిర్మాణానికి కాంగ్రెస్‌ పార్టీ అనుమతి ఇవ్వకుండా ఆ నేతను తీవ్రంగా అవమానపరిచిందని మండిపడ్డారు. అయినా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెటర్నరీ యూనివర్సిటీకి పీవీ పేరు పెట్టి ఆయన గౌరవాన్ని మరింత పెంచారని గుర్తు చేశారు సిద్దిపేట జిల్లాలో ఆదివారం రాష్ట్ర మంత్రులు హరీష్‌ రావు, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు.

సిద్దిపేట పట్టణంలో నిర్మించనున్న పీవీ నర్సింహారావు వెటర్నరీ వర్సిటీకి శంకుస్థాపన చేశారు. ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డి, ఎమ్మెల్సీ ఫరూఖ్‌ హుసేన్‌, స్థానిక ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పీవీ నర్సింహారావు వెటర్నరీ వర్సిటీ- నిర్మాణానికి శంకుస్థాపన అనంతరం మాట్లాడిన ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్రమంత్రులు ఢిల్లీలో మెచ్చుకుంటూ గల్లీలో తిడతారని ఎద్దేవా చేశారు. కాళోజీ నారాయణరావు, కొండా లక్ష్మణ్‌ బాపూజీ పేర్లతో వర్సిటీలు ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు. మత్స్య సంపద అభివృద్ధిలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. రైతు ఏడ్చిన రాష్ట్రం ముందుకు పోదంటారని అందుకే వారి సంక్షేమానికి కేసీఆర్‌ ప్రభుత్వం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉండని స్పష్టం చేశారు.

మూగజీవాలకు సైతం కేసీఆర్‌ నాయకత్వంలో విస్తృత సేవలు అందిస్తున్నామని, పశుపాఖాదులకు 1962కు ఫోన్‌ చేస్తే అంబులెన్స్‌ సేవలు అందుతాయన్నారు. 1962ను తెలంగాణ ప్రభుత్వం అందుబాటులోకి తెస్తే.. దాన్ని కాపీ కొట్టి కేంద్ర ప్రభుత్వం దేశమంతా అమలు చేస్తోందని దుయ్య బట్టారు. మిషన్‌ భగీరథ, రైతుబందు పథకాలను కూడా కాపీ కొట్టి అది తమ పథకమంటూ గొప్పలు చెప్పుకుంటోందని ఎద్దేవా చేశారు. కేంద్రం తెలంగాణకు అవార్డుల మీద అవార్డులు ఇచ్చి తెలంగాణకు వచ్చి ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఎండాకాలంలోనూ జలసిరి పెరిగి అలుగు పారుతున్నాయని, సిద్దిపేట జిల్లలో 12460 మందికి మత్స్యకారులకు కొత్తగా సభ్యత్వం కల్పిస్తున్నామని చెప్పారు.

- Advertisement -

3.70 లక్షల మందికి రెండో విడత గొర్రెల పంపిణీ: తలసాని

వెటర్నరీ కాళాశాల సిద్దిపేటకు ఇచ్చినందుకు సీఎం కేసీఆర్‌కు పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కృతజ్ఞతలు తెలిపారు. విద్యా రంగాన్ని సీఎం కేసీఆర్‌ పెద్ద ఎత్తున ఎంతగానో ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. అద్భుతమైన రిజర్వాయర్లు నిర్మించుకున్నామని, గతంలో లక్షా 37 వేళ ఉద్యోగాలు ఇచ్చామని, మళ్ళీ 97 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లను జారీ చేశామని పేర్కొన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల మీద జరిగిన సుదీర్ఘ పోరాటానికి ఈనాటి పచ్చని తెలంగాణ సమాధానమన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడిందని చెప్పారు.

ప్రజలు వాస్తవాలు గుర్తించాలని కోరారు. రాష్ట్రంలో 24 గంటల నిరంతరాయంగా విద్యుత్‌ అందిస్తున్నామని.. ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో కూడా 24 గంటల కరెంట్‌ లేదని చెప్పారు. గత పాలకులు గొల్లకుర్మలు, రైతులు, మహిళల పాట్లు తీర్చారా ? అని ప్రశ్నించారు. తెలంగాణలో జరుగుతున్న ప్రగతి ప్రతిపక్ష పార్టీలకు కనిపించడం లేదా అని నిలదీశారు. వారు కళ్ళున్నా చూడలేని కాబోదుల్లా మారారన్నారు. మత్స్య సొసైటీల్లో 3.72 లక్షల మంది సభ్యులుగా ఉన్నారు.. మరో లక్ష మందికి సభ్యత్వం ఇస్తున్నామని తెలిపారు. ఈ నెల చివరిలో రెండో విడత గొర్రెల పంపిణీ చేపట్టనున్నట్లు చెప్పారు. రెండో విడతలో 3.70 లక్షల మందికి గొర్రెల పంపిణీ చేయనున్నట్లు మంత్రి తలసాని స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement