Sunday, April 28, 2024

అడ్డగోలు దోపిడీ! మద్దతు ధరల్లో కోత.. తేమ పేరుతో వాత

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : ఒకప్పుడు దండగన్న వ్యవసాయాన్ని పండగలా మార్చి రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అహర్నిషలూ కృషి చేస్తుంటే, క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం, వ్యాపారులు, మిల్లర్లు కుమ్మక్కై రాబందుల్లా పీక్కు తింటున్నారు. అసలే పంట చేతికొచ్చిన సమయంలో దండి కొడుతున్న అకాల వర్షాలతో అన్నదాతలు తల్లడిల్లుతుంటే, ఇదే అదునుగా గ్రామాల్లో చీకటి వ్యాపారం జోరందుకుంది. క్లిష్ట పరిస్థితుల్లో ప్రారంభమైన ధాన్యం కొనుగోళ్ళ ప్రక్రియలో అడ్డగోలుగా దోపిడీ జరుగుతోంది. ప్రభుత్వ లక్ష్యాలను చేరుకునే ప్రయత్నం చేస్తామంటూ ప్రకటిస్తూనే.. గ్రామాల్లో ప్రైవేటు వ్యాపారులకు, మిల్లర్లకు వంతపాడుగున్నారు అధికారులు.

ఉన్నతస్థాయి పర్యవేక్షణ కొరవడడంతో కొనుగోలు కేంద్రాల ఇంఛార్జిలు సామంతరాజుల్లా వ్యవహరిస్తున్నారు. అదేమని ప్రశ్నిస్తే, మీరు తెచ్చిన ధాన్యం ఇప్పటికిప్పుడు కొనుగోలుకు పనికిరాదని, మరింతగా ఆరబెట్టి తీసుకురావాలని రిజక్ట్‌ చేస్తున్నారు. ఈ విధానంపై ప్రశ్నపించే అవకాశం లేకపోవడంతో చెమటోడ్చి, కష్టపడి పండించిన రైతన్నలు కిమ్మనక తలాడిస్తున్నారు. అకాల వర్షాల నేపథ్యంలో రైతుల్లో ఉన్న ఆందోళన, తొందరగా అమ్ముకోవాలన్న ఆతృతను అదునుగా చేసుకుని మద్దతు ధరల్లో అమాంతం కోత విధిస్తున్నారు. తేమ పేరుతో ధరలు తగ్గించి రైతుకు వాత పెడుతున్నారు.

- Advertisement -

ఈ వ్యవహారంలో పార్టీలకు అతీతంగా స్థానిక రాజకీయ నాయకులంతా కుమ్మక్కై నిత్యం వ్యాపార లావాదేవీల్లో జోక్యం చేసుకుంటున్నారు. చైతన్యవంతులైన రైతులు అక్కడక్కడ యంత్రాంగాన్ని నిలదీస్తే, సమస్య చిలికిచిలికి గాలివానలా మారుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎటుతిరిగి స్థానిక రైతులకే నష్టం కలుగుతోంది. తాజాగా, ధాన్యం అత్యధికంగా పండించిన ఉమ్మడి నల్గొండ, కరీంనగర్‌ జిల్లాల్లో కొనుగోళ్ళ అక్రమాలపై రైతులు రోడ్డెక్కిన సందర్భాలు అనేకంగా వెలుగులోకి వచ్చాయి. ధాన్యం కొనుగోళ్ళకు నేతృత్వం వహిస్తున్న ఐకేపీ, ప్యాక్స్‌ కేంద్రాల్లో అంతా స్థానిక రాజకీయమే కొనసాగుతోంది.

ప్రైవేటు కొనుగోలుదారులకు వత్తాసు పలుకుతూ అందినకాడికి దోచుకునే ప్రయత్నం జరుగుతోంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరలు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా అమలు కావడంలేదు. ధర నిర్ణయంలో స్థానిక మిల్లర్లు, వ్యాపారులు అంతా కుమ్మక్కై సిందికేట్‌ దోపిడీకి దిగుతున్నారు. రైతుల ఆత్రుతే అదునుగా మద్దతు ధరలు తగ్గించి కొనుగోళ్ళు చేస్తూ, ఎంఎస్‌పీలో ప్రతి క్వింటాలుకు రూ.200 నుంచి రూ.400 వరకు తగ్గించి లెక్కల చీటీలు రైతుల చేతిలో పెడుతున్నారు. అదికూడా కనీసం పక్షం రోజులు, గరిష్టంగా నెల రోజుల్లో డబ్బులు చేస్తిస్తామంటూ హామీలిస్తున్నారు.

ప్రతి గ్రామంలోనూ దాదాపుగా కొనుగోళ్ళ ప్రక్రియలో ఇదే తంతు జరుగుతోంది. తేమ, తాలు పేరుతో ప్రతి క్వింటాలుకు 10 కిలోల వరకు కోత విధిస్తున్నారు. పారదర్శకంగా కొనుగోళ్ళు జరుగుతున్నాయంటూ జిల్లా కలెక్టర్లు ప్రకటిస్తున్నప్పటికీ, ప్రభుత్వానికి నిత్యం నివేదికలను పంపిస్తున్నప్పటికీ గ్రామాల్లో ఇప్పటికీ దళారులదే రాజ్యం నడుస్తోందని స్థానిక వాస్తవ పరిస్థితులు చెబుతున్నాయి.

అధిక దిగుబడులే రైతుకు శాపంగా మారుతుండడం, తడిసిన ధాన్యం లక్షల క్వింటాళ్ళలో మొలకెత్తే దశకు చేరుకోవడం లాంటి సమస్యలు చుట్టుముట్టి నిండా ముంచేస్తున్నాయి. ప్రశ్నిస్తే కొనుగోళ్ళ తిరస్కరణ, వెంటాడుతున్న అకాల వర్షాలతో ఇంకా నష్టపోవాల్సి వస్తున్నందున నోళ్ళు మూసుకోవడం తప్ప రైతులకు మరో మార్గం లేకుండా పోతోంది. ఉమ్మడి నల్గొండ, కరీంనగర్‌, మెదక్‌, నిజామాబాద్‌, వరంగల్‌ రైతులకు శాపం తేమ, తాలు పేరుతో కిలోలకు కిలోలు కటింగ్‌ చేస్తుండడంతో పెట్టుబడి సైతం చేతికందని దుస్థితి నెలకొంటోంది. దిక్కుతోచక ప్రైవేటు- వ్యాపారుల వైపు పరుగులు పెడుతూ, క్వింటాలుకు రూ.400 వరకు తక్కువైనా అమ్మేసుకుంటున్నారు.

అగ్గువకే అమ్ముకోవడానికి ఇవీ కారణాలు..

ఐకేపీ, పీఏసీఎస్‌ కేంద్రాల్లో కొనుగోళ్లు ఆలస్యమవుతుండడం, మిల్లుల్లో అన్‌ లోడింగ్‌ ఆగిపోవడంతో దిక్కుతోచని రైతులు వడ్లను బయట అగ్గువకే అమ్ముకుంటు-న్నారు. తేమ పేరుతో సెంటర్లలో కొనుగోళ్లకు నిరాకరిస్తున్న మిల్లర్లు.. తప్పనిసరై దింపుకుంటే క్వింటాలుకు 5 నుంచి 10 కిలోల దాకా తరుగుతీస్తున్నారు. వానలు ఇంకా తగ్గుముఖం పట్టకపోవడంతో ఆందోళనలో ఉన్న రైతులు వీలైనంత త్వరగా వడ్లను అమ్ముకునేందుకు మొగ్గుచూపుతున్నారు. ఇదే అదునుగా మిల్లర్లు, ప్రైవేట్‌ వ్యాపారులు సెంటర్ల నుంచి వచ్చిన వడ్లను మిల్లుల్లో దింపుకోకుండా రైతుల నుంచి నేరుగా కొంటు-న్నారు. ఈ ఏడాది ధాన్యం మద్దతు ధర క్వింటాలుకు రూ.2,040 ఉండగా, రూ.1,600 నుంచి రూ.1,800 వరకు తక్కువ ధరలతో రైతుల దగ్గర కొనుగోలు చేస్తున్నారు. దీంతో మద్దతు ధరతో పోలిస్తే క్వింటాలుపై రూ.200 నుంచి రూ.400 వరకు అన్నదాతలు నష్టపోతున్నారు.

రోజుల తరబడి ఎదురుచూపులూ ఓ కారణమే..

ఐకేపీ, పీఏసీఎస్‌ కేంద్రాల్లో వడ్ల కొనుగోళ్ల కోసం రోజుల తరబడి రైతులు ఎదురుచూడాల్సి వస్తోంది. యాసంగి కొనుగోళ్ల లక్ష్యం 80.46 లక్షల మెట్రిక్‌ టన్నులు కాగా, ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 6,087 కేంద్రాల ద్వారా 18 లక్షల మెట్రిక్‌ టన్నుల వరకు మాత్రమే ధాన్యాన్ని సేకరించారు. కొనుగోళ్లు మొదలై నెల రోజులు గడుస్తున్నా దిగుబడుల అంచనాలో 20 శాతం కూడా కొనుగోళ్ళు జరుగక పోవడం ఆందోళన కలిగిస్తోంది. ఊహించని విధంగా వస్తున్న అకాల వర్షాలతో ఆరబోసిన ధాన్యం కుప్పలు కొట్టు-కుపోతుండడంతో రైతుల్లో ఓపిక నశించి తక్కువ ధరకే ప్రైవేట్‌ వ్యాపారులకు అమ్ముకుంటు-న్నారు. వరుసగా కురుస్తున్న వర్షాలతో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లాల్లో ఐకేపీ సెంటర్లు, కల్లాల్లో పోసిన వడ్లు పుట్ల కొద్దీ కొట్టు-కుపోగా, చాలాచోట్ల మొలకలొచ్చాయి. బాయిల్డ్‌ రైస్‌ మిల్లులకు వచ్చే వడ్లలో 20 శాతం వరకు తేమ ఉన్నా తీసుకోవాలని సంబంధిత శాఖామంత్రి గంగుల కమలాకర్‌ ఇటీ-వల బాయిల్డ్‌ రైస్‌ మిల్లర్స్‌ను ఆదేశించారు.

నష్టం వస్తుందన్న కారణంతో మొండికేస్తున్న మిల్లర్లు

తమకు నష్టం వస్తుందనే కారణంతో తడిసిన వడ్లను కొనేందుకు మిల్లర్లు మొండికేస్తున్నారు. 17 శాతం తేమ దాటితే చాలు ఇష్టారాజ్యంగా కోత పెడుతున్నారు. 60 క్వింటాళ్ల లోడులో కొందరు 5 క్వింటాళ్లు మైనస్‌ చేస్తుంటే.. మరికొందరు ఆరేడు క్వింటాళ్ల వరకు కటింగ్‌ పెడుతున్నారు. దీంతో ఒక్కో లోడ్‌పై రైతులు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు నష్టపోతున్నారు. ఈ దోపిడీని సహించలేక ఎవరైనా రైతులు వెనక్కి వస్తే ట్రాక్టర్‌ కిరాయిలు రూ.3 వేలు, హమాలీ ఖర్చులు మరో రూ.2 వేలు మీద పడే పరిస్థితి ఉంటు-న్నది. దీంతో చాలా మంది రైతులు మిల్లర్లు చెప్పినట్లు- కటింగ్‌ కు ఒప్పుకుంటు-న్నారు. ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లోనూ ఒక్కో చోట ఒక్కో విధంగా తరుగు తీస్తున్నారు. 40 కిలోల బస్తాను కాంటా వేసినప్పుడు 42 కిలోలు, 42.50 కిలోలు, మరికొన్ని చోట్ల 43 కేజీలు ఉండేలా చూస్తున్నారు. తీరా రైస్‌ మిల్లుకు తీసుకెళ్లాక మొత్తం ఎన్ని క్వింటాళ్ల వడ్లు ఉన్నాయో చూసి.. క్వింటాకు 8 నుంచి 11 కిలోలు తరుగు తీస్తున్నారు. ఇలా ఒక్కో లోడ్‌ లో 60 క్వింటాళ్ల వడ్లు ఉంటే 5 నుంచి 7 క్వింటాళ్ల వడ్లను తాలు, తేమ పేరిట మైనస్‌ చేస్తుండడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement